విస్తృతంగా భూసార పరీక్షలు
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:39 AM
వ్యవసాయానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. రైతుల వ్యవసాయ ప్రగతికి సాంకేతిక సహకారం అందించేందుకు ప్రభుత్వం భూసార పరీక్షలు విస్తృతం చేసింది.
ఉమ్మడి అల్లూరి జిల్లాలో 28,103 నమూనాలు సేకరణ
ఖరీఫ్ ప్రారంభానికి ముందే ఫలితాలు
గత వైసీపీ పాలనలో అటకెక్కిక పరీక్షలు
కూటమి ప్రభుత్వం వచ్చాక పునఃప్రారంభం
చింతపల్లి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. రైతుల వ్యవసాయ ప్రగతికి సాంకేతిక సహకారం అందించేందుకు ప్రభుత్వం భూసార పరీక్షలు విస్తృతం చేసింది. ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 22 మండలాల్లో వ్యవసాయశాఖ అధికారులు 28,103 మట్టి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపిస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభానికి ముందే ఫలితాలను రైతులకు అందజేసేందుకు కార్యాచరణ ప్రారంభించారు. భూసార పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తున్నది. వైసీపీ ప్రభుత్వ హయాంలో భూసార పరీక్షలు అటకెక్కాయి. వైసీపీ ఐదేళ్ల కాలంలో భూసార పరీక్షలు నిర్వహించలేదు. తాజాగా పొలాల్లో పరీక్షలు చేస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతులు నాణ్యమైన పంటలు పండించాలంటే నేల ఆరోగ్యంగా ఉండాలి. పంటలకు అవసరమైన సూక్ష్మపోషకాలు భూమిలో ఉండాలి. నేల ఆరోగ్యం, పోషక విలువలు ఏ స్థాయిలో ఉన్నాయని తెలుసుకోవాలంటే భూసార పరీక్షలు చేయించుకోవాలి. రైతులు భూసార పరీక్షలు చేయించుకుని ఫలితాల ఆధారంగా పోషకాల యాజమాన్యం చేపడితే వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించవచ్చు. ప్రధానంగా పంట పొలాల్లో సేకరించిన మట్టి పరీక్షించుకోవడం వల్ల భూమిలో ఉన్న పోషకాలు, లోపాలు రైతులకు తెలుస్తాయి. ఈ భూసార పరీక్షల ఆధారంగా పొలాల్లో నాటిన పంటలకు పోషకాలు(ఎరువులు) పెట్టుకోవడం వల్ల నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చునని వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మట్టి నమూనాలు సేకరణ
ప్రభుత్వం భూసార పరీక్షలు చేయించేందుకు మట్టి నమూనాల సేకరణ ప్రారంభించింది. భూసార పరీక్షల కోసం ‘సాయిల్ హెల్త్ కార్డు పోర్టల్’ పేరిట యాప్‌ను రూపొందించింది. జీపీఎస్ ఆధారంగా మట్టి నమూనాలు సేకరించిన చిత్రాలను యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఫలితాలకు సంబంధించిన సమాచారం రైతుల సెల్‌ఫోన్‌కి ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేయడంతోపాటు సాయిల్ హెల్త్ కార్డును అందజేస్తారు. ప్రస్తుతం ఈ నెల ఒకటో తేదీ నుంచి వ్యవసాయశాఖ అధికారులు రైతు సేవా కేంద్రాల పరిధి రైతుల పంట పొలాల నుంచి మట్టి నమూనాలు సేకరణ చేపడుతున్నారు. కనిష్ఠంగా మారేడుమిల్లి మండలంలో 450, గరిష్ఠంగా హుకుంపేట మండలంలో 2,600 మట్టి నమూనాల సేకరిస్తున్నారు. భూసార పరీక్షల ఫలితాలు మే 15లోగా రైతులకు అందజేసేందుకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేసింది. రైతులకు భూసార పరీక్షల ఫలితాల కార్డులను అందజేస్తారు. ఖరీఫ్ ప్రారంభానికి ముందుగానే రైతులకు భూసార పరీక్షల ఫలితాలు అందడం వల్ల పంటలకు అవసరమైన ఎరువులను రైతులు ముందుగానే సిద్ధం చేసుకునే అవకాశం ఉన్నది.
భూసార పరీక్ష ఫలితాలు..
భూసార పరీక్షా కేంద్రాలు పాడేరు, అనకాపల్లి, విశాఖపట్నం, సామర్లకోటలో ఉన్నాయి. మట్టి నమూనాలను సేకరించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఆరు రకాల ప్రధాన ఫలితాలను రైతులకు అందజేస్తుంది. భూమి(మట్టి)లోని ఉదజని సూచిక(పీహెచ్), లవణ సాంద్రత(ఈసీ), సేంద్రీయ కర్బనం(ఓసీ శాతం), నత్రజని లభ్యత(కేజీ/హెక్టారు), భాస్వరం లభ్యత(కేజీ/హెక్టార్), పోటాషియం లభ్యత(కేజీ/హెక్టారు) ఫలితాలను రైతులకు తెలియజేస్తారు.