‘సర్’ ప్రక్రియ వేగవంతం చేయండి
ABN , Publish Date - Jun 29 , 2026 | 01:00 AM
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (సర్)ను వేగవంతం చేయాలని, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ను అత్యంత కచ్చితత్వంతో, వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్‌కిశోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పక్కాగా చేపట్టాలి
కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్
విశాఖపట్నం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి):
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (సర్)ను వేగవంతం చేయాలని, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ను అత్యంత కచ్చితత్వంతో, వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్‌కిశోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓటరు వివరాల నమోదులో ఎలాంటి పోరపాట్లకు తావులేకుండా ప్రతిఫారాన్ని నిశితంగా పరిశీలించి డిజిటలైజ్ చేయాలని సూచించారు. హెల్ప్‌డెస్క్‌ల ద్వారా ఓటర్లకు నాణ్యమైన సేవలందించాలని, వారి సందేహాలను నివృతి చేయాలన్నారు. ఈ మేరకు ఆదివారం బాలయ్యశాస్త్రి లేఅవుట్, సూర్యాబాగ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి క్షేత్రస్ధాయిలో, సూర్యాబాగ్‌లోని హెల్ప్‌డెస్క్‌లో ప్రక్రియను పరిశీలించారు. జోనల్ కమిషనర్‌లు నిరంతరం పర్యవేక్షించి, బీఎల్వోలకు అప్పగించిన బాధ్యతలను సమర్ధంగా నిర్వహించేలా సూచనలివ్వాలన్నారు. ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని, ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో పౌర సరఫరాలశాఖ సిబ్బంది, బూత్ స్థాయి ఏజెంట్ల సేవలను వినియోగించుకోవాలన్నారు. చనిపోయిన, వలసవెళ్లిన, తప్పుగా నమోదైన ఓటర్లు, తొలగించాల్సిన ఓట్లు, ఇతర పోలింగ్ కేంద్రాలకు మారిన ఓటర్ల వివరాలను ధ్రువీకరించి వెంటనే పోర్టల్‌లో నమోదుచేయాలని ఆదేశించారు. క్షేత్రస్ధాయిలో సమస్యలు ఎదురైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. గడువులోగా కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ వెంట జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, నియోజకవర్గాల ఈఆర్‌వోలు, ఏఈ ఆర్‌వోలు, ఎన్నికలసెల్ అధికారులు పాల్గొన్నారు.