దేశవాళి వరి ప్రయోగాత్మక సాగు సక్సెస్
ABN , Publish Date - May 25 , 2026 | 11:49 PM
తూర్పుకనుముల్లో పూర్వం ఆదివాసీలు సాగు చేసిన సంప్రదాయ(దేశవాళి) వరి రకాలపై స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చేపట్టిన ప్రయోగాత్మక సాగు విజయవంతమైంది.
మూడేళ్ల పాటు 21 రకాలపై అధ్యయనం
కుంకుమసాలి, తెల్లసన్నాలు, టెంటెంధాన్యం, రత్నచోడి, మైసూర్‌మల్లిక్ మేలిజాతి రకాలుగా ఎంపిక
సాగు విస్తీర్ణం పెంపునకు విత్తనాలు చిరు సంచుల్లో పంపిణీ
చింతపల్లి, మే 25 (ఆంధ్రజ్యోతి): తూర్పుకనుముల్లో పూర్వం ఆదివాసీలు సాగు చేసిన సంప్రదాయ(దేశవాళి) వరి రకాలపై స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చేపట్టిన ప్రయోగాత్మక సాగు విజయవంతమైంది. మూడేళ్లగా 21 రకాల వంగడాలపై శాస్త్రవేత్తలు వివిధ దశల్లో అధ్యయనం చేశారు. దిగుబడి, నాణ్యత ఆధారంగా ఐదు రకాలు గిరిజన ప్రాంతానికి అనుకూలంగా వున్నాయని శాస్త్రవేత్తలు ప్రయోగాత్మ సాగు ద్వారా నిర్ధారించారు.
గిరిజన ప్రాంతంలో కొన్నేళ్ల క్రితం ఆదివాసీలు పలు రకాల సంప్రదాయ వరి విత్తనాలను సాగు చేసేవారు. దేశవాళి వరి రకాలకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకం పేరుతో ఆదివాసీలు పిలిచేవారు. కొన్ని రకాల వరి విత్తనాలు బాస్మతిని తలపించే సువాసనలు వెదజల్లుతుంటాయి. మరికొన్ని రకాలు మధుమేహం వ్యాధి కలిగిన బాధితులు ఆహారంగా తీసుకున్నా చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. ఈ రకాలు ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో లేవు. అతి తక్కువ మంది ఆదివాసీ రైతులు ఆహారం కోసం ఈ సంప్రదాయ విత్తనాలను తక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుత రోజుల్లో మధుమేహం, రక్తపోటు బాధితులు ఆహారం కోసం సూపర్‌మార్కెట్లలో లభించే రెడ్, బ్రౌన్, బ్లాక్ రైస్‌కు అధిక ధర చెల్లించి కొనుగోలు చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న వివిధ రకాల రైస్ కంటే ఆదివాసీలు పూర్వం సాగు చేసే వరి వంగడాల్లో మానవుల ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నేపఽథ్యంలో అంతరించిపోతున్న ఆదివాసీల సంప్రదాయ వరి విత్తనాలకు పునరుజ్జీవం ఇచ్చేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించి విజయం సాధించారు.
21 రకాలపై పరిశోధనలు
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లా గిరిజన ప్రాంతాల రైతుల నుంచి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు సంప్రదాయ వరి వంగడాలను సేకరించారు. సుమారు 150 మంది రైతుల నుంచి 21 రకాల వంగడాలను సేకరించారు. శాస్త్రవేత్తలకు వంగడాలు అందజేసిన రైతుల వ్యక్తిగత సమాచారం తీసుకున్నారు. ఈ వంగడాలకు ఒక్కొక్క ప్రాంత ఆదివాసీలు ఒక పేరుతో పిలుస్తున్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు వంగడాలకు నంబర్లు కేటాయించి పరిశోధనలు ప్రారంభించారు. సంప్రదాయ వరి రకాలను 2023 నుంచి మూడేళ్ల పాటు పరిశోధనలు నిర్వహించారు. ప్రయోగాత్మక సాగు తుది ఫలితాలు ఆధారంగా అధిక దిగుబడినిచ్చే వరి రకాల్లో పోషక విలువ, ఔషధ గుణాలు ఆధారంగా మేలిరకం వంగడాలను ఎంపిక చేశారు.
మేలిజాతి వంగడాలుగా ఐదు రకాల ఎంపిక
మూడేళ్ల ప్రయోగాత్మక సాగులో ఐదు రకాల దేశవాళి వంగడాలు ఆశాజనకంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. కుంకుమసాలి, తెల్లసన్నాలు, టెంటెంధాన్యం, రత్నచోడి, మైసూర్‌మల్లిక్ మేలిజాతి రకాలుగా ఎంపిక చేశారు. ఈ వంగడాలు హెక్టారుకు 5.5 నుంచి 6.5 క్వింటాళ్ల దిగుబడి ఇస్తాయి. ధాన్యం నాణ్యత, పరిమాణం, సువాసలు బాగున్నాయి. తెగుళ్లను తట్టుకునే శక్తి అధికంగా ఉంది.