కంటి‘తుడుపు’
ABN , Publish Date - Jan 28 , 2026 | 01:19 AM
నగరంలో పారిశుధ్య పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. రోడ్లపై చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. తాగునీటి పైప్‌లైన్‌లు, యూజీడీ లీకేజీలతో రహదారులపై నీరు, మురుగునీరు పారుతోంది. మరోవైపు భవన నిర్మాణాలు ప్లాన్‌కు విరుద్ధంగా సాగిపోతున్నాయి. క్షేత్రస్థాయి పర్యటనతో సమస్యలు గుర్తించి సిబ్బందికి దిశానిర్దేశం చేయాల్సిన కమిషనర్ కేతన్‌గార్గ్ సమీక్షలు, సమావేశాలకే పరిమితమవుతున్నారు.
నగరంలో దిగజారుతున్న పారిశుధ్యం
ఎక్కడికక్కడ రోడ్లపై దర్శనమిస్తున్న చెత్తకుప్పలు
రోడ్లపై ప్రవహిస్తున్న మురుగునీరు
యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
క్షేత్రస్థాయి పర్యటనలను
పక్కనపెట్టేసిన కమిషనర్
సమీక్షలు, సమావేశాలతో బిజీ
కింది స్థాయిలో
అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో పారిశుధ్య పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. రోడ్లపై చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. తాగునీటి పైప్‌లైన్‌లు, యూజీడీ లీకేజీలతో రహదారులపై నీరు, మురుగునీరు పారుతోంది. మరోవైపు భవన నిర్మాణాలు ప్లాన్‌కు విరుద్ధంగా సాగిపోతున్నాయి. క్షేత్రస్థాయి పర్యటనతో సమస్యలు గుర్తించి సిబ్బందికి దిశానిర్దేశం చేయాల్సిన కమిషనర్ కేతన్‌గార్గ్ సమీక్షలు, సమావేశాలకే పరిమితమవుతున్నారు.
సుమారు 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీవీఎంసీ రాష్ట్రంలోనే అతిపెద్ద నగర పాలక సంస్థ. రూ.నాలుగు వేల కోట్లకుపైగా వార్షిక బడ్జెట్ కలిగిన నగర పాలక సంస్థలో నిరంతరం అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. దేశవ్యాప్తంగా పరిశుభ్రతపై నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో చాలాకాలంగా జీవీఎంసీ టాప్-5లో నిలుస్తూ వస్తుంది. ఇందుకోసం జీవీఎంసీ కమిషనర్‌తోపాటు అదనపు కమిషనర్లు, ప్రధాన వైద్యాధికారి ప్రతిరోజూ క్షేత్రస్థాయి పర్యటనలు చేసి పారిశుధ్య నిర్వహణ, మౌలిక వసతులు, నివాసితుల ఇబ్బందులు తెలుసుకుంటుండేవారు. రోడ్లను శుభ్రం చేయకపోయినా, యూజీడీ, నీటి సరఫరా పైప్‌లైన్‌లు లీకైనా సిబ్బందిని అప్రమత్తం చేసేవారు. దీనివల్ల రోడ్లు, కాలనీలు శుభ్రంగా ఉండడంతోపాటు డ్రైనేజీల్లో ఎప్పటికప్పుడు పూడికతీత పనులు సక్రమంగా సాగేవి. అదేవిధంగా ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నట్టు గుర్తించినా, ఎవరైనా ఫిర్యాదు చేసినా చర్యలకు ఆదేశించేవారు.
గతానికి భిన్నంగా...
ప్రస్తుతం నగరంలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. గతంతో పోల్చితే పారిశుధ్యం దిగజారిపోయింది. కొన్నిచోట్ల మినహా చాలాచోట్ల రోడ్లను సిబ్బంది సక్రమంగా శుభ్రం చేయడం లేదని, పైప్‌లైన్‌లు లీకైనా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. క్షేత్రస్థాయి సిబ్బందిపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కార్మికులు కొంతమంది విధులకు హాజరుకాకున్నా పర్యవేక్షించే ఉద్యోగులు అటెండెన్స్ వేసేస్తున్నారు. ఆ మొత్తాన్ని వాటాలు వేసుకుని పంచుకుంటున్నారు. బీచ్‌రోడ్డులో మేయర్ పీలా శ్రీనివాసరావు చేపట్టిన ఆకస్మిక తనిఖీలో విధులకు హాజరైనట్టు రికార్డులో నమోదుచేసిన సిబ్బందిలో ఐదుగురు అక్కడ కనిపించలేదు. దీనిపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. దాదాపుగా నగరమంతా ఇదే పరిస్థితి నెలకొనడంతో పారిశుధ్యం దిగజారిపోతోంది. అలాగే అక్రమ భవన నిర్మాణాలకు కొందరు కార్పొరేటర్లు అండదండలు అందిస్తుండడంతో అధికారులు కూడా తమ వాటాలను తీసుకుని అడ్డుచెప్పడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
క్షేత్రస్థాయి పర్యటనలేవీ?
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ క్షేత్రస్థాయి పర్యటనలను పూర్తిగా పక్కన పెట్టేశారు. గతంలో కమిషనర్లు ఉదయం క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆకస్మికంగా రోజుకో ప్రాంతానికి వెళ్లి పారిశుధ్య నిర్వహణ, వాణిజ్యప్రాంతాల్లో తడి-పొడి చెత్త విభజన, డ్రైనేజీల నిర్వహణ, ప్రజా సమస్యలను తెలుసుకోవడం, జీవీఎంసీ పనితీరుపై అభిప్రాయాలతోపాటు సలహాలు, సూచనలు స్వీకరించేవారు. దీనివల్ల అధికారులు, సిబ్బందిలో భయం ఉండేది. ఫలితంగా పక్కాగా విధులు నిర్వర్తించేవారు. ఈ చర్యలతో నగరంలో పారిశుధ్యం మెరుగుపడడంతోపాటు ప్రజల్లో జీవీఎంసీ సేవలపై సదభిప్రాయం ఉండేది. ప్రస్తుత కమిషనర్ కేతన్‌గార్గ్ మొదట్లో క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినా, తర్వాత స్వస్తి చెప్పేశారు. కిర్లంపూడి లేఅవుట్‌లోని స్మార్ట్ సిటీ కార్యాలయం, లేదా బంగ్లాలో సమీక్షలతోనే గడిపేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో జీవీఎంసీ ర్యాంకు పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా కమిషనర్ వాస్తవ పరిస్థితి గుర్తించి, క్షేత్రస్థాయి పర్యటనలతో నగరంలోని పారిశుధ్యం పరిస్థితిని గాడిన పెట్టాలని కోరుతున్నారు.