డీ పట్టా భూములపై కన్ను
ABN , Publish Date - May 01 , 2026 | 02:13 AM
డీ పట్టా భూములను సొంతం చేసుకునేందుకు ‘పెద్దలు’ రంగంలోకి దిగారు.
పెద్దల తరపున రంగంలోకి దళారులు
గతంలో అడ్వాన్స్‌లు ఇచ్చిన రైతులతో మంతనాలు
విశాఖపట్నం, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి):
డీ పట్టా భూములను సొంతం చేసుకునేందుకు ‘పెద్దలు’ రంగంలోకి దిగారు. గత ప్రభుత్వంలో డీపట్టా భూముల కొనుగోలు వ్యవహారంలో చక్రం తిప్పిన వారంతా గత నెల రోజులుగా విశాఖ, విజయనగరం జిల్లాల రైతులతో మంతనాలు జరుపుతున్నారు. అమరావతి స్థాయిలో తమకు పలుకుబడి ఉందని ప్రచారం చేసుకోవడంతో పాటు ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నట్టు సమాచారం. డీపట్టా భూముల క్రమబద్ధీకరణకు గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉత్తర్వులపై కూటమి ప్రభుత్వం విధించిన నిషేధం ఎత్తివేస్తారని, తాము అడ్వాన్స్ ఇచ్చిన భూములు రిజిస్రే్ట్రషన్‌కు ఇబ్బందులు తొలగినట్టేనని రైతులకు చెబుతున్నట్టు తెలిసింది.
గత ప్రభుత్వంలో అప్పటి ఉన్నతాధికారి అండదండలతో కొందరు నగరం, పరిసర మండలాలు పెందుర్తి, ఆనందపురం, భీమిలి, పద్మనాభం, విజయనగరం జిల్లా పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ తదితర మండలాల్లో డీపట్టా రైతుల నుంచి భూముల కొనుగోలుకు అడ్వాన్స్‌లు ఇచ్చారు. భవిష్యత్తులో విశాఖ పరిసరాల్లో భూములకు విలువ పెరుగుతుందని భావించిన అప్పటి ఉన్నతాధికారి తన పలుకుబడిని ఉపయోగించి తన మనుషులను రంగంలోకి దింపారు. పేద రైతుల వద్ద ఉన్న డీపట్టా భూములు కైవశం చేసుకునేందుకు వీలుగా వైసీపీ హయాంలో ఫ్రీహోల్డ్ చేస్తూ 2023లోనే ఉత్తర్వులు ఇచ్చారు. ఆఆ జీవో వస్తుందని ముందుగా తెలిసిన ఉన్నతాధికారి ఉత్తరాంధ్ర పరిధిలో డీపట్టా భూములపై దృష్టిసారించారు. పెందుర్తి మండలం ఎస్‌ఆర్ పురం, ఆనందపురం మండలం గండిగుండం, రామవరం, భీమన్నదొరపాలెం, పాలవలస, శొంఠ్యాం, తర్లువాడ, పద్మనాభం మండలంలోని కొన్ని గ్రామాల పరిధిలోని రైతులకు అడ్వాన్స్‌లు ఇచ్చారు. గండిగుండంలో అప్పటి వైసీపీ నేతలతో కలిసి సుమారు 40 నుంచి 50 ఎకరాలు కొనుగోలు చేశారు. డీపట్టా భూములు ఫ్రీహోల్డ్ చేస్తూ ఉత్తర్వులు వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఎస్‌ఆర్ పురంలో సుమారు 50 ఎకరాలకు ఉన్నతాధికారి తరఫున బ్రోకర్లు అడ్వాన్స్‌లు చెల్లించగా, నగరానికి చెందిన వైసీపీ నేతలు మరో 30 ఎకరాలకు రైతులతో అనధికార ఒప్పందాలు చేసుకున్నారు. ఆనందపురం మండలం తర్లువాడలో 100 ఎకరాలు, రామవరంలో 20 ఎకరాలు, భీమన్నదొరపాలెంలో 20 నుంచి 30 ఎకరాలు, పాలవలసలో 30 నుంచి 40 ఎకరాలు, శొంఠ్యాంలో 20 ఎకరాలకు అడ్వాన్స్‌లు ఇచ్చారని రైతులు చెబుతున్నారు.
ఫ్రీహోల్డ్‌పై నిషేధం
ఫ్రీహోల్డ్‌కు అనుమతులపై పత్రికల్లో కథనాలు దుమారం రేపాయి. ఈలోగా 2024 ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడడంతో భూముల రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. ఆ తరువాత కూటమి ప్రభుత్వం ఫ్రీహోల్డ్ జీవోను నిషేధించింది. తర్లువాడలో 100 ఎకరాల డీపట్టా భూములు గూగుల్‌కు కేటాయించిన ప్రభుత్వం, రైతులకు పరిహారం అందజేసింది. ఈ క్రమంలో అడ్వాన్స్‌లను తిరిగి రాబట్టుకునేందుకు బ్రోకర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇదిలావుండగా త్వరలో ఫ్రీహోల్డ్ జీవోపై ఉన్న నిషేధం ఎత్తివేస్తారనే సమాచారం బయటకు రావడంతో బ్రోకర్లు గతంలో అడ్వాన్స్‌లు ఇచ్చిన గ్రామాల్లో తిరుగుతున్నారు. డీపట్టా భూములకు ఇచ్చిన అడ్వాన్స్‌లు మేరకు కొనుగోలుకు యత్నిస్తూనే ఉన్నారు.
గత వారం రామవరం, భీమన్నదొరపాలెం, శొంఠ్యాం, పాలవలసలో పర్యటించి రైతులతో మంతనాలు జరిపారు. పెందుర్తి మండలం ఎస్‌ఆర్‌పురంలో రైతులకు అడ్వాన్స్‌లు ఇచ్చిన వైసీపీ నేతతో మంతనాలు జరిపి, ఆయనకు కొంత మొత్తం ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. ఇంకా విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో డీపట్టాభూములకు ఇచ్చిన అడ్వాన్స్‌ల మేరకు ఆయా రైతులను కలుస్తున్నారని చెబుతున్నారు.