Share News

ముఖ్యమంత్రి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:57 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నగర పర్యటన (19వ తేదీన)కు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ సూచించారు.

ముఖ్యమంత్రి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

ఏయూ మైదానం, బీచ్‌ రోడ్డులో కలెక్టర్‌, సీపీ పరిశీలన

విశాఖపట్నం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి):

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నగర పర్యటన (19వ తేదీన)కు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ సూచించారు. ఆయన గురువారం నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ, ఇతర అధికారులతో కలిసి ఆర్కే బీచ్‌రోడ్డు, ఏయూ మైదానం పరిశీలించారు. ఏయూ ప్రాంగణంలో గ్యాలరీల ఏర్పాటు, ఇతర భద్రతా చర్యలు, వాహన రాకపోకలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. బీచ్‌రోడ్డులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమం నిర్వహించే ప్రదేశాన్ని, సీఎం బస చేయనున్న పోర్టు అతిథి గృహం మార్గాన్ని పరిశీలించారు. ఏయూలో జరిగే కార్యక్రమానికి జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరి, బీచ్‌రోడ్డులో కార్యక్రమానికి నోడల్‌ అధికారిగా జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ వ్యవహరించనున్నారు.

పట్టాలు పంపిణీకి పటిష్ట ఏర్పాట్లు

ఏయూ మైదానంలో ఈ నెల 19న ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాల పంపిణీకి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరి చెప్పారు. సుమారు 25 వేల మందికి ఇళ్ల పట్టాలు, కన్వేయన్స్‌ డీడ్స్‌ పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. సభ అనంతరం పట్టాల పంపిణీ వేగంగా జరిగేలా నియోజకవర్గాల వారీగా ప్రత్యేక కౌంటర్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. లబ్ధిదారులు ముందుగానే ఏయూ మైదానానికి చేరుకొని తమకు కేటాయించిన కౌంటర్ల వద్ద పట్టాలు, డీడ్స్‌ స్వీకరించాలని సూచించారు.


వర్షంతో ఊరట

విశాఖపట్నం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి):

నగర పరిధిలోని పలుచోట్ల గురువారం మధ్యాహ్నం వర్షం కురిసింది. గురువారం ఉదయం నుంచి తీవ్రమైన ఉక్కపోత కొనసాగింది. అయితే రెండున్నర, మూడు గంటల సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు పడగా, రైల్వే స్టేషన్‌, జ్ఞానాపురం, అక్కయ్యపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్‌ తదితర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. జ్ఞానాపురం, రైల్వే స్టేషన్‌ తదితర ప్రాంతాల్లో కాలువలు పొంగి, రహదారులపైకి నీరు చేరింది. ఈ నెల 19న బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం వాయుగుండంగా మారనున్నందున మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Updated Date - Sep 18 , 2026 | 01:01 AM