ఫ్రీ లెఫ్ట్‌పై కసరత్తు
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:50 AM
నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు జీవీఎంసీ దృష్టిసారించింది.
ప్రధాన కూడళ్ల అభివృద్ధికి జీవీఎంసీ దృష్టి
క్షేత్రస్థాయి పరిస్థితులపై కమిషనర్ పరిశీలన
విశాఖపట్నం, జూలై 12 (ఆంధ్రజ్యోతి):
నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు జీవీఎంసీ దృష్టిసారించింది. ఇందులోభాగంగా నగరంలోని ప్రధాన కూడళ్లను అభివృద్ధిచేసి, అక్కడ ఫ్రీలెఫ్ట్‌లను విస్తరించ డంపై జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీతో ప్రమాదాలు అదేస్థాయిలో పెరుగుతున్నాయి. దీనికి రోడ్ల నిర్మాణాల్లో లోపాలు, కూడళ్లు ఇరుగ్గా ఉండడంతో సిగ్నల్ పడినపుడు ఫ్రీలెఫ్ట్‌లను ఆటోలు, ఇతర వాహనాలు మూసివేస్తున్నాయి. దీంతో ట్రాఫిక్‌జామ్ ఏర్పడి ప్రమాదాలకు ఆస్కారంగా మారుతోందని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే జంక్షన్‌ల అభివృద్ధి, ట్రాఫిక్ సిగ్నల్స్ ఆధునికీకరణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని సీపీ శంఖబ్రతబాగ్చి జీవీఎంసీ కమిషనర్‌ను కోరారు. ఇప్పటికే ‘ఆపరేషన్ సారథి’ పేరుతో ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం’ అమలుకు జీవీఎంసీ శ్రీకారం చుట్టింది. దీంతో పాటు నగరంలోని ప్రధాన కూడ ళ్లను అభివృద్ధి చేయాలని కమిషనర్ భావిస్తున్నారు. ఇప్పటికే సత్యం, మద్దిలపాలెం కూడళ్లను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. వాటి వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. త్వరలో ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.