సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు
ABN , Publish Date - Apr 22 , 2026 | 12:53 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాబోయే వారం రోజుల్లో మూడు రోజులు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు.
రాబోయే వారంలో 3 రోజులు ఉమ్మడి జిల్లాలోనే...
23న రాంబిల్లిలో ‘రెన్యూ ఫొటోవాల్టిక్స్’కు భూమి పూజ
27న ఏయూ శతాబ్ది ఉత్సవాలకు హాజరు
28న గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన
విశాఖపట్నం, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాబోయే వారం రోజుల్లో మూడు రోజులు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23 (గురువారం)న అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండల పరిధిలో గల ఏపీఐఐసీ ఆర్థిక మండలిలో రూ.4 వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్న రెన్యూ ఫొటోవాల్టిక్స్ సంస్థ భూమి పూజలో పాల్గొంటారు. 27 (సోమవారం)న ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలో పాల్గొంటారు. ఆ రోజు రాత్రికి విశాఖలోనే బస చేస్తారు. ఆ మరుసటి రోజు అంటే 28న ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. దీనికి గూగుల్ అంతర్జాతీయ ప్రతినిధులు కూడా హాజరవుతారు. సీఎం పర్యటన మూడు రోజులు దగ్గర దగ్గరగా ఉండడంతో అటు అనకాపల్లి, ఇటు విశాఖ జిల్లా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్చారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించే శతాబ్ది ఉత్సవ ఏర్పాట్లను కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, ఏయూ వీసీ రాజశేఖర్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు.