గిరి ప్రదక్షిణకు విస్తృత ఏర్పాట్లు
ABN , Publish Date - Jul 27 , 2026 | 01:02 AM
వరాహ లక్ష్మీనృసింహస్వామి గిరి ప్రదక్షిణకు అధికా రులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
28న మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం
మంగళ, బుధ వారాల్లో అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
అతి శీఘ్ర దర్శనానికి రూ.300 టికెట్
విశాఖపట్నం, జూలై 26 (ఆంధ్రజ్యోతి):
వరాహ లక్ష్మీనృసింహస్వామి గిరి ప్రదక్షిణకు అధికా రులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా మాదిరిగా భక్తు లు భారీసంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండడంతో అం దుకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 28న మధ్యాహ్నం రెండు గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు గిరి ప్రదక్షిణ ప్రచారరథాన్ని జెండా ఊపి ప్రారంభిస్తారు. అయితే ఉదయం నుంచే చాలా మంది భక్తులు తొలి పావంచా వద్ద గిరి ప్రదక్షిణ ప్రారంభించనున్నారు.
గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొనే అవ కాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సింహా చలం కొండ దిగువ తొలి పావంచా నుంచి ప్రారంభమై అడవివరం జంక్షన్ మీదుగా, రెసిడెన్షియల్ స్కూల్, పైనాపిల్ కాలనీ, సెంట్రల్ జైల్, ముడసర్లోవ, చినగదిలి, యల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, హనుమంతువాక జంక్షన్, విశాలాక్షినగర్, జోడుగుళ్లపాలెం, అప్పుఘర్, ఎంవీపీ కాల నీ డబుల్ రోడ్డు మీదుగా వెంకోజీపాలెం, ఇసుకతోట, హెచ్‌బీకాలనీ, సీతమ్మధార, అల్లూరి సీతారామరాజు విగ్రహం, బాలయ్య శాస్ర్తి లే అవుట్, పోర్టు స్టేడియం, కంచరపాలెం, డీఎల్‌బీ క్వార్టర్సు, మాధవధార, మురళీనగర్, ఆర్‌అండ్‌బీ ఆఫీస్, ఎన్‌ఎస్‌టీఎల్, కుమారి కల్యాణ మండపం, ప్రహ్లాదపురం, శ్రీనివాసనగర్, పాత గోశాల మీదుగా తిరిగి స్వామి వారి కొండ దిగువ తొలి పావంచా వద్దకు చేరుకోవడంతో ముగస్తుంది. అనంతరం భక్తులు కొండపైకి వెళ్లి స్వామిని దర్శించుకుంటారు.
స్వామి దర్శన వేళలు..
భక్తులు ఈ నెల 28న ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకోవచ్చు. సాయంత్రం నాలుగు నుంచి 4.30 గంటల మధ్య పవళింపు సేవ నేపథ్యంలో దర్శనాలు నిలిపివేస్తారు. తిరిగి సాయంత్రం 4.30 నుంచి ఏడు గంటల వరకు దర్శనాలకు అవకాశం కల్పిస్తారు. రాత్రి ఏడు నుంచి 8.30 గంటల మధ్య ఆరాధనం నేపథ్యంలో దర్శనాలు నిలిపేస్తారు. రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు దర్శనాలకు అవకాశం కల్పిస్తారు. ఈ నెల 29న ఉదయం ఆరాధనం కొనసాగుతుంది. నాలుగు గంటలు నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు దర్శనం చేసుకో వచ్చు. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య (పవళింపు) దర్శనాలు నిలిపివేయ నున్నారు. సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు (ఢిల్లీ విజయోత్సవం) దర్శనాలు నిలిపేయను న్నారు. ఐదు గంటలు నుంచి రాత్రి ఏడు గంటల వరకు దర్శనాలు కల్పిస్తారు. 8.30 గంటల వరకు (ఆరాధనం) దర్శనాలు నిలిపివేసి 8.30 నుంచి 9 గంటలు వరకు అవకాశం కల్పిస్తారు. బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తులకు దేవాలయ వెలుపల ప్రాకారం నుంచి గుడి ప్రదక్షిణకు అనుమతిస్తారు. గిరి ప్రదక్షిణ నేపథ్యంలో 28, 29 తేదీల్లో ఆర్జితసేవలు రద్దు చేశారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు స్వామి వారి ఉత్సవమూర్తులను పుష్ప రథంలో ఉంచి, వేద పఠనం, నాధ స్వరం, కోలాటం, పులి వేషాలు, తప్పెటగుళ్లు, సాంస్కృతిక కార్యక్రమాల మధ్య రథయాత్ర ప్రారంభిస్తారు.
