వార్డుల విభజనకు మరింత గడువు
ABN , Publish Date - Apr 26 , 2026 | 01:36 AM
జీవీఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజనకు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు గడువు పెంచింది.
ప్రాథమిక ముసాయిదా విడుదలకు వచ్చే నెల 17 వరకు అవకాశం
జూన్ 12 నుంచి జూన్ 23 మధ్య తుది నోటిఫికేషన్
వార్డుల సంఖ్య 150కి పెంచాలని ప్రజా ప్రతినిధుల నుంచి ఒత్తిడి
అందుకోసం వ్యవధి పెంచాలంటూ ప్రభుత్వాన్ని అధికారులు కోరినట్టు ప్రచారం
రీషెడ్యూల్ జారీ
విశాఖపట్నం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజనకు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు గడువు పెంచింది. ఈ మేరకు శనివారం రీషెడ్యూల్ విడుదల చేసింది. జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న 98 వార్డులను 120కి పెంచుతూ ఈనెల తొమ్మిదిలోగా ముసాయిదాను విడుదల చేయాలని తొలుత ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ తర్వాత 26వ తేదీ (ఆదివారం) వరకూ గడువు పెంచింది. దీంతో ఇప్పటికే ప్రాథమిక ముసాయిదా తయారుచేసిన అధికారులు ఆదివారం ప్రజలకు తెలిసేలా ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇంతలో వార్డుల పునర్విభజన షెడ్యూల్‌ను మరోసారి మార్చుతూ ప్రభుత్వం శనివారం రీషెడ్యూల్ జారీచేయడం చర్చనీయాంశంగా మారింది. వార్డుల సంఖ్యను 120 కాకుండా 150కి పెంచాలంటూ నగరానికి చెందిన ప్రజా ప్రతినిధులు ఒత్తిడి చేయడం వల్లనే షెడ్యూల్‌ను మరోసారి పొడిగించార ప్రచారం జరుగుతోంది.
జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం 98 వార్డులు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 15 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న మునిసిపల్ కార్పొరేషన్లలో వార్డుల సంఖ్య 120గా నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 28న ఉత్తర్వులు జారీచేసింది. పెరిగిన వార్డుల సంఖ్యకు అనుగుణంగా విభజన ప్రక్రియ ప్రారంభించాలంటూ ఈనెల రెండున షెడ్యూల్‌ను జారీచేసింది. ప్రాథమిక ముసాయిదా నోటిఫికేషన్‌ను ఏప్రిల్ తొమ్మిదిన విడుదల చేయాలని ఆదేశించింది. అయితే వార్డుల విభజనకు తక్కువ వ్యవధి ఇవ్వడంతో తప్పులు దొర్లేందుకు అవకాశం ఉంటుందని, అందువల్ల వ్యవధి పెంచాలని రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ రావడంతో ప్రభుత్వం షెడ్యూల్‌ను పొడిగిస్తూ ఈనెల ఏడున ఉత్తర్వులు జారీచేసింది. పెంచిన షెడ్యూల్ ప్రకారం వార్డుల విభజనకు సంబంధించిన ప్రాథమిక ముసాయిదాను ఏప్రిల్ 26న ప్రజలకు తెలిసేలా వార్డు సచివాలయాలు, జోనల్ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో ప్రదర్శించాల్సి ఉంది. ఆ మేరకు ఇప్పటికే వార్డుల విభజనకు సంబంధించిన ప్రాథమిక ముసాయిదాను టౌన్‌ప్లానింగ్ అధికారులు తయారుచేసి, కమిషనర్ దృష్టిలో కూడా పెట్టారు. ఆదివారం ఉదయం కొత్త వార్డులకు సంబంధించిన ప్రాథమిక ముసాయిదాను విడుదల చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో వార్డుల విభజన ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను మరోసారి మార్చుతూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేయడం చర్చనీయాంశంగా మారింది.
వార్డుల సంఖ్య 150 పెంచాలనే డిమాండ్ కారణం
జీవీఎంసీ పరిధిలో వార్డుల సంఖ్యను 98 నుంచి 120కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. కానీ నగరానికి చెందిన ప్రజా ప్రతినిధులు వార్డుల సంఖ్యను 150కి పెంచాలని అధికారులతోపాటు ప్రభుత్వంపైనా ఒత్తిడి చేయడం వల్లే షెడ్యూల్‌ను మరోసారి పొడిగించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 120 వార్డులకు సంబంధించిన సరిహద్దులతో కూడిన ప్రాథమిక ముసాయిదాను టౌన్‌ప్లానింగ్ అధికారులు సంబంధిత జోన్ పరిధి ప్రజా ప్రతినిధులకు చూపించినట్టు తెలిసింది. ఈ సమయంలో వార్డుల సంఖ్య 150 పెంచితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తంచేసినట్టు సమాచారం. అయితే అది ప్రభుత్వ పరిధిలోని అంశమని, తాము ఏమీ చేయలేమని సమాధానం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలోని పెద్దలను ప్రజా ప్రతినిధులు వార్డుల సంఖ్య పెంచాలని కోరగా, జీవీఎంసీ కమిషనర్ నుంచి ప్రతిపాదన పంపితే పరిశీలిస్తామని చెప్పినట్టు తెలిసింది. దీంతో వార్డుల పునర్విభజన ప్రాథమిక ముసాయిదాను విడుదల చేయక ముందే షెడ్యూల్‌ను పొడిగిస్తే..150 వార్డులకు సరిహద్దులు నిర్ణయిస్తూ మరో ముసాయిదాను తయారుచేస్తామని కమిషనర్ ప్రభుత్వానికి తెలియజేసినట్టు సమాచారం. దీంతో వార్డుల పునర్విభజన షెడ్యూల్‌ను పొడిగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసిందనే ప్రచారం జరుగుతోంది. తాజా షెడ్యూల్ ప్రకారం వార్డుల పునర్విభజన ప్రాథమిక ముసాయిదా విడుదలకు వచ్చే నెల 17 వరకు అవకాశం కల్పించింది. 18 నుంచి వారం రోజులపాటు ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించాలని, వాటిని పరిగణనలోకి తీసుకుని 25 నుంచి జూన్ ఐదులోగా కమిషనర్‌కు పంపించి, అక్కడి నుంచి వారం రోజుల్లో సీడీఎంఏకు అందజేయాలని పేర్కొంది. జూన్ 12 నుంచి జూన్ 23 మధ్య వార్డుల విభజనకు సంబంధించిన తుది నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుంది.