పూడికతీత పనుల్లో పేలుడు
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:34 AM
చెరువులో పూడికతీత పనుల్లో భాగంగా పారతో మట్టి తవ్వుతుండగా పేలుడు సంభవించి మహిళా కూలీ ముఖానికి తీవ్రగాయాలయ్యాయి.ఈ ఘటనలో ఆమె కుడి కన్ను చూపు కోల్పయింది. ఎడమ కంటికి దెబ్బలు తగిలాయి. ఈ సంఘటనకు సంబంధించి సీఐ ఎల్.భాస్కరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మహిళా కూలీ ముఖానికి తీవ్రగాయాలు
ఒక కంటి చూపు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడి
పరవాడ, జూలై 3 (ఆంధ్రజ్యోతి):
చెరువులో పూడికతీత పనుల్లో భాగంగా పారతో మట్టి తవ్వుతుండగా పేలుడు సంభవించి మహిళా కూలీ ముఖానికి తీవ్రగాయాలయ్యాయి.ఈ ఘటనలో ఆమె కుడి కన్ను చూపు కోల్పయింది. ఎడమ కంటికి దెబ్బలు తగిలాయి. ఈ సంఘటనకు సంబంధించి సీఐ ఎల్.భాస్కరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని కలపాక పంచాయతీ స్వయంభూవరంలో రామ్‌సాగర్ చెరువు నుంచి మదు చెరువు వరకు వీబీ-జీరామ్‌జీ పథకం కింద కాలువ పూడికతీత పనులు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం కూలీలు పనులు చేస్తుండగా తొమ్మిదిన్నర గంటల సమయంలో తుంపాల లక్ష్మీ అప్పనర్సమ్మ పారతో మట్టి తవ్వుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో కళ్లు, ముఖంపైన తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటి కూలీలు వేపగుంట ప్రాంతంలోని శంకర్ నేత్ర వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు.. కుడి కన్ను చూపు పూర్తిగా కోల్పోయిందని, ఎడమ కన్నుకు ఆపరేషన్ చేయాల్సి వుంటుందని తెలిపారు. విషయం తెలుసుకున్న సీఐ.. పోలీసు సిబ్బందితో సంఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. అడవి పందులను వేటాడడం కోసం గుర్తు తెలియని వ్యక్తులు భూమిలో పాతిన పేలుడు పదార్థం కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వీబీ- జీరామ్‌జీ పనులు చేస్తుండగా జరిగిన పేలుడు ప్రమాదంలో ఒక కన్ను కోల్పోయిన తుంపాల లక్ష్మీ అప్పనర్సమ్మను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని సీఐటీయూ నాయకుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.