Share News

ప్రాదేశిక ఎన్నికలకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Nov 03 , 2026 | 12:56 AM

జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 5న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మండలాల్లో, పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

ప్రాదేశిక ఎన్నికలకు సర్వం సిద్ధం
పెదబయలులో సోమవారం స్ట్రాంగ్‌రూమ్‌ను పరిశీలిస్తున్న పరిశీలకుడు కూర్మనాథ్‌

జిల్లాలో 11 జడ్పీటీసీ స్థానాలకు 79 మంది, 172 ఎంపీటీసీ స్థానాల్లో 648 మంది పోటీ

మారుమూల 44 పోలింగ్‌ కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్‌

జిల్లాలో 75 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 5న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మండలాల్లో, పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. జిల్లాలోని 11 జడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు 617 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల పరిశీలకుడు రోణంకి కూర్మనాథ్‌, జిల్లా ఎన్నికల అఽధికారి, కలెక్టర్‌ టి.నిషాంతి, ఎస్‌పీ అమిత్‌బర్దార్‌ పర్యవేక్షణలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.

మండలాల్లోని ప్రాదేశిక ఎన్నికలు జరిగే పోలింగ్‌ కేంద్రాలను జోనల్‌, రూట్‌ అధికారుల ద్వారా సూక్ష్మంగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. దీంతో ఒక్కో మండలంలో కనీసం నలుగురు జోనల్‌ అధికారులు, వారి కింద 6 లేదా ఏడుగురు రూట్‌ అధికారులుంటారు. జోనల్‌, రూట్‌ అధికారులు నిత్యం తమ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల్లోని స్థితిగతులను మండల స్థాయిలో ఉన్న రిటర్నింగ్‌ అధికారికి సమాచారం అందిస్తారు. ఆయన జిల్లా అధికారులకు తెలియజేస్తారు. దీంతో పోలింగ్‌ కేంద్రం స్థాయిలో ఎటువంటి విషయమైన రూట్‌, జోనల్‌ అధికారులు పరిష్కరిస్తారు. పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికలను నిర్వహించేందుకు ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఒక అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారి, నలుగురు ఆధర్‌ ప్రిసైడింగ్‌ అధికారులను నియమించారు. ఈ ఆరుగురు సిబ్బంది పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తారు.

జిల్లాలో 11 జడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలు

జిల్లాలో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలున్నాయి. మొత్తం 11 మండలాలు కాగా మండలానికి ఒకటి చొప్పున మొత్తం 11 జడ్పీటీసీ స్థానాలు, వాటి పరిధిలో మొత్తం 172 ఎంపీటీసీ స్థానాలుండగా, ఆయా స్థానాల్లో 617 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. మండలాల వారీగా ఎంపీటీసీ స్థానాలను పరిశీలిస్తే అనంతగిరి మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు, అరకులోయలో 16, చింతపల్లిలో 20, డుంబ్రిగుడలో 14, జి.మాడుగులలో 15, జీకేవీధిలో 18, హుకుంపేటలో 15, కొయ్యూరులో 14, ముంచంగిపుట్టులో 14, పాడేరులో 17, పెదబయలు మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అయితే జిల్లాలో మొత్తం 11 జడ్పీటీసీ స్థానాలకు 70 మంది, 172 ఎంపీటీసీ స్థానాలకు 648 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

జిల్లాలో 4,98,467 మంది ఓటర్లు

జిల్లాలోని పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల పరిధిలో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు.. మొత్తం 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీలు, 2,446 వార్డులు, 617 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. అలాగే మొత్తం 4,98,467 మంది ఓటర్లుకాగా, వారిలో పురుషులు 2,41,447 మంది, మహిళలు 2,56,997 మంది, ఇతరులు 23 మంది ఉన్నారు. జిల్లాలో చింతపల్లి మండలంలో అత్యధికంగా 65,374 మంది ఓటర్లుండగా, అనంతగిరిలో అత్యల్పంగా 38,286 మంది ఓటర్లున్నారు. అరకులోయలో 42,725 మంది, డుంబ్రిగుడలో 38,743, జి.మాడుగులలో 44,674, జీకేవీధిలో 52,412, హుకుంపేటలో 45,787, కొయ్యూరులో 43,711, ముంచంగిపుట్టులో 38,895, పాడేరులో 44,536, పెదబయలు మండలంలో 43,324 మంది ఓటర్లున్నారు.

మారుమూల 44 పోలింగ్‌ కేంద్రాల్లో 3 వరకే పోలింగ్‌

జిల్లాలోని అత్యంత మారుమూల ప్రాంతాల్లోని 44 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్‌ జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టి.నిషాంతి ప్రకటించారు. జిల్లాలోని అరకులోయ మండలంలో 3, అనంతగిరిలో 4, ముంచంగిపుట్టులో 7, పెదబయలులో 6, హుకుంపేటలో 2, జి.మాడుగులలో 4, చింతపల్లిలో 2, జీకేవీధిలో 7, కొయ్యూరులో 8, పాడేరులో 1 పోలింగ్‌ కేంద్రం అత్యంత మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయని మండల స్థాయి అధికారులు నివేదిక సమర్పించారు. దీంతో ఆయా 44 పోలింగ్‌ కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్‌ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలెక్టర్‌ కోరారు. ఈ మేరకు ఎన్నికల సంఘం అనుమతించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో సాయంత్రం 3 వరకే పోలింగ్‌ జరుగుతుందని ఓటర్లు గుర్తించాలని అధికారులు పేర్కొంటున్నారు.

75 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు

జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను అధికారులు గుర్తించారు. మొత్తం 11 మండలాల్లో 75 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలున్నాయి. వాటి పట్ల మరింత అప్రమత్తంగా ఉండడంతో పాటు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో అనంతగిరిలో 2, అరకులోయలో 4, చింతపల్లిలో 7, డుంబ్రిగుడలో 9, జీకేవీధిలో 10, జి.మాడుగులలో 7, హుకుంపేటలో 8, కొయ్యూరులో 8, ముంచంగిపుట్టులో 8, పాడేరులో 4, పెదబయలులో 8 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలున్నాయి.

నేటితో ముగియనున్న ప్రచారం

ఎన్నికల నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలతో అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముగించాల్సి ఉంది. దీంతో అభ్యర్థులంతా సమయం మించి పోతుందనే టెన్షన్‌లో ఉన్నారు. అయితే ఎన్నికల నిబంధనల మేరకు బహిరంగ ప్రచారం ముగిసినప్పటికీ, గుట్టుగా చేయాల్సిన పనులు జరుగుతాయనే ధీమాతో మరికొందరున్నారు. ప్రచారం ముగిసిన తరువాత మరుసటి రోజు నాటికి తమ పార్టీల తరఫున ఏజెంట్లను సమకూర్చుకోవడం అభ్యర్థులకు పెద్ద తలనొప్పిగా ఉంటుంది. దీంతో ఓటర్ల ప్రచారం ముగిసిన తరువాత ఏజెంట్లు, పోలింగ్‌ నాడు ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రప్పించే పనిలో రాజకీయ పార్టీలు నిమగ్నమవుతాయి.

Updated Date - Nov 03 , 2026 | 12:56 AM