డిగ్రీ కళాశాలల్లో ముఖ ఆధారిత హాజరు
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:30 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో ముఖ ఆధారిత హాజరు/ముఖ గుర్తింపు వ్యవస్థ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్...ఎఫ్‌ఆర్‌ఎస్)ను అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని ఉన్నత విద్యా మండలి ఆదేశాలు
ఆ దిశగా ఏయూ అధికారుల చర్యలు
విద్యార్థుల హాజరు పెంచడమే లక్ష్యంగా అడుగులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో ముఖ ఆధారిత హాజరు/ముఖ గుర్తింపు వ్యవస్థ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్...ఎఫ్‌ఆర్‌ఎస్)ను అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఉన్నత విద్యా సంస్థల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చేయాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యా మండలి నుంచి కొద్దిరోజుల కిందట ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు తమ పరిధిలోని కళాశాలలకు ఏయూ అధికారులు సమాచారం ఇచ్చారు.
ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చేయాల్సిందిగా వర్సిటీ అధికారులు గతంలో సూచించినా అనేక కళా శాలలు పట్టించుకోలేదు.ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా మండలి ఉత్తర్వుల మేరకు మరోసారి ఆదేశాలను జారీచేశారు. ఈసారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకునేందుకు ఉన్నత విద్యా మండలి సిద్ధపడుతున్నట్టు తెలిసింది. ఈ విధానాన్ని యూనివర్సిటీ కేంద్రంగా పర్యవేక్షించేందుకు సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెబుతున్నారు.
అక్రమాలకు చెక్ చెప్పేలా..
రాష్ట్రంలోని అనేక కాలేజీల్లో అడ్డగోలు వ్యవహారాలు జరుగుతున్నాయి. ఎంతోమంది విద్యార్థులు కాలేజీలకు రాకుండా యాజ మాన్యాలను మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. అటువంటి విద్యార్థులకు కూడా ప్రభుత్వం ఫీజు (ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం) చెల్లిం చాల్సి వస్తోంది. అలాగే, నైపుణ్యాలు లేకుండా సర్టిఫికెట్లను పొందేస్తున్నారు. ఈ తరహా వ్యవహారాలకు చెక్ చెప్పి, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకుగాను ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. తొలుత డిగ్రీ కాలేజీల్లో పూర్తిస్థాయిలో అమలు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఏయూ పరిధిలో ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో 190 వరకు కాలేజీలు ఉన్నాయి. ఆయా కాలేజీల్లో తప్పనిసరిగా విద్యార్థులు ముఖ ఆధారిత హాజరు నమోదుకు అనుగుణంగా మెషీన్లు (డివైస్) ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నెలాఖరు నాటికి డివైస్‌ల ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేసి వచ్చే నెల నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా హాజరు తీసుకునేలా చూడాలని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు. రెండో దశలో పీజీ, లా, బీఈడీ కాలేజీల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.