సేవలు..
గిరి ప్రదక్షిణ మార్గాల్లో వాటర్ ఫ్రూఫ్ షామియా నాలతో (పగోడా) స్టాల్స్‌ను ఏర్పాటుచేసి టేబుల్స్, కుర్చీలు, లైటింగ్, తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. కాలినడక మార్గంలో 600 మరుగు దొడ్లను ఏర్పాటుచేశారు. ఈ నెల 28న ఉదయం ఏడు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం పది గంటల వరకు గోపాలపట్నం, వేపగుంట మీదుగా వచ్చే బస్సులను సింహాచలం ఆర్టీసీ బస్టాండ్‌లో ఆపేస్తారు. 29న తెల్లవారుజామున నాలుగు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు దేవస్థానం బస్టాండ్, అడవివరం జంక్షన్ నుంచి కొండపైకి, కిందకి 50 బస్సుల ను నిరంతరాయంగా నడుపుతారు. 28న ఉదయం ఏడు నుంచి 29న ఉదయం ఆరు గంటల వరకు శొంఠ్యాం వైపు నుంచి సింహాచలం వచ్చే బస్సులను అడవి వరం జంక్షన్ వద్ద, హనుమంతువాక జంక్షన్ నుంచి వచ్చే బస్సులను సెంట్రల్ జైలు వద్ద నిలిపివేస్తారు. 28న ఉదయం 11 నుంచి 29న ఉదయం పది గంటల వరకు గోపాలపట్నం మీదుగా ప్రహ్లాదపురం వచ్చే బస్సులను గోపాలపట్నం పెట్రోల్ బంకు నుంచి వేపగుంట వైపు మళ్లిస్తారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆరోగ్యశాఖ అధికారులు ఫీల్డ్ మెడికల్ టీమ్స్ సెంట్రల్ కంట్రోల్ రూమ్‌తో సమన్వయం చేసుకుని అత్యవసర చికిత్స అందించేలా చర్యలు చేపట్టారు. అప్పుఘర్, జోడుగుళ్ల పాలెం వద్ద భక్తులు సముద్ర స్నానాల నేపథ్యంలో మత్స్యశాఖ 30 మంది గజ ఈతగాళ్లను నియమించింది. కొండపైన ఒక అగ్నిమాపక వాహనం, ఫైర్ ఎక్సపర్ట్స్‌ను సిద్ధంగా ఉంచుతారు. గిరి పదక్షిణ మార్గంలో హై రెజల్యూషన్ సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
దర్శనం వివరాలివి...
ఆలయ ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు తెల్లవారుజామున మూడు గంటలకు నక్షత్రవనం పక్క నుంచి గుడి ప్రదక్షిణకు అనుమతిస్తారు. ప్రధాన రాజగోపురం వద్ద ప్రారంభించి సుపధ మండపం మధ్య భాగం నుంచి ఉత్తర రాజగోపురం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి దేవాలయ ప్రాకారం వెనుక భాగం వరకు ప్రదక్షిణ చేయాలి. దక్షిణ రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన పుట్‌ఓవర్ బిడ్జిపై నుంచి దిగి ప్రసాద విక్రయశాల పక్క నుంచి తిరిగి రాజగోపురం చేరుకుని పాత పీఆర్‌వో కార్యాలయం పక్కనుంచి బయటకు వెళ్లాలి. శీఘ్ర దర్శనం రూ.100 టికెట్లను రద్దుచేసి అదే క్యూలైన్‌లో భక్తులకు ఉచిత దర్శనం కల్పిస్తారు. భక్తుల సౌకర్యార్థం రూ.300 టికెట్లతో అతి శీఘ్ర దర్శనానికి అవకాశం కల్పిస్తారు.
