అరకు ఉత్సవ్‌కు విస్తృత ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 26 , 2026 | 11:22 PM
అరకు ఉత్సవ్‌కు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 29 నుంచి నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో కలెక్టర్ దినేశ్‌కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
డిగ్రీ కళాశాల మైదానంలో పనులను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీవో
సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు
తుర్రాయిగుడ గ్రామం బదులు చొంపి సందర్శన
అరకులోయ, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): అరకు ఉత్సవ్‌కు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 29 నుంచి నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో కలెక్టర్ దినేశ్‌కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఎస్పీ అమిత్‌బర్ధార్, ఐటీడీఏ పీవో శ్రీపూజ, అధికారులతో కలిసి ఆయన ఉత్సవ్ ప్రధాన వేదిక అయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరకులోయలో సుమారు మూడు గంటల సేపు గడిపే అవకాశం ఉందన్నారు. తుర్రాయిగుడ గ్రామానికి బదులు చొంపి గ్రామాన్ని సీఎం సందర్శించనున్నారని తెలిపారు. కొత్తవలసలోని ఐటీడీఏ హెచ్‌ఎన్‌టీసీ ఫాం సమీపంలో ప్రత్యేకంగా హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం కొత్తవలసను ఆనుకొని ఉన్న చొంపి గ్రామాన్ని సందర్శిస్తారని, గ్రామంలో హోం స్టేలను పరిశీలిస్తారన్నారు. అనంతరం గిరిజన మ్యూజియం, కాఫీ మ్యూజియాన్ని సందర్శించి కార్నివాల్ ర్యాలీని ప్రారంభిస్తారన్నారు. జిల్లాలో పలు అభివృద్దికార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన శిలాఫలకాలను సీఎం ఆవిష్కరిస్తారని చెప్పారు.
చురుగ్గా పనులు
అరకు ఉత్సవ్ ప్రధాన వేదిక అయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని ఎక్స్‌కవేటర్లతో చదును చేస్తున్నారు. అలాగే పట్టణంలో పారిశుధ్య పనులను చురుగ్గా చేపడుతున్నారు. డీఎల్‌పీవో, ఎంపీడీవో ఆధ్వర్యంలో సిబ్బంది యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారు.