తొలి విడత పల్లె పోరుకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Nov 25 , 2026 | 12:40 AM
జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాలకు సంబంధించి 66 గ్రామ పంచాయతీలు, 686 వార్డులకు ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో ఎన్నికలు రేపు
మొత్తం 66 పంచాయతీల్లో సర్పంచులకు 268 మంది, 686 వార్డులకు 1,330 మంది పోటీ
మూడు మండలాల్లో 686 పోలింగ్ కేంద్రాలు
పాడేరు, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాలకు సంబంధించి 66 గ్రామ పంచాయతీలు, 686 వార్డులకు ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ మూడు మండలాల్లో 30 నామినేషన్ కేంద్రాల్లో ఈ నెల 15 నుంచి 17 వరకు సర్పంచులకు 447, వార్డులకు 1,624 నామినేషన్లను స్వీకరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఆయా నామినేషన్లను పరిశీలించి, శనివారం ఉపసంహరణ ప్రక్రియ చేపట్టి, పోటీలో ఉండే సర్పంచ్, వార్డు స్థానాల అభ్యర్థులను రిటర్నింగ్ అధికారులు ఖరారు చేశారు. చింతపల్లి మండలంలో మొత్తం 17 పంచాయతీలకు 96 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 204 వార్డులకు గాను 56 ఏకగ్రీవం కాగా, మిలిగిన 148 వార్డులకు 394 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. జీకేవీధి మండలంలో మొత్తం 16 పంచాయతీలకు 79 మంది సర్పంచులుగా పోటీ పడుతున్నారు. మొత్తం 188 వార్డులకు గాను 29 ఏకగ్రీవం కాగా, మిలిగిన 159 వార్డులకు 360 మంది బరిలో ఉన్నారు. కొయ్యూరు మండలంలో మొత్తం 33 పంచాయతీలకు బాలారం పంచాయతీ ఏకగ్రీవం కాగా, మిలిగిన 32 పంచాయతీలకు 93 మంది, 294 వార్డులకు గాను 47 ఏకగ్రీవం కాగా, మిలిగిన 243 వార్డులకు 546 మంది పోటీలో ఉన్నారు. ఈ నెల 26న ఆయా మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. చింతపల్లి మండలంలో 17 పంచాయతీలు- 204 వార్డులు 65,374 మంది ఓటర్లు, జీకేవీధిలో 16 పంచాయతీలు- 188 వార్డులు, 52,412, కొయ్యూరులో మండలంలో 33 పంచాయతీలు - 294 వార్డులు, 43,711 మొత్తం 1,61,497 మంది ఓటర్లున్నారు.