Share News

ముఖ హాజరు.. బేజారు

ABN , Publish Date - Jun 19 , 2026 | 10:38 PM

మండలంలోని కుంతుర్ల పంచాయతీ సంపంగిదాటు గ్రామంలో ఉపాధి హామీ కార్మికులు ముఖ ఆధారిత హాజరు విధానంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ హాజరు.. బేజారు
ముఖ ఆధారిత హాజరు కోసం కొండపై నిరీక్షిస్తున్న సంపంగిదాటు ఉపాధి కార్మికులు

కొండపై గంటలపాటు నిరీక్షణ

సెల్‌ సిగ్నల్‌ అందుబాటులో తేవాలని

సంపంగిదాటు ఉపాధి కార్మికులు డిమాండ్‌

పెదబయలు, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కుంతుర్ల పంచాయతీ సంపంగిదాటు గ్రామంలో ఉపాధి హామీ కార్మికులు ముఖ ఆధారిత హాజరు విధానంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో మొబైల్‌ నెటవర్క్‌, ఇంటర్నెట్‌ సదుపాయం సరిగా లేకపోవడంతో హాజరు నమోదు కోసం కార్మికులు కొండలు, గుట్టలు ఎక్కి సిగ్నల్‌ వచ్చే ప్రాంతాలకు వెళ్లి గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. ఉదయం పనులు మొదలు పెట్టే ముందు ఒకసారి.. మధ్యాహ్నం పని ముగిసిన తర్వాత మరోసారి హాజరు నమోదు చేయాల్సి ఉండడంతో కార్మికులు రోజుకు రెండు సార్లు సిగ్నల్‌ కోసం పాట్లు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కార్మికుల్లో ఎక్కువ మంది వృద్ధులు, మహిళలు ఉండడంతో కొండలు ఎక్కడం దూర ప్రాంతాలకు నడిచి వెళ్లడం కష్టంగా మారింది. వర్షాకాలంలో జారుడు మార్గాలు, అడవి దారుల్లో ప్రయాణించడం ప్రమాదకరంగా ఉంటోందని గ్రామస్థులు చెబుతున్నారు. కష్టపడి కొండలు ఎక్కితే సిగ్నల్‌ అందక రోజంతా వేచి చూడాల్సి వస్తోందని అంటున్నారు. దీంతో పని సమయం వృఽథా కావడంతోపాటు శారీరక అలసటకు గురవుతున్నామని వాపోతున్నారు. కొన్ని సందర్భాల్లో హాజరు నమోదు కాకపోవడంతో వేతనాల్లో కోత జరుగుతోందని, దీంతో పని చేసినా డబ్బులు అందడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఫేషియల్‌ అటెండెన్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టిన కేంద్రప్రభుత్వం గిరిజన ప్రాంతం భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందుగా అన్ని గ్రామాల్లో సెల్‌ సిగ్నల్‌, ఇంటర్నెట్‌ అందుబాటు తీసుకువచ్చి ఉంటే బాగుంటుందని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి సంపంగిదాటు గ్రామంలో సెల్‌ సిగ్నల్‌ అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jun 19 , 2026 | 10:38 PM