అంచనాలు పెంచేశారు
ABN , Publish Date - Oct 06 , 2026 | 01:10 AM
శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం చేపట్టదలచిన ప్రాజెక్టుల అంచనా వ్యయాల్లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి.
ఏయూలో మూడు ప్రాజెక్టులకు అధికారుల ప్రణాళిక
సుమారు రూ.95 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన సివిల్ ఇంజనీరింగ్ విభాగం
అనూహ్యంగా ఇప్పుడు ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్ర్టాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు అప్పగింత
అంచనాలు రెట్టింపు చేసిన సదరు సంస్థ
ఆ సంస్థ పనితీరుపై గతంలో అసంతృప్తి వ్యక్తం చేసిన వర్సిటీ ఉన్నతాధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం చేపట్టదలచిన ప్రాజెక్టుల అంచనా వ్యయాల్లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. సుమారు వంద కోట్ల వ్యయంతో మూడు కీలక ప్రాజెక్టులకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ పనులు చేపట్టేందుకు సిద్ధమైన వర్సిటీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం, అందుకు అనుగుణంగా అంచనాలను తయారుచేసింది. అయితే, అనూహ్యంగా ఆ పనులను ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఈడబ్ల్యూ ఐడీసీ)కు విశ్వవిద్యాలయం అధికారులు కట్టబెట్టారు. ఆ సంస్థ అంచనా వ్యయం భారీగా పెంచేసింది.
నార్త్ క్యాంపస్‌లో రూ.45.75 కోట్లతో విద్యార్థుల వసతి గృహం (జీ+4), సౌత్ క్యాంపస్‌లో రూ.34.8 కోట్లతో విద్యార్థినుల వసతి గృహం, రూ.14.5 కోట్లతో మెగా సెంట్రల్ మెస్ అండ్ కిచెన్ నిర్మాణానికి ఏయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం అంచనాలు తయారుచేసింది. మొత్తం రూ.95 కోట్ల వ్యయంతో మూడు కీలక ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధమైంది. అయితే, ఆ పనులను ఏపీఈడబ్ల్యూ ఐడీసీకి అప్పగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాయ్స్ హాస్టల్ నిర్మాణానికి రూ.94.5 కోట్లు, లేడీస్ హాస్టల్‌కు రూ.73 కోట్లు, మెగా మెస్‌కు రూ.42.4 కోట్లు...మొత్తం అంచనాలను రూ.209.9 కోట్లకు పెంచారు. అంటే సుమారు రూ.115 కోట్లు అధికం. ఆ స్థాయిలో అంచనాలు పెరగడానికి గల కారణాలు ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
గతంలో వద్దన్న సంస్థకే..
గతంలో వర్సిటీలోని కీలక ప్రాజెక్టులు దక్కించుకునేందుకు ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఈడబ్ల్యూ ఐడీసీ) సంస్థ తీవ్రస్థాయిలో యత్నించింది. 2014-16 మధ్య కాలంలో సుమారు పది కోట్ల రూపాయల పనులను చేపట్టింది. అయితే, అప్పట్లో పనులు చేసిన తీరు, నాణ్యత వంటి అంశాల పట్ల అధికారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. అప్పటి వీసీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆ సంస్థ పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సదరు సంస్థ పనితీరు బాలేదని, పనులు ఆలస్యం చేయడంతోపాటు నాణ్యత లేదని, ఇతర ఇబ్బందులను అప్పటి మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో అప్పటి ఉన్నత విద్యా శాఖా మంత్రి ఆ సంస్థకు పనులు కేటాయించాలని ఒత్తిడి చేయలేదు. ఆ తరువాత నుంచి వర్సిటీలో పనులను ఏయూలోని ఇంజనీరింగ్ విభాగం అధికారులే చేపడుతూ వస్తున్నారు. అయితే, అనూహ్యంగా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేపట్టాలనుకున్న పనులను సదరు సంస్థకు అప్పగించడం అందరినీ విస్మయపరిచింది.
ఇంజనీరింగ్ విభాగ సమర్థతపై ప్రశ్నలు
ఏపీఈబ్ల్యూడీ ఐడీసికి కీలక ప్రాజెక్టులను అప్పగించడం అంటే వర్సిటీలోని ఇంజనీరింగ్ విభాగ సమర్థతను ప్రశ్నార్థకం చేసినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. సుదీర్ఘ చరిత్ర, అనుభవం కలిగిన వర్సిటీ ఇంజనీరింగ్ విభాగాన్ని శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేపడుతున్న కీలక ప్రాజెక్టులకు దూరం చేయడం అంటే వర్సిటీని అగౌరవపరుచుకున్నట్టేనని పలువురు వ్యాఖ్యా నిస్తున్నారు. ఇది వర్సిటీ ప్రతిష్టకు మచ్చగా మారుతుందని, కాబట్టి, ఆ ప్రాజెక్టులను ఏయూ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టడం మంచిదని పలువురు రిటైర్డ్ ఏయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగ అధికారులు పేర్కొంటున్నారు.