Share News

ఇలాగైతే మురుగు ముంచెత్తదా?

ABN , Publish Date - Apr 09 , 2026 | 11:41 PM

జాతీయ రహదారి 516-ఈ నుంచి చింతపల్లి గ్రామ పంచాయతీకి వెళ్లేందుకు నిర్మిస్తున్న అప్రోచ్‌ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ లేకుండా పనులు చేపడుతున్నారు.

ఇలాగైతే మురుగు ముంచెత్తదా?
డ్రైనేజీని మూసివేసి గోడ నిర్మించిన ఎన్‌హెచ్‌ అధికారులు

డ్రైనేజీ లేకుండా అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం

డీపీఆర్‌లో లేదంటున్న ఎన్‌హెచ్‌ అధికారులు

భవిష్యత్తులో మురుగునీటి సమస్య తప్పదంటున్న స్థానికులు

చింతపల్లి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి 516-ఈ నుంచి చింతపల్లి గ్రామ పంచాయతీకి వెళ్లేందుకు నిర్మిస్తున్న అప్రోచ్‌ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ లేకుండా పనులు చేపడుతున్నారు. రహదారి ఇరువైపులా మట్టి జారిపోకుండా గోడలను మాత్రమే నిర్మిస్తున్నారు. దీంతో భవిష్యత్తులో మురుగునీటి సమస్యతో పాటు వర్షాలు పడితే రహదారి పైనుంచి నీరు ప్రవహించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని స్థానికులు వాపోతున్నారు. అయితే జాతీయ రహదారి అప్రోచ్‌ రోడ్డు డీపీఆర్‌లో డ్రైనేజీ లేదని ఎన్‌హెచ్‌ అధికారులు చెబుతున్నారు.

రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి 516-ఈ చింతపల్లి మీదుగా వెళుతుంది. గ్రామ పంచాయతీకి 1.5 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి ఉంది. జాతీయ రహదారిని కలిసే హనుమాన్‌ జంక్షన్‌ నుంచి చింతపల్లి పంచాయతీ మీదుగా పాడేరు, జర్రెల ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. సుమారు రెండు వందల గ్రామాల ప్రజలకు ఈ రహదారి ప్రధానమైంది. ఇప్పటి వరకు పాత బస్టాండ్‌ నుంచి జాతీయ రహదారి కలిసే హనుమాన్‌ జంక్షన్‌ వరకు ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉంది. ఈ రహదారికి ఇరువైపులా డ్రైనేజీలు ఉన్నాయి. దీంతో మురుగునీరు, వర్షపు నీరు ఈ డ్రైనేజీల ద్వారా దిగువ ప్రాంతాలకు వెళుతుంది. అయితే జాతీయ రహదారి నుంచి చింతపల్లి పంచాయతీకి వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి ప్రారంభంలో వంద మీటర్ల మేర అప్రోచ్‌ రోడ్డును ఎన్‌హెచ్‌ అధికారులు నిర్మిస్తున్నారు. ఈ అప్రోచ్‌ రోడ్డు పాత డ్రైనేజీలను మూసివేసి, ఇరువైపులా రహదారి మట్టి జారిపోకుండా గోడలు మాత్రమే నిర్మిస్తున్నారు. దీని వల్ల అప్రోచ్‌ రోడ్డు 100 మీటర్లు ఇరువైపులా డ్రైనేజీ ఉండే పరిస్థితి లేదు. దీంతో అప్రోచ్‌ రోడ్డు ఇరువైపులా మురుగునీరు, వర్షపు నీరు ఎటు వెళుతుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై స్థానికులు ఎన్‌హెచ్‌ అధికారులను ప్రశ్నించగా అప్రోచ్‌ రోడ్డు డీపీఆర్‌లో డ్రైనేజీ లేదని, ఈ కారణంగా రహదారి మాత్రమే నిర్మిస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, జాతీయ రహదారుల ఇంజనీరింగ్‌ అధికారులు స్పందించి చింతపల్లి అప్రోచ్‌ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మించి, పాత డ్రైనేజీలకు అనుసంధానం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Apr 09 , 2026 | 11:42 PM