Share News

ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ

ABN , Publish Date - Aug 25 , 2026 | 01:12 AM

నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు తీసుకువచ్చిన ఎన్‌టీఆర్‌ వైద్య సేవ పథకాన్ని కార్పొరేట్‌, ప్రైవేటు ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి.

ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ

‘ఎన్‌టీఆర్‌ వైద్య సేవ’లో ఉచితంగా అందించాల్సిన సేవలకు డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేటు/కార్పొరేట్‌ ఆస్పత్రులు

ప్రభుత్వం ఇచ్చేవి సరిపోవని, ఖరీదైన ఇంప్లాంట్స్‌ కొనాలంటూ మాయమాయలు

రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకూ అదనంగా తీసుకుంటున్న వైనం

ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లేందుకు భయపడుతున్న రోగులు, సహాయకులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు తీసుకువచ్చిన ఎన్‌టీఆర్‌ వైద్య సేవ పథకాన్ని కార్పొరేట్‌, ప్రైవేటు ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ పథకం కింద మూడు వేలకుపైగా వ్యాధులకు ఉచితంగా వైద్యం అందించాల్సి ఉంది. ఈ స్కీమ్‌ వర్తించే వ్యాధులకు అందించే వైద్య సేవలకు, శస్త్ర చికిత్సలకు రూపాయి కూడా రోగుల నుంచి వసూలు చేయకూడదన్న నిబంధనలు ఉన్నాయి. కానీ, నగర పరిధిలోని అనేక ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నగరంలోని ఆస్పత్రులు కొన్ని శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చిన రోగుల నుంచి భారీమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయి. ‘మీకు చేయాల్సిన శస్త్ర చికిత్స క్లిష్టమైనది. ప్రభుత్వం అందించే డబ్బులు వల్ల ఖరీదైన ఇంప్లాంట్స్‌ రావు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి’ అని కొన్ని ఆస్పత్రులు, ‘మీ శస్త్ర చికిత్సకు రూ.లక్షల్లో ఖర్చవుతుంది. ప్రభుత్వం అంత మొత్తం ఇవ్వడం లేదు. మీరు అదనంగా చెల్లించేందుకు సిద్ధమైతే చికిత్స స్టార్ట్‌ చేస్తాం. ఈ విషయం బయటకు తెలియనివ్వకూడదు’ అని మరికొన్ని రోగులను బెదిరించి, భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నాయి.

ఎప్పటి నుంచో ఆరోపణలు

ఎన్‌టీఆర్‌ వైద్య సేవ పథకం వర్తించే రోగులు నుంచి కార్పొరేట్‌, ప్రైవేటు ఆస్పత్రులు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయినప్పటికీ ఉన్నతాధికారులు ఈ తరహా వసూళ్లపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా నగర పరిధిలోని ఒక ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక రోగికి గుండెకు సంబంధించిన సమస్య ఉన్నట్టు గుర్తించారు. ఈ శస్త్ర చికిత్స నిర్వహణకు ఎన్‌టీఆర్‌ వైద్య సేవ నుంచి రూ.లక్షన్నర వరకు మంజూరైంది. అయితే, అంతకుముందే రోగి కుటుంబ సభ్యులతో శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యుడి సహాయకుడు బేరం కుదుర్చుకున్నాడు. శస్త్ర చికిత్స చేస్తామని, అదనంగా రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. నిరుపేద కుటుంబం అయినప్పటికీ తమ కుమార్తెకు ఇబ్బందులు ఎదురుకాకూడదన్న ఉద్దేశంతో డబ్బులు ఇచ్చేందుకు వారు అంగీకరించారు. అలాగే, హెల్త్‌ సిటీలోని మరో ఆస్పత్రిలోనూ కొద్దిరోజుల కిందట ఒక రోగికి కీళ్లకు సంబంధించిన శస్త్రచికిత్స నిర్వహించగా, ఇంప్లాంట్‌ కోసమంటూ రూ.30 వేల వరకు వసూలు చేశారు. నగర పరిధిలోని మరో ఆస్పత్రిలో న్యూరో సర్జరీ చేయడానికి రూ.80 వేల వరకు వసూలు చేశారు. అనేక ఆస్పత్రుల్లో ఈ తరహా వసూళ్లు జరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఫిర్యాదులకు అవకాశం

ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఉన్నతాధికారు లకు తెలియజేసేందుకు ఇబ్బందులు ఉంటే డిశ్చార్జ్‌ అయిన తరువాత ఎన్‌టీఆర్‌ వైద్య సేవ కార్యాలయం నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకునే సమయంలోనైనా ఫిర్యాదు చేయవచ్చు. శస్త్రచికిత్సలు చేయకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉంటే స్థానికంగా ఆస్పత్రిలో ఉండే వైద్య మిత్రకు గానీ, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఉండే ఎన్‌టీఆర్‌ వైద్య సేవ జిల్లా కో-ఆర్డినేటర్‌, ఇతర అధికారులకుగానీ ఫిర్యాదు చేయవచ్చు. అదనంగా డబ్బులు డిమాండ్‌ చేస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఎన్‌టీఆర్‌ వైద్య సేవ జిల్లా-ఆర్డినేటర్‌ డాక్టర్‌ అప్పారావు తెలిపారు. అటువంటి ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Aug 25 , 2026 | 01:12 AM