Share News

గ్రాట్యుటీకి నిరీక్షణ

ABN , Publish Date - Jan 14 , 2026 | 12:52 AM

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో ఏళ్ల తరబడి పనిచేసి, పదవీ విరమణ చేసిన కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఫ్యాక్టరీ యాజమాన్యం గ్రాట్యుటీ చెల్లించకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండేళ్ల కాలంలో ఆరవై మందికిపైగా కార్మికులు పదవీ విరమణ చేశారు. ఒక్కొక్కరికి రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు గ్రాట్యుటీ చెల్లించాల్సి వుంది. ఈ మొత్తం రూ.2 కోట్లకుపైగా వుంటుందని ఆయా కార్మికులు చెబుతున్నారు.

గ్రాట్యుటీకి నిరీక్షణ
గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ

పదవీ విరమణచేసి రెండేళ్లయినా అందని డబ్బులు

పట్టించుకోని గోవాడ షుగర్స్‌ యాజమాన్యం

63 మంది రిటైర్డ్‌ కార్మికులకు రూ.2 కోట్ల మేర బకాయిలు

వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులతో ఇక్కట్లు

చోడవరం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో ఏళ్ల తరబడి పనిచేసి, పదవీ విరమణ చేసిన కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఫ్యాక్టరీ యాజమాన్యం గ్రాట్యుటీ చెల్లించకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండేళ్ల కాలంలో ఆరవై మందికిపైగా కార్మికులు పదవీ విరమణ చేశారు. ఒక్కొక్కరికి రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు గ్రాట్యుటీ చెల్లించాల్సి వుంది. ఈ మొత్తం రూ.2 కోట్లకుపైగా వుంటుందని ఆయా కార్మికులు చెబుతున్నారు.

షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికులు పదవీ విరమణ చేసినప్పుడు యాజమాన్యం పరంగా లభించే ఏకైక ఆర్థిక ప్రయోజనం గ్రాట్యుటీ ఒక్కటే. ఫ్యాక్టరీలో పనిచేసిన కాలాన్నిబట్టి ఏడాదికి సుమారు 15 రోజుల చొప్పున వేతనాన్ని గ్రాట్యుటీగా లెక్కిస్తారు. ఈ ప్రకారం ఒక్కో కార్మికునికి రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు గ్రాట్యుటీగా అందాల్సి వుంది. రెండేళ్ల క్రితం పదవీ విరమణ చేసిన కార్మికులకు మాత్రమే ఫ్యాక్టరీ యాజమాన్యం గ్రాట్యుటీ చెల్లించింది. ఆ తరువాత రిటైర్‌అయిన 63 మంది కార్మికులకు డబ్బులు అందలేదు. వీరికి సుమారు రూ.2 కోట్ల మేర బకాయిలు వున్నట్టు ఫ్యాక్టరీ కార్మిక సంఘం నాయకులు చెబుతున్నారు. గ్రాట్యుటీ డబ్బులు ఎప్పుడు ఇచ్చేది యాజమాన్యం స్పష్టంగా చెప్పలేకపోతున్నది. పదవీ విరమణ చేసిన కార్మికులకు నెలవారీ పింఛన్‌ సుమారు రెండున్నర వేల రూపాయలు మాత్రమే వస్తున్నది. వీరు పీఎఫ్‌ పింఛన్‌దారులు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్టీఆర్‌ భరోసా వృద్ధాప్య పంఛన్‌కు అనర్హులు. రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.4 వేలు ఇస్తుండగా, తమకు పీఎఫ్‌ ఆఫీస్‌ నుంచి రూ.2,500 మాత్రమే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం కనీస పంఛన్‌ పెంచకపోవడం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌కు అర్హుత లేకపోవడం, మరోవైపు గ్రాట్యుటీ డబ్బులు అందకపోవడంతో వృద్ధాప్యంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రిటైర్డ్‌ కార్మికులు వాపోతున్నారు. వీరిలో చాలా మంది పలురకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పీఎఫ్‌ పింఛన్‌ డబ్బులు వైద్య పరీక్షలు, మందులకు కూడా చాలడంలేదని అంటున్నారు. గ్రాట్యుటీ సొమ్ము అందుకోకుండానే రెండేళ్ల కాలంలో ఆరుగురు కార్మికులు చనిపోయారు. అయినప్పటికీ షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైరయిన కార్మికుల్లో దొడ్డి గణేశ్‌ పక్షవాతంబారినపడి ఇంటికే పరిమితమయ్యాడు. మరో కార్మికుడు సింగంపల్లి అప్పారావు గుండెజబ్బుతో బాధపడుతూ, వైద్య ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడు.

మందులకు డబ్బులు లేవు

దొడ్డి గణేశ్‌, రిటైర్డ్‌ కార్మికుడు, గోవాడ షుగర్స్‌

మూడు దశాబ్దాలకుపైగా గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేశాను. రిటైరయిన తరువాత గ్రాట్యుటీ ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా అధికారులు చెప్పడం లేదు. కొంతకాలం క్రితం పక్షవాతం బారినపడ్డాను. పూర్తిస్థాయిలో మందుల కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నాను. బతికుండగా గ్రాట్యుటీ అందుతుందన్న నమ్మకం లేకపోయింది. ప్రభుత్వం స్పందించి గ్రాట్యుటీ డబ్బులు ఇప్పించాలి.

మా గోడు పట్టించుకోండి

దాడి ఈశ్వరరావు, రిటైర్డ్‌ కార్మికుడు, గోవాడ షుగర్స్‌

ఇంజినీరింగ్‌ విభాగంలో పనిచేస్తూ 2024 జూన్‌లో పదవీ విరమణ చేశాను. ఫ్యాక్టరీ యాజమాన్యం ఇంతవరకు గ్రాట్యుటీ చెల్లించలేదు. సుమారు రూ.3 లక్షలు వస్తాయని చెప్పారు. డబ్బులు అందితే వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకుంటాను. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి.

Updated Date - Jan 14 , 2026 | 12:52 AM