పిల్లల్లో కంటి సమస్యలు
ABN , Publish Date - Jul 07 , 2026 | 01:25 AM
కంటి సమస్యలతో బాధపడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది.
ప్రాంతీయ కంటి ఆస్పత్రికి రోజుకు 40 నుంచి 50 మంది రాక
ప్రత్యేకంగా ఓపీ కౌంటర్
ఫోన్, ఎలక్ర్టానిక్ గాడ్జెట్స్ అధికంగా వినియోగించడంతో కంటిపై ఒత్తిడి
సకాలంలో గుర్తించి వైద్య సేవలు అందించడం కీలకమంటున్న వైద్యులు
ఎక్కువ మంది పిల్లలకు కళ్ల అద్దాలు అవసరమవుతుండడంతో ఇబ్బంది
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కంటి సమస్యలతో బాధపడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్‌ను అతిగా వినియోగించడం వల్ల ఎక్కువ మంది చిన్నారుల్లో కంటి సంబంధిత ఇబ్బందులు తలెత్తుతున్నట్టు ప్రాంతీయ కంటి ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. తమ ఆస్పత్రికి గతంతో పోలిస్తే పది నుంచి 20 శాతం మేర కేసులు పెరిగినట్టు పేర్కొంటున్నారు. పిల్లల్లో కంటి సమస్యలను సకాలంలో గుర్తించడం అత్యంత ముఖ్యమని, లేకపోతే చూపు మరింత మందగించే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.
గణనీయంగా కేసులు పెరుగుదల
గతంతో పోలిస్తే పిల్లల్లో కంటి సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయి. కంటి రోగుల్లో ఒకప్పుడు వంద మందిలో ఐదుగురు నుంచి ఏడుగురు పిల్లలు ఉండేవారు. కరోనా తరువాత ప్రాంతీయ కంటి ఆస్పత్రికి వచ్చే ప్రతి వంద మందిలో 20 మంది వరకు పిల్లలే ఉంటుండడం గమనార్హం. ప్రతిరోజూ ఆస్పత్రికి 40 నుంచి 50 మంది వరకు పిల్లలు వస్తుంటారని, సోమ, మంగళవారాల్లో ఈ సంఖ్య 60 దాటుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో పిల్లలకు ప్రత్యేక ఓపీ ఏర్పాటుచేశారు. దీనివల్ల వేగంగా పరీక్షలు నిర్వహించగలుగుతున్నారు. ఆస్పత్రికి వచ్చే పిల్లల్లో దాదాపు ఐదు నుంచి పది మందికి కళ్లద్దాలు అవసరమయ్యే పరిస్థితి ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. కొన్నిసార్లు ఆస్పత్రిలో ఉంచి వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం చిన్నారులకు ప్రత్యేకంగా పది పడకలతో వార్డు కూడా అందుబాటులో ఉంది.
చిన్నారుల్లో కంటి సమస్యలు ఇవే..
కంటి నుంచి నీరు కారడం, కళ్ల దురదలు, మంట, కళ్లు చిట్లించడం, బోర్డు, దూరంగా ఉండే వస్తువులు సరిగా కనిపించకపోవడం, కంటి అలసట, మెల్ల కన్ను వంటివి ఉంటున్నాయి. అలాగే కొందరిలో తీవ్రమైన తలనొప్పి, వస్తువులను సరిగా గుర్తించలేకపోవడం, కళ్లకు బాక్టీరియా, ఇతర ఇన్‌ఫెక్షన్లు ఉంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
కంటి సంబంధిత సమస్యలకు స్మార్ట్ ఫోన్ వినియోగం ఒక్కటే కారణం కాకపోయినా దానివల్ల చిన్నారుల్లో సమస్య తీవ్రత పెరుగుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, పిల్లల స్ర్కీన్ టైమ్‌ను తగ్గించాలి. పిల్లలు చదివేటప్పుడు వెలుతురు తగినంత ఉండేలా చూడాలి. అలాగే, పిల్లలకు ప్రతిరోజూ కూరగాయలు, క్యారెట్, బొప్పాయి, గుడ్లు, చేపలు వంటి పోషకాహారాన్ని అందించాలి.
ప్రాథమిక దశలో సమస్యను గుర్తించడం కీలకం
డాక్టర్ మీనాక్షి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్
పిల్లల్లో కంటి ఇబ్బందులను ప్రాథమిక దశలో గుర్తించాలి. లేకపోతే కంటిపై తీవ్రమైన ఒత్తిడి పెరిగి చదువుపై దృష్టిసారించలేరు. కొన్నిసార్లు తీవ్రమైన తలనొప్పి వేధిస్తుంటుంది. వారి ఇబ్బందిని బట్టి వైద్యులకు చూపించి పరీక్షలు చేయించాలి. అవసరమైన వారికి కళ్లద్దాలు వేయించాల్సి ఉంటుంది. అతి తక్కువ మందికి మాత్రమే శస్త్రచికిత్స చేయించాల్సిన అవసరం ఏర్పడుతుంది. పిల్లలకు కంటి సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే ఫోన్‌కు వీలైనంత వరకు దూరంగా ఉంచాలి. ఒకవేళ ఫోన్ ఇచ్చినా స్ర్కీన్ టైమ్ తక్కువ ఉండేలా చూడాలి.