Share News

బీఈడీ కళాశాలల దోపిడీ

ABN , Publish Date - Nov 27 , 2026 | 01:33 AM

ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలన్న ఆశతో బీఈడీ చేసేందుకు సిద్ధమైన విద్యార్థులను కళాశాలల యాజమాన్యాలు పీడించుకుతింటున్నాయి.

బీఈడీ కళాశాలల దోపిడీ

  • కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థుల నుంచి భారీగా ఫీజు వసూలు

  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో తమకు సంబంధం లేదంటూ వాదన

  • ట్యూషన్‌ ఫీజు, డెవలప్‌మెంట్‌ ఫీజు, ల్యాబ్‌ ఫీజు, లైబ్రరీ ఫీజు పేరిట అదనంగా కూడా బాదుడు

  • ఏయూ అధికారుల ఉదాసీన వైఖరితో రెచ్చిపోతున్న కొన్ని కళాశాలల యాజమాన్యాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలన్న ఆశతో బీఈడీ చేసేందుకు సిద్ధమైన విద్యార్థులను కళాశాలల యాజమాన్యాలు పీడించుకుతింటున్నాయి. కౌన్సెలింగ్‌లో సీటు దక్కించుకున్న విద్యార్థుల నుంచి ఏయూ పరిధిలోని అనేక కాలేజీల యాజమాన్యాలు భారీమొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నాయి. సాధారణంగా కౌన్సెలింగ్‌లో సీటు దక్కించుకున్న విద్యార్థికి ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తుంది. విద్యార్థి పరీక్ష ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అయితే, రీయింబర్స్‌మెంట్‌తో తమకు సంబంధం లేదని, ముందుగా ఫీజు చెల్లించాలంటూ అనేక కాలేజీల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. తొలివిడతలో సీట్లు దక్కించుకున్న వందలాది మంది ఈ ఇబ్బందిని ఎదుర్కొనగా, రెండో విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులకు కూడా అదే అనుభవం ఎదురవుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే రెండు, మూడు రెట్లు అదనంగా చెల్లించాలంటూ కొన్ని కాలేజీలు డిమాండ్‌ చేస్తుండడం గమనార్హం.

సీట్లు కేటాయింపు ఇలా..

రాష్ట్రంలోని బీఈడీ, బీఈడీ ప్రత్యేక విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఎడ్‌సెట్‌) నిర్వహిస్తారు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా విద్యార్థులకు వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లు కేటాయిస్తున్నారు. ఇప్పటికే తొలి దశ సీట్ల కేటాయింపు, ప్రవేశాలు ప్రక్రియ పూర్తి కాగా, ప్రస్తుతం రెండో విడతకు సంబంధించిన ప్రవేశాలు కొనసాగుతున్నాయి. కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థుల నుంచి అనేక కాలేజీల యాజమాన్యాలు ఫీజులను వసూలు చేస్తుండగా, కొన్ని ట్యూషన్‌ ఫీజు, డెవలప్‌మెంట్‌ ఫీజు, ల్యాబ్‌ ఫీజు, లైబ్రరీ ఫీజు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. వేలాది రూపాయలు ఫీజులు చెల్లించలేక ఎంతోమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

పర్యవేక్షణ ఏదీ?

కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు సదరు కాలేజీలకు ఫోన్‌ చేసి ఏఏ ధ్రువపత్రాలు తీసుకురావాలని అడిగితే సరైన సమాధానాలను చెప్పడం లేదు. అంతేగాకుండా కొందరు తమ కాలేజీలో మౌలిక వసతులు లేవని, ఎందుకు ఆప్షన్‌ ఇచ్చారని ప్రశ్నిస్తుండడంతో ఏం చేయాలో తెలియక విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. బీఈడీ కాలేజీల్లో ప్రవేశాలను పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. వర్సిటీ పరిఽధిలోని బీఈడీ కాలేజీల్లో తొలివిడత ప్రవేశాలు, ఫీజుల వివరాలు గురించి తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నించాలని, అప్పుడే రెండో విడత కౌన్సెలింగ్‌లో సీటు దక్కించుకున్న విద్యార్థులకు ఇబ్బందులు తప్పుతాయని అంటున్నారు.

Updated Date - Nov 27 , 2026 | 01:33 AM