Share News

టెన్త్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:29 PM

జిల్లాలో పదవ తరగతి వార్షిక పరీక్షలకు విద్యాశాఖాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం నుంచి ప్రారంభంకానున్న పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 20,577 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

టెన్త్‌ పరీక్షలకు సర్వం సిద్ధం
ఎలమంచిలి తులసీనగర్‌ బాలికోన్నత పాఠశాలలో టెన్త్‌ పరీక్షల కోసం టేబుళ్లపై హాల్‌ టికెట్‌ నంబర్ల స్టిక్కర్లు అతికిస్తున్న ఉపాధ్యాయులు

రేపటి నుంచి 102 కేంద్రాల్లో నిర్వహణ

జిల్లాలో హాజరుకానున్న 20,577 మంది విద్యార్థులు

28 సిట్టింగ్‌, 5 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ల నియామకం

కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పదవ తరగతి వార్షిక పరీక్షలకు విద్యాశాఖాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం నుంచి ప్రారంభంకానున్న పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 20,577 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల నుంచి 14,309 మంది, ప్రైవేట్‌ పాఠశాలల నుంచి 6,268 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 102 కేంద్రాలను ఎంపిక చేశారు. ఆయా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించారు.

జిల్లాలో 102 కేంద్రాల్లో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు 28 సిట్టింగ్‌, 5 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లను నియమించారు. అలాగే 1,079 మంది ఇన్విజిలేటర్లు, 58 కస్టోడియన్‌ అధికారులు, 102 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 102 మంది డిపార్ట్‌మెంట్‌ అధికారులను నియమించారు.

జిల్లాలో 8 సమస్యాత్మక కేంద్రాలు

గతంలో ఆయా కేంద్రాల వద్ద జరిగిన పరిణామాలను బట్టి జిల్లాలో ఈ ఏడాది 8 పరీక్షా కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. చీడికాడ, దేవరాపల్లి మండలం తెనుగుపూడి, గొలుగొండ, నాతవరం, పాయకరావుపేట మండలం పాల్తేరు జడ్పీ హైస్కూల్‌, రావికమతం, ఎస్‌.రాయవరం, సబ్బవరం మండలం రావలమ్మపల్లి జడ్పీ హైస్కూళ్ల వద్ద ఎటువంటి మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా సిట్టింగ్‌ స్క్వాడ్‌లను నియమించారు. సమస్యాత్మక కేంద్రాలతో పాటు మిగిలిన అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది.

విద్యార్థుల హాల్‌ టికెట్లు జియో ట్యాగ్‌

విద్యార్థులు తమ హాల్‌ టికెట్ల ద్వారా పరీక్షా కేంద్రాల వివరాలు (లొకేషన్‌)ను జియో ట్యాగింగ్‌ చేశారు. దీని ద్వారా విద్యార్థులు హాల్‌ టికెట్‌ ఆధారంగా క్యూఆర్‌ కోడ్‌లను వినియోగించుకొని సెంటర్ల వివరాలు తెలుసుకొనే వెసులుబాటు కల్పించారు. అంతే కాకుండా ఈ ఏడాది విద్యార్థులకు పరీక్షలకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా, సమస్యలు ఎదురైనా సంప్రతించేందుకు జిల్లా స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్లు: 9963299492, 9246666525, 6304444980, 9866095364, 9705143380 అందుబాటులో ఉంచారు.

పటిష్ఠ బందోబస్తు

అనకాపల్లి రూరల్‌: టెన్త్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తుహిన్‌సిన్హా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. పరీక్షల సమయంలో కేంద్రాల చుట్టుపక్కల జెరాక్స్‌, ఇంటర్నెట్‌ షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. సమస్యాత్మక, సున్నితమైన కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసు నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Mar 14 , 2026 | 11:29 PM