Share News

పదింతల ఫలితాలకు కసరత్తు

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:30 AM

పదవ తరగతిలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో విద్యాశాఖ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా అధికారులు పదవ తరగతి విద్యార్థుల కోసం గతేడాది డిసెంబరు ఆరో తేదీ నుంచి 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు.

పదింతల ఫలితాలకు కసరత్తు
పాడేరు లోచలిపుట్టు ఆశ్రమ పాఠశాలలో టెన్త్‌ విద్యార్థుల స్టడీ అవర్‌ను పర్యవేక్షిస్తున్న టీచర్లు

ఉన్నత పాఠశాలలు, ఆశ్రమాల్లో 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు

గతేడాది డిసెంబరు 6 మొదలై ఈ ఏడాది మార్చి 15తో ముగింపు

సబ్జక్టు టీచర్లు, ఇతర ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ

టీడబ్ల్యూ డీడీ, ఎంఈవోలు, ఏటీడబ్ల్యూల నిత్యం పర్యవేక్షణ

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

పదవ తరగతిలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో విద్యాశాఖ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా అధికారులు పదవ తరగతి విద్యార్థుల కోసం గతేడాది డిసెంబరు ఆరో తేదీ నుంచి 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు. గతంలో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలకు వేర్వేరుగా ప్రత్యేక ప్రణాళికను అమలు చేసేవారు. కానీ ఈ విద్యా సంవత్సరంలో అన్ని ఉన్నత పాఠశాలల్లోనూ ఒకే తరహా వంద రోజుల ప్రత్యేక ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న 250 ఉన్నత/ఆశ్రమ పాఠశాలల్లో ఉన్న సుమారు 11,500 మంది పదవ విద్యార్థులకు ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ప్రత్యేక బోధన సాగాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో గత ఏడాది కేవలం 48 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించడంతో ఈ ఏడాది శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా సబ్జక్టు టీచర్లు, ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దీంతో విద్యార్థులకు ప్రతి రోజూ పరీక్షలు, ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ప్రీ ఫైనల్‌ పరీక్షలకు 11,143 మంది హాజరుకాగా, ఏ- గ్రేడులో 144 మంది, బీ- గ్రేడులో 1,549, సీ- గ్రేడులో 6,591, డి- గ్రేడులో 2,405 మంది విద్యార్థులున్నారు. ఈ నేపథ్యంలో వంద రోజుల ప్రత్యేక ప్రణాళికపై విద్యాశాఖ మరింత శ్రద్ధ కనబరుస్తున్నది.

ప్రణాళిక అమలు ఇలా..

- డిసెంబరు ఆరో తేదీ నుంచి సబ్జక్టుల రివిజన్‌, ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో డైలీ టెస్ట్‌ల నిర్వహణ.

- ప్రతి రోజూ ఆయా సబ్జక్టులకు సంబంధించి ప్రత్యేక నోట్స్‌ను రాయించడం.

- డైలీ టెస్ట్‌లను ఏరోజుకారోజు మూల్యాంకనం చేసి విద్యార్థుల ప్రగతిని అదే రోజు అందరికీ తెలియజేయడం, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచి, వారి ఉత్తీర్ణతకు అవసరమైన మార్కులు వచ్చేలా ఆయా అంశాలపై తర్ఫీదు ఇవ్వడం. అలాగే విద్యార్థులపై సబ్జక్టు టీచర్లు ప్రత్యేక దృష్టిపెట్టి పరీక్షల సమయానికి వారి పఠనా స్థాయిని పెంచడం.

- డైలీ టెస్ట్‌ల ఆధారంగా విద్యార్థుల ప్రగతిని ఏ, బీ, సీ, డీ గ్రేడులుగా విభజించి, డీ గ్రేడులో ఉన్న వారికి సహచర విద్యార్థులతోనే ఆయా సబ్జక్టుల్లో సందేహాలను నివృత్తి చేసి, వారిని బీ, సీ గ్రేడుల్లోకి తీసుకువచ్చేందుకు కృషి చేయడం.

- సంవత్సరాంతర పరీక్షలపై విద్యార్థులకు భయం పోగొట్టడంతోపాటు డైలీ టెస్ట్‌ల ద్వారా వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడం.

- ముఖ్యంగా 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక సమయంలో విద్యార్థులు గైర్హాజరు కాకుండా చూడడంతో పాటు వారిపై ఉపాధ్యాయులు, అధికారుల నిత్య పర్యవేక్షణ కొనసాగింపు.

Updated Date - Feb 12 , 2026 | 12:30 AM