విచ్చలవిడి వ్యయం
ABN , Publish Date - Jul 10 , 2026 | 01:04 AM
విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్) పేరుతో విచ్చలవిడిగా డబ్బు వెచ్చిస్తున్నారు.
వీఈఆర్ పేరుతో వీఎంఆర్‌డీఏలో మరో దుబారా
ఇద్దరు ఆర్డీవోలకు ప్రత్యేక అధికారాలు
వెబ్‌సైట్ కోసం రూ.4 కోట్ల ప్రాజెక్టు
కేపీఎంజీకి నెలకు రూ.30 లక్షలు చెల్లింపు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్) పేరుతో విచ్చలవిడిగా డబ్బు వెచ్చిస్తున్నారు. ఆ బాధ్యతల వల్ల అసలు విధులు నిర్వహించలేమంటూ ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులను తీసుకువచ్చి వారి చేతుల మీదుగా ఫైళ్లు నడిపిస్తున్నారు. రేపు ఏదైనా విచారణ జరిగితే సంబంధం లేదని తప్పించుకునే ందుకు ఇదో ఎత్తుగడ అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు తొమ్మిది జిల్లాలను ‘విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్’గా గుర్తించి భారీ ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కమిషనర్‌కు బాధ్యతలు అప్పగించింది. ఆ పనిలో పడి సంస్థను నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉందని భావించి, ఇటీవల ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులను డిప్యుటేషన్‌పై ఇక్కడికి రప్పించారు. వారిలో ఒకరికి అడిషనల్ కమిషనర్ పోస్టు, మరొకరికి ‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ’ పోస్టు ఇచ్చారు. వీఎంఆర్‌డీఏలో పరిపాలన వ్యవహారాలు చూసేందుకు సెక్రటరీ, ఇంజనీరింగ్ విభాగానికి సీఈ, ప్రణాళిక విభాగానికి సీయూపీ, అకౌంట్స్ విభాగానికి సీఏవో, అర్బన్ ఫారెస్ట్రీకి డీఎఫ్‌వో, భూములకు సంబంధించి ఎస్టేట్ అధికారి అధిపతులుగా ఉన్నారు. వీరిని రెండు భాగాలుగా చేసి, ఆ ఇద్దరు ఆర్డీవోలకు రిపోర్టు చేయమని, వారి ద్వారానే ఫైళ్లు పంపాలని ఆదేశించారు. అంటే రేపు ఏదైనా తేడా వస్తే కింది వారి ద్వారానే ఫైల్ నడించిందని చెప్పుకోవడానికి ఈ ఏర్పాట్లు అని ప్రచారం జరుగుతోంది.
అంతంత ఖర్చులా...?
వీఎంఆర్‌డీఏలో సమూల మార్పులు చేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వెబ్‌సైట్ అసలు పనిచేయదు. ఏదైనా కావాలని వెతికితే ‘నాట్ ఫౌండ్ 404’ అని డిస్‌ప్లే వస్తుంది. అన్ని విభాగాల సమాచారం అందులో ఉంచేందుకు వీలుగా ఇటీవల ‘అమరావతి ఇన్నోవేటివ్ లిమిటెడ్’ అనే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇది రూ.4 కోట్ల ప్రాజెక్టు. నెలకు రూ.15 లక్షలు చొప్పున చెల్లిస్తున్నారు. పది మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు రెండేళ్లు ఉంటారని సమాచారం. వారి చేతికి అందే జీతం రూ.20వేల నుంచి రూ.50వేలు. అంటే నెలకు అత్యధికంగా రూ.5 లక్షలు. కానీ వారిని సమకూర్చిన సంస్థకు రూ.15 లక్షలు ఇస్తున్నారు. వారు వచ్చి కొన్ని నెలలైంది. కానీ వెబ్‌సైట్‌లో మాత్రం ఏమీ కనపడదు. అదే విచిత్రం. ఆగస్టు 15కి ఫుల్ సినిమా చూపిస్తామని అంటున్నారు. వీరు పార్కుల్లో ఆన్‌లైన్ టిక్కెటింగ్ కోసం విస్టా యాప్, భూ వివరాల కోసం పీఎంఎస్ యాప్, తపాళ్ల కోసం ఎస్‌టీఎంఎస్ యాప్, నిర్మాణాల కోసం ఇంజనీరింగ్ యాప్, టూరిజం కోసం ఇంకో యాప్, పెట్టుబడుల కోసం మరో యాప్ తయారు చేస్తున్నారు. ఇంట్రో లేబ్స్ అని మరో సంస్థ కూడా ఐటీ కోసం పనిచేస్తున్నది. ఇవన్నీ వాస్తవమే కానీ వారికి చెల్లింపులు అధికంగా ఉన్నాయనేది ప్రధానాంశం.
