ఉద్యోగుల విభజనపై కసరత్తు
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:54 AM
కొత్త జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగుల విభజన కోసం సీనియారిటీ జాబితాలు రూపొందించే పని చురుగ్గా సాగుతోంది.
కొత్త జిల్లాల ప్రాతిపదికగా కసరత్తు
సీనియారిటీ జాబితాల తయారీ
స్థానికత, ఇతర వివరాలు సేకరణ
ఉపాధ్యాయుల వివరాలు పంపిన విద్యా శాఖ
పంచాయతీరాజ్, రెవెన్యూ విభాగాల్లో కొనసాగుతున్న ప్రక్రియ
విశాఖపట్నం, జూన్ 22 (ఆంధ్రజ్యోతి):
కొత్త జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగుల విభజన కోసం సీనియారిటీ జాబితాలు రూపొందించే పని చురుగ్గా సాగుతోంది. నాలుగేళ్ల క్రితం కొత్త జిల్లాలను ఏర్పాటుచేసినప్పుడు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ప్రతి శాఖలో కొంతమందిని కొత్త జిల్లాలకు పంపారు. ఆ తరువాత బదిలీలు, పదోన్నతులు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగానే చేపట్టారు. అయితే కొత్త జిల్లాల ప్రాతిపదికగా ఉద్యోగుల విభజన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా, జోనల్, మల్టీ జోనల్ అంటూ నిర్దేశించి, ఆ మేరకు సీనియారిటీ ఖరారు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి అనుగుణంగా ప్రస్తుతం విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి స్థానికత, ఉద్యోగంలో చేరిన తేదీ, తదితర వివరాలను సేకరిస్తున్నారు.
నాలుగు నుంచి పదో తరగతి వరకు కనీసం నాలుగు సంవత్సరాలు చదివిన ప్రాంతాన్ని లోకల్‌గా పరిగణిస్తారు. ఒక ఉద్యోగి ఒకచోట నుంచి మరోచోటకు వెళ్లడానికి నేటివిటీని ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది. శాఖల వారీగా సీనియారిటీ వివరాలతో జాబితాలు పంపేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసింది. అయితే కొన్ని శాఖలు ఇప్పటికే సీనియారిటీ జాబితాలు సిద్ధం చేసి ఆయా శాఖల ప్రధాన కార్యాలయాలకు పంపగా మరికొన్ని ఇంకా కసరత్తు చేస్తున్నాయి.
జిల్లా విద్యా శాఖ ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా మంజూరైన పోస్టులకు అనుగుణంగా ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను సిద్ధం చేసి పాఠశాల విద్యా శాఖకు పంపింది. ఉమ్మడి జిల్లాలో 10,893 టీచర్ పోస్టులకు సంబంధించి తొమ్మిది వేలకుపైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. కాగా పంచాయతీరాజ్‌లో ముఖ్యంగా 969 గ్రామ పంచాయతీల్లో పనిచేసే సిబ్బంది సీనియారిటీ జాబితాను రూపొందించే పనిలో డీపీవో కార్యాలయం అధికారులు నిమగ్నమై ఉన్నారు. రెవెన్యూ శాఖ పరిధిలో మూడు జిల్లాల్లో సుమారు వెయ్యి మంది వరకు పనిచేస్తున్నారు. అటెండర్ నుంచి డిప్యూటీ తహశీల్దారు వరకు, గ్రామ పాలనాధికారులు, సర్వేయర్లు ఇలా ప్రతి కేడర్‌లో సీనియారిటీ జాబితా దాదాపు సిద్ధం చేశారు. సీనియారిటీ జాబితాల రూపకల్పనకు సంబంధించి అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వారి వివరాలు ఆయా జిల్లా కలెక్టర్ల నుంచి విశాఖ జిల్లాకు వచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకుని రెండు, మూడు రోజుల్లో మొత్తం సీనియారిటీ జాబితా రూపొందించి ప్రభుత్వానికి పంపనున్నారు. మిగతా శాఖల్లో కేడర్ విభజనపై సీనియారిటీ జాబితాలు రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు. సీనియారిటీ జాబితా మేరకు సిబ్బందిని జిల్లాలకు కేటాయిస్తారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. జాబితాలో ఎక్కువ సీనియారిటీ ఉన్న ఉద్యోగులకు మొదట ఆప్షన్ ఇస్తారని పేర్కొన్నారు.