Share News

ఏవోబీలో ఎక్సైజ్‌ దాడులు

ABN , Publish Date - Oct 16 , 2026 | 11:25 PM

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఇరు రాష్ట్రాల ఎక్సైజ్‌ అధికారులు, సిబ్బంది శుక్రవారం సారా తయారీ కేంద్రాలపై మెరుపు దాడులు చేశాయి.

ఏవోబీలో ఎక్సైజ్‌ దాడులు
ఒండ్రుగడ్డ వద్ద నాటుసారా స్థావరాలను ధ్వంసం చేసిన ఏవోబీ ఎక్సైజ్‌ పోలీసులు

7 వేల లీటర్ల బెల్లపు పులుసు, 310 లీటర్ల సారా ధ్వంసం

పాల్గొన్న ఆంధ్రా, ఒడిశా ఎక్సైజ్‌ అధికారులు, సిబ్బంది

పెదబయలు/పాడేరురూరల్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఇరు రాష్ట్రాల ఎక్సైజ్‌ అధికారులు, సిబ్బంది శుక్రవారం సారా తయారీ కేంద్రాలపై మెరుపు దాడులు చేశాయి. ఈ దాడుల్లో సారా తయారీకి ఉపయోగించే 7 వేల లీటర్ల బెల్లపు పులుసు, 310 లీటర్ల సారాను ధ్వంసం చేశామని పాడేరు ఎక్సైజ్‌ సీఐ టీవీవీఎస్‌ఎన్‌.ఆచారి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సరిహద్దు గ్రామాల ప్రజల ప్రాణ, శాంతిభద్రతల రక్షణ కాపాడే లక్ష్యంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌దేవ్‌ శర్మ ఆదేశాల మేరకు ఇరు రాష్ట్రాల ఎక్సైజ్‌ సిబ్బంది అంతర్‌ రాష్ట్ర దాడులు చేపట్టామన్నారు. ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో సారా తయారీ, రవాణాను అరికట్టేందుకు ఒడిశా రాష్ట్రం కోరాపుట్టు జిల్లా నందపూర్‌ బ్లాక్‌ పరిధిలోని పధానిపుట్టు(వేలంపుట్టు)లో 3,600 లీటర్ల బెల్లం పులుసు, 160 లీటర్ల సారా, ఓండ్రుగెడ్డ గ్రామంలో 3,400 లీటర్ల బెల్లం పులుసు, 150 లీటర్ల సారా ధ్వంసం చేశామన్నారు. ఈ దాడుల్లో ఒడిశా ఎక్సైజ్‌ సీఐ సుధార్‌ కుమార్‌, ఎస్‌ఐలు రాజు, కేరిట్‌, పాడువా పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ గోపాలకృష్ణ అలవా, ఆంధ్ర ఎక్సైజ్‌ సీఐలు జగదీష్‌, తేజ్‌, నమ్రత, ఎస్‌ఐలు శ్రీధర్‌, గణేష్‌, రెండు రాష్ట్రాలకు చెందిన 53 మంది సిబ్బంది పాల్గొన్నారన్నారు.

Updated Date - Oct 16 , 2026 | 11:25 PM