ప్రాణాలు తీసిన అతివేగం
ABN , Publish Date - Nov 14 , 2026 | 01:13 AM
మితిమీరిన వేగం ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొన్నది. మండలంలోని కొత్తపోలవరం వద్ద కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా, మరో నలుగురికి తీవ్రగాయలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి ఎస్ఐ రమేశ్, స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి.
కొత్తపోలవరం వద్ద అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
ఇద్దరు యువకుల దుర్మరణం
మరో నలుగురికి తీవ్రగాయాలు
గుర్రాజుపేటలో విషాదఛాయలు
ఎస్.రాయవరం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): మితిమీరిన వేగం ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొన్నది. మండలంలోని కొత్తపోలవరం వద్ద కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా, మరో నలుగురికి తీవ్రగాయలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి ఎస్ఐ రమేశ్, స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని గుర్రాజుపేట గ్రామానికి చెందిన కురందాసు శ్రీను (25), కొర్ని శ్రీను (23), కురందాసు దుర్గాప్రసాద్, బొట్టా సురేంద్ర, కురందాసు అశోక్, కురందాపు అప్పలరాజు కలిసి శుక్రవారం మధ్యాహ్నం కారులో రేవుపోలవరం సముద్రతీరానికి వెళ్లారు. అక్కడ కొంతసేపు సరదగా గడిపిన తరువాత తిరిగి గుర్రాజుపేటకు బయలుదేరారు. దారిలో కొత్తపోలవరం సమీపంలో మలుపు వద్ద కారు వేగాన్ని నియంత్రించే క్రమంలో డ్రైవింగ్ చేస్తున్న బొట్టా సురేంద్ర ఆకస్మికంగా బ్రేకులు వేశాడు. దీంతో కారు అదుపుతప్పి ఎడమవైపు గట్టును ఢీకొన్నది. క్షణాల్లో సుమారు ఐదు అడుగుల ఎత్తున గాలిలో పల్టీలు కొడుతూ... కుడివైపు ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొని పక్కనే ఉన్న కాలవలో పడింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో వెనుక సీటులో కుర్చున్న కురందాసు శ్రీను (25), కొర్ని శ్రీను (23) అక్కడిక్కడే మృతిచెందారు. డ్రైవింగ్ చేస్తున్న సురేంద్రతోపాటు దుర్గాప్రసాద్, అశోక్, అప్పలరాజులకు తీవ్ర గాయాలైయ్యాయి. వీరిని హుటాహుటిన నక్కపల్లి సీహెచ్సీకి తీసుకెళారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఒకరైన కురందాసు శ్రీను నక్కపల్లిలోని ఒక వాటర్ పాంట్లో పని చేస్తుండగా, మరొకరు కొర్ని శ్రీను కొబ్బరికాయల ఒలుపు పనులకు వెళుతుంటాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నక్కపల్లి సీహెచ్సీ మార్చురీకి తరలించారు. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు వచ్చి, యువకుల మృతదేహాలను చూసి భోరున విలపించారు. నాగులచవితి పండగపూట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతిచెందడంతో గుర్రాజుపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రమేశ్ తెలిపారు.
కాగా తన నియోజకవర్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందినట్టు తెలుసుకున్న హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలకు పగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.