మిలాన్, ఐఎఫ్‌ఆర్‌లకు విస్తృత ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 18 , 2026 | 01:23 AM
విశాఖ వేదికగా వచ్చే నెల 16 నుంచి 25 వరకూ జరగనున్న మిలాన్, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్), ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం (ఐవోఎన్‌ఎస్)కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ తెలిపారు.
వచ్చే నెల 16 నుంచి 25 వరకూ నిర్వహణ
రాష్ట్రపతితో పాటు పలువురు ప్రముఖులు హాజరు
19న బీచ్‌రోడ్డులో సిటీ పరేడ్
మూడు లక్షల మంది వస్తారని అంచనా
విశాఖ ఎకనమిక్ రీజియన్‌లో మురికివాడల అభివృద్ధి
నెలాఖరుకల్లా గూగుల్‌కు తర్లువాడలో భూములు అప్పగింత
కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్
విశాఖపట్నం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి):
విశాఖ వేదికగా వచ్చే నెల 16 నుంచి 25 వరకూ జరగనున్న మిలాన్, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్), ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం (ఐవోఎన్‌ఎస్)కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ తెలిపారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఐఎఫ్‌ఆర్‌లో భాగంగా వచ్చే నెల 19వ తేదీన ఆర్కే బీచ్‌రోడ్డులో నిర్వహించనున్న సిటీ పరేడ్‌కు మూడు లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. సిటీ పరేడ్‌కు కోసం బీచ్‌రోడ్డు పొడవునా గ్యాలరీలను నేవీ ఏర్పాటుచేస్తుందని, రోడ్లు, బ్యూటిఫికేషన్ వంటివి జీవీఎంసీ చూస్తుందన్నారు. సిటీ పరేడ్‌లో భాగంగా పార్కు హోటల్ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు కార్నివాల్ ఉంటుందన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రెండు శకటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటుచేస్తామన్నారు. బీచ్‌రోడ్డులో సముద్రం వైపు ఏర్పాటుచేసే వేదికపై ప్రముఖులు ఆశీనులవుతారన్నారు. అదే సమయంలో సముద్రంలో నౌకలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం మేరకు 58 దేశాలకు చెందిన ప్రతినిధులు ఐఎఫ్‌ఆర్‌కు హాజరుకానున్నారని తెలిపారు. ఐఎఫ్‌ఆర్‌కు భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము 17వ తేదీన హాజరవుతున్నట్టు అధికారిక సమాచారం అందిందన్నారు. ప్రధానమంత్రి, ఇతర ప్రముఖుల పర్యటన వివరాలు ఇంకా రావలసి ఉందన్నారు. తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రంలో ఐఎఫ్‌ఆర్ విలేజ్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పర్యాటక, జౌళి శాఖలకు చెందిన స్టాళ్లు ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. జ్ఞానాపురం నుంచి షీలానగర్ వరకు రోడ్డు విస్తరణ, మరమ్మతులు నెలాఖరుకు పూర్తవుతాయన్నారు.
శ్రీకాకుళం నుంచి అంబేడ్కర్ కోనసీమ జిల్లా వరకు విస్తరించిన విశాఖ ఎకనమిక్ రీజియన్‌లో చేపట్టనున్న 49 ప్రాజెక్టుల్లో 18 ప్రాజెక్టులు విశాఖ జిల్లాలో అమలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. వీటిలో భాగంగా జీవీఎంసీ పరిధిలో మూడు నుంచి నాలుగు మురికివాడలు అభివృద్ధి చేస్తామన్నారు. ప్రాజెక్టు డెవలప్ చేసే సంస్థలకు కొంత వాణిజ్య అవసరాలకు ఇచ్చి, మిగిలిన ప్రాంతంలో అక్కడ నివసించే పేద వర్గాలకు ఇళ్లు, సామాజిక భవనం నిర్మించడం జరుగుతుందన్నారు. విశాఖ ఎకనమిక్ రీజియన్‌లో వీఎంఆర్‌డీఏ, పర్యాటక శాఖలు కొన్ని ప్రాజెక్టులు చేపడతాయన్నారు. పెట్టుబడిదారుల సదస్సులో జరిగిన ఒప్పందాల అమలుకు జిల్లా యంత్రాంగంపరంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆయా సంస్థలకు అనుమతులు మంజూరు, మౌలిక వసతుల కల్పన వేగవంతం చేస్తామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానంగా వీఎంఆర్‌డీఏ చేపట్టిన అప్రోచ్ రోడ్ల పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. వీటిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. అడవివరం నుంచి శొంఠ్యాం వరకూ రోడ్డు విస్తరణలో వన్యప్రాణి సంరక్షణకు చెందిన భూమికి అనుమతి రావలసి ఉందన్నారు. అయితే రోడ్డుకు పడమర వైపు విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్‌కు డేటా సెంటర్ నిమిత్తం ఈ నెలాఖరుకు భూములు అప్పగిస్తామన్నారు. ఇప్పటికే చాలామంది డీపట్టా రైతులు భూములు ఇచ్చారని, మిగిలిన ఐదారుగురు త్వరలో ముందుకువస్తారన్నారు. రైతుల ఖాతాలకు ఇప్పటివరకూ రూ.10 కోట్లు జమ చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.