ఆర్‌అండ్‌బి నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ఒక డీఈకి ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించి ఫైళ్లు నడిపిస్తున్నారు. ఇతర ఇంజనీర్లకు పురమాయిస్తే వారు సందేహాలు వ్యక్తంచేస్తారని, నిబంధనలు చెబుతారని, ఫైళ్లు వేగంగా నడవవని ఈ జాగ్రత్తలు తీసుకుని పాపాల భైరవుడిలా తయారుచేశారు.
లీగల్ కౌంటర్లకు మరో సాఫ్ట్‌వేర్
వీఎంఆర్‌డీఏకి ఇప్పటికే ఒక స్టాండింగ్ కౌన్సిల్ ఉండగా తనని పక్కన పెట్టి మరో వ్యక్తిని తీసుకువచ్చారు. దీనికి ప్రభుత్వ ఆమోదం లేదని జనసేన నాయకుడు పీతల మూర్తియాదవ్ నేరుగా సీఎం చంద్రబాబుకే ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలనేది సీఎం సూచన. స్టాండింగ్ కౌన్సిళ్లను రాజకీయ సిఫారసులతోనే నియమించడం రివాజు. ఇక్కడ ఎవరు సిఫారసు చేశారంటే ఒక్క నాయకుడి పేరు కూడా వినిపించడం లేదు. కోర్టుల్లో సంస్థ తరఫున కౌంటర్లు వేయడానికి ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ తయారుచేశారు. దీనికి రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని తెలిసింది.
కేపీఎంజీతో పవర్ పాయింట్ ప్రజంటేషన్లు
కేపీఎంజీ చాలా పెద్ద సంస్థ. వీఈఆర్ కన్సల్టెంట్‌గా వారిని పెట్టుకున్నారు. వారికి నెలకు రూ.30 లక్షలు చెల్లిస్తున్నారు. రెండు నెలలైంది. వారి స్థాయికి తగిన పని లేదు. దాంతో వారితో పదో తరగతి విద్యార్థులు తయారు చేసే పవర్ పాయింట్ ప్రజంటేషన్లు చేయిస్తున్నారు.
ఆతిథ్యం పేరుతో వృథా
ఆతిథ్యం (హాస్పిటాలిటీ) పేరులో హోటళ్లకు రూ.లక్షల్లో చెల్లిస్తున్నారు. కైలాసగిరిపై త్రిశూల్ ప్రారంభోత్సవానికి రూ.20 లక్షలు ఖర్చు చేశారంటే బిల్లులు ఏ స్థాయిలో పెడుతున్నారో అర్థం చేసుకోవాలి. ఎవరైనా మంత్రి పర్యటనకు వచ్చి భోజనాలు ఏర్పాటు చేస్తే దానికి రెట్టింపు బిల్లులు పెట్టి, మిగులు మొత్తాలు నగదు రూపంలో వెనక్కి తీసుకొని వాటాలు పంచుకుంటున్నారు. గతంలో జరిగిన ఆతిథ్య ఖర్చులు, ఈ ఆరు నెలలలో జరిగిన ఖర్చులు బేరీజు వేస్తే వాస్తవాలు తెలుస్తాయి.
ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో తెలియదు
ఇటీవల అవుట్ సోర్సింగ్‌లో రెండు దఫాలుగా 30 మందిని డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అటెండర్లు, జూనియర్ అసిస్టెంట్లుగా నియమించారు. వారంతా ఎక్కడ పనిచేస్తున్నారని అడిగితే చెప్పే దిక్కు లేదు.