తగ్గని చలి తీవ్రత
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:34 PM
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో చలి తీవ్రత తగ్గలేదు. దీంతో జనం గజగజ వణుకుతున్నారు. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని అన్ని ప్రాంతాల్లో చలి ప్రభావం అధికంగా ఉంది. పగటి వేళల్లో సైతం శీతలగాలులు వీస్తున్నాయి. తెల్లవారుజామున పొగమంచు కమ్ముకుంటున్నది. చలి నుంచి ఉపశమనం పొందేందుకు ఉన్ని దుస్తులు ధరిస్తూ, చలి మంటలు కాగుతున్నారు. ప్రధానంగా ఘాట్‌లో పొగ మంచు దట్టంగా కమ్మేయడంతో వాహన రాకపోకలకు డ్రైవర్లు అవస్థలు పడుతున్నారు.
- హుకుంపేటలో 5.7 డిగ్రీలు
పాడేరు, జనవరి 22(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో చలి తీవ్రత తగ్గలేదు. దీంతో జనం గజగజ వణుకుతున్నారు. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని అన్ని ప్రాంతాల్లో చలి ప్రభావం అధికంగా ఉంది. పగటి వేళల్లో సైతం శీతలగాలులు వీస్తున్నాయి. తెల్లవారుజామున పొగమంచు కమ్ముకుంటున్నది. చలి నుంచి ఉపశమనం పొందేందుకు ఉన్ని దుస్తులు ధరిస్తూ, చలి మంటలు కాగుతున్నారు. ప్రధానంగా ఘాట్‌లో పొగ మంచు దట్టంగా కమ్మేయడంతో వాహన రాకపోకలకు డ్రైవర్లు అవస్థలు పడుతున్నారు.
కొనసాగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
మన్యంలో గత కొన్నాళ్లుగా సింగిల్ డిజిట్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. హుకుంపేటలో గురువారం 5.7, అరకులోయలో 5.9, ముంచంగిపుట్టులో 6.8, పెదబయలులో 6.9, చింతపల్లిలో 7.0, కొయ్యూరులో 11.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హుకుంపేటలో..
హుకుంపేట: మండలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనం వణికిపోతున్నారు. గురువారం పొగమంచు దట్టంగా కురవడంతో వాహనదారులు హెడ్‌లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించారు. ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు ఇబ్బందులు పడుతూ గమ్యస్థానాలకు చేరారు.
అరకులోయలో..
అరకులోయ: మండలంలో చలి వణికిస్తోంది. గురువారం వేకువజాము నుంచి ఉదయం 9 గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. పొగమంచు కారణంగా వాహనాలు లైట్ల వెలుతురులోనే రాకపోకలు సాగించాయి. అయితే ప్రకృతి అందాలు మరింత సుందరంగా కనిపించడంతో పర్యాటకులు ఎంజాయ్ చేశారు.