Share News

చందనోత్సవానికి విస్తృత ఏర్పాట్లు

ABN , Publish Date - Apr 19 , 2026 | 01:27 AM

సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

చందనోత్సవానికి విస్తృత ఏర్పాట్లు

రేపే అప్పన్న నిజరూప దర్శనం

వేకువజామున 3.30 గంటల నుంచి సామాన్య భక్తులకు అవకాశం

ఎక్కడికక్కడ షామియానాలు, చలువ పందిళ్లు

మంచినీరు, మజ్జిగ పంపిణీకి 200 పాయింట్లు ఏర్పాటు

సింహాచలం, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి):

సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు వంశపారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యులకు తొలిదర్శనం కల్పించనున్నారు. అనంతరం 3.30 గంటల నుంచి సామాన్య భక్తులకు అనుమతించనున్నారు.

ఉత్సవాన్ని పురస్కరించుకుని రంగురంగుల విద్యుత్‌ దీపాలతో సింహగిరిని అలంకరించారు. భక్తులకు ఎండ/వాన నుంచి రక్షణ కల్పించేందుకు షామియానాలు, చలువ పందిళ్లు వేశారు. మంచినీరు, మజ్జిగ, బిస్కెట్ల పంపిణీకి కొండదిగువన, పైన మొత్తం సుమారు 200 పాయింట్లు ఏర్పాటుచేశారు. క్యూలైన్లు, భక్తుల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, ప్రసాదాల కౌంటర్ల వద్ద, అన్నప్రసాద భవనం వద్ద ప్రస్తుతం ఉన్న వాటితో పాటు అదనంగా సీసీ కెమెరాలను, అత్యవసర వైద్య సేవలు అందించేందుకు శిబిరాలు ఏర్పాటుచేశారు. అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుతున్నారు. భక్తులకు కలిగే ఇబ్బందులను పరిష్కరించేందుకు పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టమ్‌, పోలీసు కంట్రోల్‌ రూమ్‌లను పది ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. దర్శన టికెట్లపై ఎటువంటి అదనపు ముద్రణలు ఉన్నా లేదా స్కానింగ్‌ అవకున్నా వాటిని తీసుకువచ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

కేవలం వెహికల్‌ పాస్‌ ఉన్న వాహనాలను మాత్రమే సింహగిరిపైకి అనుమతిస్తారు. వెహికల్‌ పాస్‌ ఉన్నవారు ప్రత్యేకంగా డ్రైవర్‌ను ఏర్పాటుచేసుకోవాలి. డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌ విధానాన్ని అనుమతించరు. ఉత్సవ నిర్వాహణలోని దేవదాయ శాఖ లేదా ఇతర శాఖల సిబ్బంది వాహనాలను కూడా అనుమతించరు. వారికి ప్రత్యేకంగా 19, 20 తేదీల్లో పది బస్సులను కేటాయించనున్నారు. ఇక భక్తుల కోసం ఉచితంగా 90 ఆర్‌టిసి బస్సులను నడపనున్నారు. చందనోత్సవానికి సంబంధించిన సమాచారం కోసం 08912954944ను సంప్రతించాలని దేవదాయ అధికారులు సూచించారు.

చందనోత్సవానికి 2,800 మందితో బందోబస్తు

డ్రోన్‌లతో నిరంతర పర్యవేక్షణ

కొండ దిగువన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి

విశాఖపట్నం, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి):

చందనోత్సవానికి 2,800 మందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి తెలిపారు. గత ఏడాది ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వేడుక ప్రశాంతంగా ముగిసేలా భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. కొండపై నిర్మాణాలను ముందుగానే పూర్తిచేసేలా దేవస్థానం అధికారులతో సంప్రతింపులు జరపడంతోపాటు క్యూలైన్ల గోడలు, భవనాలు, గేట్ల పటిష్ఠతపై రోడ్లు, భవనాల శాఖ అధికారులతో స్ట్రక్చరల్‌ స్టెబిలిటీ సిర్టిఫికెట్లు తీసుకున్నామన్నారు. దేవస్థానం అధికారులు జారీచేసిన పాస్‌లు కలిగిన వాహనాలను మాత్రమే కొండపైకి అనుమతిస్తామన్నారు. దర్శనానికి వచ్చే భక్తులంతా తమ వాహనాలను కొండ దిగువనే పార్కింగ్‌చేసి, దేవస్థానం అధికారులు ఏర్పాటుచేసిన బస్సుల్లో కొండపైకి చేరుకోవాల్సి ఉంటుందన్నారు. కొండపై అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా క్యూలైన్లు, కీలకమైన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటుచేశామన్నారు. నగర పరిధిలోని వెయ్యి మంది అధికారులు, సిబ్బందితోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది, ఏపీఎస్పీ, ఆక్టోపస్‌ విభాగాల నుంచి మరో 1800ని బందోబస్తుకు ఉపయోగిస్తున్నామన్నారు. కొండ దిగువన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేశామని, దానికి ఏడీసీపీ (అడ్మిన్‌) ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు, సూచనలను అందజేస్తారన్నారు. కొండదిగువన, ఘాట్‌రోడ్డులో డ్రోన్లతో నిరంతర పహారా ఉంటుందన్నారు. ఉత్సవం ప్రశాంతంగా ముగుస్తుందని, భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీపీ భరోసా ఇచ్చారు.

Updated Date - Apr 19 , 2026 | 01:28 AM