గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:40 PM
ఉమ్మడి అల్లూరి సీతామరాజు జిల్లాలో ఈ ఏడాది గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు.
ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘనంగా నిర్వహించాలి
అధికారులకు కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశం
పాడేరు, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి అల్లూరి సీతామరాజు జిల్లాలో ఈ ఏడాది గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో గణతంత్ర వేడుకలపై వివిధ శాఖల అధికారులతో స్థానిక కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. అల్లూరి సీతామరాజు జిల్లా కేంద్రం పాడేరులోని తలారిసింగి ఆశ్రమోన్నత పాఠశాల ఆవరణలో, పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఈ ఏడాది గణతంత్ర వేడుకలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు. రెండు ప్రాంతాల్లోని గణతంత్ర వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. దేశభక్తి, ఆచార, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, అలాగే ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ ప్రభుత్వ శాఖలు స్టాళ్లను ఏర్పాటు చే
యాలన్నారు. డోలీ మోతలకు దూరం చేసేందుకు రహదారుల నిర్మాణం, అత్యావసర వైద్య సేవలకు డ్రోన్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే స్థానిక ఆహార ఉత్పత్తుల ప్రదర్శన, వంటకాల తయారీపై సైతం ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల వారసులను సత్కరించడం, జిల్లాలో ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్ధల ప్రతినిధులకు ప్రశంసాపత్రాలు అందజేతకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వేడుకల్లో పాల్గొన్న అందరికీ స్నాక్స్, తాగునీరు అందించాలని, వేడుకలు ముగిసిన తరువాత ఆయా మైదానాలను పరిశుభ్రం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేడ్కర్, ఆర్‌డీవో ఎంవీఎస్.లోకేశ్వరరావు, డీఎస్‌పీ కె.అభిషేక్, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, జిల్లా ఉద్యానవనాధికారి కె.బాలకర్ణ, ఆర్‌టీసీ డీఎం శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్థఽక శాఖాధికారి జయరాజు, డ్వామా పీడీ విద్యాసాగరరావు,
కాఫీ బోర్డు సీనియర్ లైజన్ అధికారి ఎల్.రమేశ్, పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.