యంత్రాంగం ప్రత్యేక దృష్టి
రద్దీ ప్రాంతాల్లో తాత్కాలిక వంతెనలు సాధ్యంకాదు
స్పష్టం చేసిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్
మధురవాడ నుంచి వచ్చే చిన్న వాహనాలకు అనుమతిపై మల్లగుల్లాలు
హెల్త్‌సిటీలో ఓపీలు తగ్గించుకోవాలని సూచన
విశాఖపట్నం, జూలై 26 (ఆంధ్రజ్యోతి):
సింహగిరి ప్రదక్షిణపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారించింది. ట్రాఫిక్ చిక్కులను పరిష్కరించడంపై మల్లగుల్లాలు పడుతున్నారు. దారి పొడవునా 32కి.మీ. దూరంలో భక్తులు నడకకు అవరోధం లేకుండా చూడడం ఎలా అనేదానిపై జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, జేసీ విద్యాధిరి నేతృత్వంలో కమిటీలు ఇచ్చిన నివేదిక మేరకు కార్యాచరణ అమలుచేయనున్నారు. భక్తుల నడక దారిలో వాహనాలకు అడ్డంకి లేకుండా హనుమంతువాక, అప్పుఘర్, వెంకోజీపాలెం వద్ద తాత్కాలికంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటుకు కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ప్రతిపాదించారు. ఇందుకోసం భారత సైన్యానికి చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌కు లేఖ రాశారు. ఈ ప్రాంతాల్లో పరిస్థితి, గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తుల వివరాలను లేఖలో ప్రస్తావించారు. అమర్‌నాథ్, జమ్ముకశ్మీర్, లద్దాఖ్, ఇతర సరిహద్దు ప్రాంతాల్లో తాత్కాలిక ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటుచేసే బాధ్యత ఈ సంస్థదే. అయితే ఆయా ప్రాంతాల్లో బ్రిడ్జిలపై పరిమిత సంఖ్యలో ప్రజలు ప్రయాణిస్తారని, విశాఖలో లక్షలమంది భక్తులు వెళ్లడం సురక్షితం కాదని సంస్థ కలెక్టర్‌కు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో భక్తుల నడక దారిలో అవాంతరాలు లేకుండా ట్రాఫిక్ నిర్వహణపై జీవీఎంసీ కమిషనర్, జేసీ ఇచ్చిన నివేదికలు అమలుచేస్తారు. ఈ మేరకు గిరి ప్రదక్షిణకు బయట ఒక వ్యూహం, లోపల మరో ప్రణాళిక అమలుచేయాలని నిర్ణయించారు. ఆనందపురం వైపు నుంచి వచ్చే వాహనాలు పెందుర్తి, సబ్బవరం, లంకెలపాలెం మీదుగా మళ్లిస్తారు. మధురవాడ, ఎండాడ, ఆరిలోవ నుంచి వెంకోజీపాలెం, మద్దిలపాలెం వైపుగా వచ్చే ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను రోడ్డుకు ఒకవైపుగా అనుమతించే విషయంలో కొన్ని పరిమితులు విధించనున్నారు. మంగళవారం ఉదయం ప్రారంభమయ్యే గిరిప్రదక్షణ తాకిడిని పరిగణనలోకి తీసుకుని ఆంక్షలు ఉంటాయి. భక్తుల రద్దీ లేకపోతే బైకులు, ఆటోలు, కార్లు అనుమతిస్తారు. రద్దీ పెరిగితే వెనక్కి మళ్లిస్తారు. గత ఏడాది ఐదు లక్షలమంది భక్తులు వచ్చినపుడు ఒకవైపు చిన్నవాహనాలకు అనుమతించిన విషయాన్ని అధికారులు గుర్తుచేశారు. దీనిపై సోమవారం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా ఆరిలోవ హెల్త్‌సిటీ యాజమాన్యాలతో జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి మూడు రోజుల క్రితమే సమావేశమయ్యారు. ఈనెల 28న ఓపీ లేకుండా చూసుకోవాలని, అత్యవస సర్జరీలు నగరంలో మరోచోట చేపట్టాలని సూచించారు. గిరి ప్రదక్షిణ జరిగే రోజున తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయాలని, లేదంటే వాయిదా వేసుకోవాలని కలెక్టర్ కోరారు. అప్పుఘర్ బీచ్‌లో స్నానాలు కోసం షవర్లు ఏర్పాటు చేశామని, 28వ తేదీ రాత్రి పది గంటల తరువాత భక్తులకు తాగునీరు, వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, రాత్రంతా దగ్గరుండి తాను పర్యవేక్షిస్తానని కలెక్టర్ తెలిపారు. గిరి ప్రదక్షిణకు ప్రజలు సహకరించాలని కోరారు.