ఐటీకి మౌలిక వసతులు
ABN , Publish Date - May 10 , 2026 | 12:26 AM
విశాఖపట్నంలో ఐటీ సంస్థలకు అవసరమైన మౌలిక వసతులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది.
కాపులుప్పాడ, రుషికొండ, మధురవాడ ప్రాంతాల్లో రహదారుల విస్తరణ
ప్రస్తుతం పది వేల మంది ఉద్యోగులు
భూములు తీసుకున్న కంపెనీలన్నీ కార్యకలాపాలు ప్రారంభిస్తే ఆ సంఖ్య 1.2 లక్షలకు పెరిగే అవకాశం
భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు నిర్మాణాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నంలో ఐటీ సంస్థలకు అవసరమైన మౌలిక వసతులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఐటీ సంస్థలకు ఇబ్బడిముబ్బడిగా భూములు కేటాయిస్తున్న ప్రభుత్వం...వాటి నిర్మాణాలు పూర్తయితే ఆయా మార్గాల్లో ఉద్యోగుల రాకపోకలు పెరుగుతాయని, అందుకు తగ్గట్టుగా ముందుగానే ఆ ప్రాంతాల్లో రహదారులు విస్తరించాలని వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీలను ఆదేశించింది.
కాపులుప్పాడ, రుషికొండ, మధురవాడ ప్రాంతాల్లో ఇప్పటికే 30కి పైగా ఐటీ సంస్థలు నడుస్తుండగా, పది వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా ఎక్కువగా మధురవాడ, రుషికొండ మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నారు. తాజాగా కాపులుప్పాడ ఐటీ లేఅవుట్‌లో రుషికొండ హిల్ నంబరు 3పై పెద్ద సంస్థలకు భూములు కేటాయించారు. అధికారుల లెక్కల ప్రకారం కొత్తగా 63 కంపెనీలు రానున్నాయి. ఇప్పుడున్న ఉద్యోగులు, కొత్త కంపెనీల్లో లభించే ఉద్యోగాలతో కలిపి మొత్తం 1.2 లక్షల మంది ఆయా ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారని అంచనా.
ప్రస్తుతం ఇన్ఫోసిస్, కాండ్యుయెంట్, సింబయోసిస్, మహతి టెక్నాలజీస్, సాఫ్ట్ సోల్, కలర్ చిప్స్, క్లోవ్ టెక్నాలజీస్, సాంఖ్య టెక్నాలజీస్, సైయెంట్, ఏపీ ఇన్నోవేషన్ సొసైటీలకు పది వేల ముంది వస్తున్నారు. త్వరలో టీసీఎస్, రహేజా సంస్థలు చెరో పది వేల మందికి హిల్ 3పైనే ఉపాధి కల్పించనున్నాయి. ఇటు చూసుకుంటే కాగ్నిజెంట్ 25 వేల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. అదే విధంగా ఫ్లూయెంగ్ గ్రిడ్, మదర్‌సన్, సిఫీ తదితర సంస్థలు పనుల ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. కాపులుప్పాడలో ఐటీ లేఅవుట్‌లో కూడా శరవేగంగా పనులు చేపట్టాలని ఏపీఐఐసీ సూచించింది. ఆయా సంస్థలన్నీ హామీ ఇచ్చిన ఉద్యోగ అవకాశాలు 2028 నాటికి కల్పించాలి. ఈలోగా ఆయా మార్గాలను విస్తరించాల్సి ఉంది. ఇందులో భాగంగా బోయపాలెం నుంచి కాపులుప్పాడ రహదారిని వీఎంఆర్‌డీఏ అభివృద్ధి చేస్తోంది. అదేవిధంగా నేరెళ్లవలస నుంచి కొత్తవలస మార్గాన్ని కూడా వీఎంఆర్‌డీఏనే విస్తరిస్తోంది. ముఖ్యంగా ఐటీ పార్కులకు ఇటు జాతీయ రహదారితో, అటు భీమిలి బీచ్‌రోడ్డుతో అనుసంధానమైన ఉన్న రహదారులను విస్తరించనున్నారు. మరోవైపు భోగాపురం విమానాశ్రయం వైపు కూడా ఐటీ లేఅవుట్లు వచ్చే అవకాశం ఉన్నందున వాటిని కూడా దృష్టిలో ఉంచుకొని కనెక్టివిటీ రహదారులను అభివృద్ధి చేయాలని అదనపు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.