గిరి ప్రదక్షిణకు అతిగా ట్రాఫిక్ ఆంక్షలు
ABN , Publish Date - Jul 25 , 2026 | 01:09 AM
సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం చాలా అతిగా ట్రాఫిక్ ఆంక్షలు విధించింది.
28న వాహనాలతో నగరంలోకి రావద్దంటున్న అధికారులు
మధ్యాహ్నం 12 గంటలకే ట్రాఫిక్ నిలిపివేత
ఉద్యోగులు, వ్యాపారులు, కూలీలు పరిస్థితి ఏమిటి?
అధికారుల నిర్ణయంపై అభ్యంతరాలు
విశాఖపట్నం, జూలై 24 (ఆంధ్రజ్యోతి):
సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం చాలా అతిగా ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. గిరి ప్రదక్షిణ ఈ నెల 28న మొదలై 29న ముగుస్తుంది. ఆ రెండు రోజులు సుమారు ఐదు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది భక్తుల సంఖ్య పెరగడం, ట్రాఫిక్ మళ్లింపులో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వాహనాల రాకపోకలకు కొంత ఆటంకం ఏర్పడింది. దాంతో ఈసారి అలా జరగకుండా ముందుగానే అనేక మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. 28వ తేదీన నగరంలోకి ఏ వాహనాన్నీ అనుమతించబోమని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ నేతృత్వంలోని కమిటీ వెల్లడించింది. ఆరోజు (మంగళవారం) మధ్యాహ్నం 12 గంటల నుంచే నగరంలోకి ఏ వాహనం రానివ్వబోమని పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
గిరి ప్రదక్షిణ చాలా ఏళ్లుగా జరుగుతోంది. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. కానీ ఇంతవరకూ ఏనాడూ వాహనాలు నగరంలోకి రాకుండా ఆంక్షలు విధించలేదు. ఈసారి కనీసం ద్విచక్ర వాహనాలు, ఆటోలు సైతం అనుమతించబోమని అధికారులు పేర్కొంటున్నారు. అంటే ఆ రోజు నగర శివార్లలో ఉన్నవారు ముఖ్యంగా ఆనందపురం, కొమ్మాది, మధురవాడ, పీఎం పాలెం, ఎండాడ తదితర ప్రాంతాలవారు వాహనాలపై నగరంలోకి వచ్చే అవకాశం లేదు. ఆర్టీసీ బస్సులను కూడా దారిమళ్లించి నగరం చుట్టూ తిప్పి బయటకు వెళ్లేలా ట్రాఫిక్ నిబంధనలు పెట్టారు. హనుమంతవాక, అప్పుఘర్, ఇసుకతోట జంక్షన్, మద్దిలపాలెం, అడవివరం, వేపగుంట, సింహాచలం ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించడానికి అటు ఆనందపురం నుంచి ఇటు గాజువాక వరకు ఆంక్షలు విధించారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
- భక్తులు ఎక్కువగా సాయంత్రం చల్లబడిన తరువాత అంటే 3, 4 గంటల నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభిస్తారు. కానీ, అధికారులు మధ్యాహ్నం 12 గంటలకే ట్రాఫిక్ ఆపేస్తామని ప్రకటించారు.
- భక్తులు రోడ్డుకు ఒక వైపున మాత్రమే నడుస్తారు. ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది. కానీ పోలీసులు జాతీయ రహదారిపై వాహనాలను పూర్తిగా ఆపేస్తామని అంటున్నారు. నగరం మధ్య నుంచి వెళ్లే జాతీయ రహదారిని ప్రజలంతా వారి పనులకు ఉపయోగిస్తున్నారు. ఆ మార్గంలో సుమారు 24 గంటలు రాకపోకలు పూర్తిగా ఆపేస్తామని అధికారులు ప్రకటించడంపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. భారీ వాహనాలను మళ్లించి, సొంత వాహనాలపై తిరిగేవారికి మినహాయింపు ఇవ్వాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు.
- వాహనాలు మొత్తం రోడ్లపైకి రాకుండా ఆపేసి, కాలినడకన వెళ్లే భక్తుల పర్యవేక్షణకు అంత పెద్ద పోలీస్ బందోబస్తు దేనికనే వాదన కూడా వినిపిస్తోంది. ఆ రోజు ఆయా మార్గాల్లో వాహనాల్లో తిరిగే వారు సెలవు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారని, అదెలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలపై అధికారులు పునరాలోచన చేసి, సొంత వాహనాలను అనుమతించాలని చాలామంది కోరుతున్నారు.
ఈ మార్గాల్లో నిషేధం
- హనుమంతవాక-అడవివరం మధ్య రెండు దిశల్లోను 28న ఉదయం 6 గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు వాహనాలు అనుమతించరు.
- 28న మధ్యాహ్నం 12 గంటల నుంచి విశాఖ వేలీ జంక్షన్-మద్దిలపాలెం మధ్య రెండు దిశల్లోను వాహనాలు అనుమతించరు.
- 28న ఉదయం 6 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వేపగుంట జంక్షన్ నుంచి పాత గోశాల వరకు ఆర్టీసీ బస్సులు తప్ప ఇతర వాహనాలు అనుమతించరు.