ఎన్నికలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Nov 01 , 2026 | 01:05 AM
మునిసిపాలిటీలోని 40 వార్డులకు గాను 76 పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. మహిళలు 25778, పురుషులు 23,317, ఇతరులు నలుగురితో కలిపి మొత్తం 49,099 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
- 40 వార్డులు.. 76 పోలింగ్ కేంద్రాలు
- 49,099 మంది ఓటర్లు
నర్సీపట్నం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): : మునిసిపాలిటీలోని 40 వార్డులకు గాను 76 పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. మహిళలు 25778, పురుషులు 23,317, ఇతరులు నలుగురితో కలిపి మొత్తం 49,099 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
మునిసిపాలిటీలోని 40 వార్డు కౌన్సిలర్ స్థానాలకు గాను 26, 27 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఈ వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు బైపురెడ్డి సత్తిబాబు, మురుకుర్తి రమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రెండు వార్డులో వైసీపీ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు చెల్లకపోవడంతో వీరిద్దరూ ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. మిగిలిన 38 వార్డుల్లో 84 మంది కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి 33, వైసీపీ నుంచి 38, జనసేన 4. సీపీఎం 1, బీఎస్పీ 1, స్వతంత్ర అభ్యర్థులు ఏడుగురు ఎన్నికల బరిలో ఉన్నారు. కౌన్సిలర్‌కి, చైర్‌పర్సన్‌గా వేర్వేరుగా ఓట్లు వేయాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మునిసిపల్ ఎన్నికల్లో పరోక్ష పద్ధతిలో కౌన్సిలర్లు చైర్‌పర్సన్‌ని ఎన్నుకునే పద్ధతి ఉండేది. ఈసారి ప్రజలే నేరుగా ఓటు వేసి చైర్‌పర్సన్ ఎవరనేది నిర్ణయిస్తారు.
సర్వత్రా ఉత్కంఠ
నర్సీపట్నం: 2011లో నర్సీపట్నం మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన తరువాత 2014లో మునిసిపల్ ఎన్నికలు జరిగాయి. బీసీ మహిళకు చైర్‌పర్సన్ పదవి కేటాయించడంతో అప్పటి ఎన్నికల్లో టీడీపీ పాలకవర్గం అధికారం కైవసం చేసుకుంది. చింతకాయల అనిత చైర్‌పర్సన్‌గా, చింతకాయల సన్యాసిపాత్రుడు వైస్ చైర్‌పర్సన్‌గా పదవులు చేపట్టారు. రెండో దఫా 2021లో జరిగిన పురపాలక ఎన్నికల్లో ఎస్సీ మహిళకు చైర్‌పర్సన్ పదవి కేటాయించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికార పీఠం దక్కించుకుంది. దీంతో బలిఘట్టం 17వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికైన గుడబండి ఆదిలక్ష్మి, పెదబొడ్డేపల్లి 12వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికైన బోడపాటి సుబ్బలక్ష్మి చైర్‌పర్సన్‌లుగా పదవులు చేపట్టారు. ఈసారి చైర్‌పర్సన్ పదవి బీసీ మహిళకు కేటాయించడంతో కూటమి పార్టీలు బలపరిచిన చింతకాయల పద్మావతి, వైసీపీ అభ్యర్థిగా చింతకాయల అనిత, స్వతంత్ర అభ్యర్థిగా బైపురెడ్డి చిట్టి సంధ్యారాణి పోటీ చేస్తున్నారు.