మండలాధ్యక్షుల ఎన్నికకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Nov 19 , 2026 | 12:38 AM
జిల్లాలో మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికను గురువారం నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఉదయం కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక తరువాత ఎంపీపీ, అనంతరం వైస్ ఎంపీపీ ఎన్నికను నిర్వహిస్తారు.
తొలుత కోఆప్షన్ సభ్యుడు, అనంతరం వైస్ ఎంపీపీల ఎన్నిక
నేడు ప్రతి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ప్రక్రియ
జిల్లాలో మొత్తం 172 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీకి 89, టీడీపీకి 46, జనసేనకు 12, బీజేపీకి 6, ఇతరులకు 19 ఎంపీటీసీలు
అరకులోయ, కొయ్యూరు, జి.మాడుగులలో ఎంపీపీ పదవులు కూటమికి, ఇతర మండలాల్లో వైసీపీకి దక్కే అవకాశం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికను గురువారం నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఉదయం కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక తరువాత ఎంపీపీ, అనంతరం వైస్ ఎంపీపీ ఎన్నికను నిర్వహిస్తారు. జిల్లాలోని పదకొండు మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయంలో ఈ ప్రక్రియను చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
జిల్లాలో మొత్తం 172 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 5న జరిగిన ఎన్నికల్లో వైసీపీ 89, టీడీపీ 46, జనసేన 12, బీజేపీ 6, ఇతరులు 19 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం కోరం ప్రకారం ఎవరికి ఎక్కువ మంది ఎంపీటీసీ సభ్యులు మద్దతు తెలిపితే, వారే ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ సభ్యుడిగా ఎన్నికకానున్నారు. ఈ ఎన్నిక నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అజ్ఞాతం వీడనున్న ఎంపీటీసీ సభ్యులు
ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో ఎంపీటీసీ సభ్యులు పది రోజుల అజ్ఞాతం వీడనున్నారు. గురువారం ఆయా మండలాలకు చెందిన ఎంపీటీసీ సభ్యులు విధిగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయానికి ఉదయం పది గంటలకే హాజరుకావాల్సి ఉంది. దీంతో ఇన్నాళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఎంపీటీసీ సభ్యులు గురువారం తెల్లవారుజామున రహస్య శిబిరాల నుంచి బయలుదేరి నేరుగా వారి ఎంపీడీవో కార్యాలయాలకు చేరుకోనున్నారు. వాస్తవానికి జి.మాడుగుల, అరకులోయ, కొయ్యూరు ఎంపీపీలు కూటమికి, ఇతర మండలాలు వైసీపీకి దక్కే అవకాశాలున్నాయి. అయినప్పటికీ అటు కూటమి, ఇటు వైసీపీకి చెందిన అనేక మండలాల ఎంపీటీసీ సభ్యులను రహస్య శిబిరాలు తరలించడం విశేషం.