Share News

రూ.కోట్ల స్థలాలపై కన్ను

ABN , Publish Date - Jul 14 , 2026 | 01:24 AM

నగరంలో కొన్ని దశాబ్దాలుగా జీవీఎంసీ స్వాధీనంలో ఉన్న ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని జనసేన ఎమెల్యే పురపాలక శాఖా మంత్రికి లేఖలు రాయడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

రూ.కోట్ల స్థలాలపై కన్ను

ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని మంత్రికి జనసేన ఎమ్మెల్యే లేఖ

ఈస్ట్‌పాయింట్‌ కాలనీలోని రెండు పార్కులు, అక్కయ్యపాలెంలో 1.25 ఎకరాలు

కోర్టు ద్వారా దఖలు పడిన భూములు ప్రైవేటు వ్యక్తులవని వాదన

ఎమ్మెల్యే లేఖతో అవాక్కవుతున్న నగర వాసులు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

నగరంలో కొన్ని దశాబ్దాలుగా జీవీఎంసీ స్వాధీనంలో ఉన్న ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని జనసేన ఎమెల్యే పురపాలక శాఖా మంత్రికి లేఖలు రాయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వాటి విలువ వంద కోట్ల రూపాయలకు పైగా ఉండడం గమనార్హం.

బీచ్‌ రోడ్డులో వుడా పార్కు సమీపానున్న ఈస్ట్‌ పాయింట్‌ కాలనీలో రెండు పార్కులను స్థానిక సాయిబాబా ఆలయ కమిటీ కొన్ని దశాబ్దాలుగా ఉపయోగించుకుంటోంది. బాబా పూజకు అవసరమైన మొక్కలు పెంచడానికి ఒకటి, ప్రత్యేక పూజల సమయాల్లో పల్లకీని దింపడానికి మరొకటి వినియోగిస్తున్నారు. ఈ రెండు పార్కులు వాల్తేరు వార్డు టౌన్‌ సర్వే నంబరు 124, 125/2లో ఉండగా ఒక దాని విస్తీర్ణం 2,263.68 చ.గజాలు కాగా మరో పార్కు విస్తీర్ణం 1,397 చదరపు గజాలు. రెండూ కలిపి 3,660 చ.గజాలు. అక్కడ గజం విలువ రూ.1.5 లక్షలు పైనే ఉంది. ఈ రెండు పార్కులు ఆలయ కమిటీకి చెందిన ప్రసాద్‌ ఆధీనంలో ఉన్నాయి. వీటిని జీవీఎంసీ కోర్టు కేసుల ద్వారా దక్కించుకుంది. అయితే పార్కులు నిర్వహించలేక ఆలయ కమిటీకి అప్పగించింది. వీటిపై నగరానికి చెందిన జనసేన ఎమ్మెల్యే కన్నుపడిందని ఏడాదిగా ప్రచారం జరుగుతోంది. తాజాగా దానిని నిజం చేస్తూ ఆయన ఆ పార్కు స్థలాలు విజయలక్ష్మి బిస్త్‌కు చెందినవని, వారే సాయిబాబా ఆలయానికి ఇచ్చారని, ఆ భూములను వెనక్కి ఇవ్వాలని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి నారాయణకు ఈ నెల 9వ తేదీన లేఖ రాశారు. లేదంటే నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఆ భూముల విలువ సుమారు రూ.55 కోట్లు.

అక్యయ్యపాలెంలో మరో 1.25 ఎకరాలు

ఇదే ఎమ్మెల్యే అక్కయ్యపాలెం 80 అడుగుల రహదారి సర్వే నంబరు 6/2లో 1.25 ఎకరాల భూమి జీవీఎంసీ ఉపయోగించుకుంటున్నదని, దానిని కూడా వెనక్కి ఇవ్వాలని అదే మంత్రికి మరో లేఖ రాశారు. ఈ భూమి మొత్తం కొన్ని దశాబ్దాలుగా జీవీఎంసీ వినియోగంలో ఉంది. అక్కడి ప్రజలకు నీటిని అందించేందుకు ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌, జీవీఎంసీ కార్యాలయం, సులభ్‌కాంప్లెక్స్‌, పారిశుధ్య వాహనాల పార్కింగ్‌కు ఉపయోగిస్తోంది. ఈ భూమి తనకు అత్యంత ఆప్తులైన ఎన్‌.వల్లీకి చెందినదని, ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు. వారు జీవీఎంసీకి పన్నులు చెల్లించలేకపోవడంతో భూమిని స్వాధీనం చేసుకుందని లేఖలో పేర్కొనడం విశేషం. ఈ రెండు భూములు న్యాయస్థానాల ద్వారా జీవీఎంసీకి దఖలు పడ్డాయి. ఇది జరిగి సుమారు మూడు దశాబ్దాలు దాటింది. ఇప్పుడు వాటిని వెనక్కి ఇవ్వాలని, లేదంటే నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే లేఖ రాయడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ భూమి సుమారు ఆరు వేల గజాలు ఉంటుంది. ఇక్కడ కూడా గజం రూ.1.5 లక్షలు ఉంది. అంటే దాని విలువ సుమారు రూ.90 కోట్లు. మొత్తం రూ.145 కోట్ల భూమి వెనక్కి ఇవ్వాలని ఆయన కోరుతూ మంత్రికి లేఖ రాయడం విశేషం.

పవన్‌కల్యాణ్‌ జోక్యం చేసుకోవాలి

ఈ భూముల గురించి జనసేన ఎమ్మెల్యే మంత్రికి లేఖలు రాయడంపై అదే పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ స్పందించారు. ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని పీజీఆర్‌ఎస్‌లో సోమవారం జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ అంశంపై డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 14 , 2026 | 01:24 AM