ఉపాధ్యాయుల విభజనకు కసరత్తు
ABN , Publish Date - Oct 06 , 2026 | 01:19 AM
కొత్త జిల్లాల ప్రాతిపదికగా ఉపాధ్యాయుల విభజనకు విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది.
కొత్త జిల్లాలే ప్రాతిపదిక...
ఉమ్మడి జిల్లాలో 11,750 మంది ఉపాధ్యాయులు
పాఠశాలలు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఏ జిల్లాకు ఎంతమంది అవసరమవుతారో అంచనా వేయనున్న అధికారులు
సీనియారిటీ జాబితా రూపకల్పన
ఉపాధ్యాయుల నుంచి ఆప్షన్స్ కోరనున్న విద్యాశాఖ
విశాఖపట్నం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి):
కొత్త జిల్లాల ప్రాతిపదికగా ఉపాధ్యాయుల విభజనకు విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో భాగంగా ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా రూపొందించింది. జిల్లా పరిషత్, ప్రభుత్వ, మునిసిపల్ టీచర్లకు సంబంధించి సర్వీస్ నిబంధనలను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది.
ఉమ్మడి జిల్లాలో జడ్పీ, ప్రభుత్వ, మునిసిపల్ యాజమాన్య పాఠశాలల్లో 11,750 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారిని కేటగిరీల (హెచ్‌ఎం, స్కూలు అసిస్టెంట్ (అన్ని సబ్జెక్టులు), ఎస్జీటీలు, వ్యాయామ ఉపాధ్యాయులు) వారీగా విభజించింది. మూడు జిల్లాల్లో పాఠశాలలు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను విభజన (ఏ జిల్లాకు ఎంతమంది అవసరం) చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సీనియారిటీని అనుసరించి జిల్లాల వారీగా ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. ఎక్కువ సర్వీస్ ఉన్న టీచర్లకు తొలుత ప్రాధాన్యం ఇస్తారు. అయితే ఫ్రిఫరెన్సియల్ కేటగిరీలు (పలు రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు)ను పరిగణనలోకి తీసుకుంటారు. ఎక్కువ మంది విశాఖ జిల్లాను కోరే అవకాశం ఉంది.
ఒకవేళ సీనియర్ అయిన టీచర్...అనకాపల్లి, అల్లూరి జిల్లాలు కోరుకుంటే అక్కడకే కేటాయిస్తారు. సీనియారిటీ జాబితాలో చివరగా ఉన్న టీచర్లను అల్లూరి సీతారామరాజు జిల్లాకు కేటాయిస్తారని చెబుతున్నారు. గత ఏడాది నిర్వహించిన డీఎస్సీలో ఎంపికైన టీచర్లలో మెజారిటీ ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే పనిచేస్తున్నారు. స్పౌజ్ కేటగిరీ లేదా ఇతరత్రా ఏదైనా కేటగిరీలోకి వస్తే అనకాపల్లి, విశాఖ జిల్లాలకు వస్తారని, లేకపోతే అక్కడే ఉండే అవకాశం ఉందని ఉపాధ్యాయులు అంచనా వేస్తున్నారు.
కాగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వస్తున్న వలసల నేపథ్యంలో విశాఖ నగరం, పరిసర జడ్పీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుండగా, గ్రామీణ మండలాల్లో తక్కువగా ఉన్నారు. టీచర్ల విభజన సమయంలో విశాఖలో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇదిలావుండగా హెచ్‌ఎం పోస్టులను జోనల్ కేడర్‌లోకి తీసుకువచ్చారు. దీంతో మూడు పాత జిల్లాల్లో పనిచేసే హెచ్‌ఎంలు ఉత్తరాంధ్రలో ఎక్కడికైనా వెళ్లేందుకు వీలు కలిగింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సీనియర్ హెచ్‌ఎంలు విశాఖ జిల్లాలో పనిచేసేందుకు ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు విశాఖలో పనిచేసే హెచ్‌ఎంలు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు వెళ్లాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఉపాధ్యాయుల విభజన పూర్తికి రెండు నెలల సమయం పడుతుందని అంచనావేస్తున్నారు.