బీజేపీ సమావేశాలకు విస్తృత ఏర్పాట్లు
ABN , Publish Date - Aug 18 , 2026 | 01:18 AM
నగరంలో మంగళవారం జరగనున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నేడు పీఎం పాలెం వీ కన్వెన్షన్ సెంటర్‌లో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం
ముఖ్య అతిథిగా హాజరుకానున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్
విశాఖపట్నం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి):
నగరంలో మంగళవారం జరగనున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటికి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఇందుకోసం ఆయన సోమవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. బీచ్‌రోడ్డులోని గ్రాండ్ బేలో బస చేశారు. మంగళవారం ఉదయం సింహాచలం వెళ్లి శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకుంటారు. అనంతరం పీఎం పాలెం స్టేడియం సమీపానున్న వి కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో పాల్గొంటారు. దీనికి జాతీయ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయకులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సోమవారం వి కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లి పలు సూచనలు చేశారు. పార్కింగ్, భద్రత ఏర్పాట్లు, ఇతర సదుపాయాలను పరిశీలించారు. సమావేశం విజయవంతంగా ముగిసే వరకు అంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గ్రాండ్ బేలో యువ సంవాదం
గ్రాండ్ బే హోటల్‌లో ‘యువ సంవాదం’ కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం నిర్వహించనున్నారు. దీనికి కూడా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఇందులో యువతీ యువకులు పాల్గొని, వారి ఆలోచనలు పంచుకుంటారు. వారితో నితిన్ నబిన్ సుమారు గంట సేపు ముఖాముఖి మాట్లాడతారు. యువత అభిప్రాయాలు, ఆకాంక్షలు, దేశం పట్ల వారి బాధ్యత, దృక్పథం వంటివి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ కార్యక్రమం, వేదిక ఏర్పాట్లను కూడా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సోమవారం పరిశీలించారు. బీజేపీ యువమోర్చా సమన్వయ బాధ్యతలు తీసుకుంది.