మహానాడుకు సర్వం సిద్ధం
ABN , Publish Date - May 27 , 2026 | 12:16 AM
తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలకు అన్ని నియోజకవర్గాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు జిల్లాలో 73 క్లస్టర్లలో ఈసారి వర్చువల్ విధానంలో మహానాడు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు సమావేశాలు ప్రారంభం అవుతాయి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రత్యేక ప్రసారంతోపాటు వర్చువల్ నిర్వహణ కోసం ఆయా క్లస్టర్లలో ఎంపిక చేసిన ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాల్లో భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేశారు.
రెండు రోజులపాటు వర్చువల్‌గా నిర్వహణ
జిల్లాలో 73 క్లస్టర్లలో సమావేశాలు
ప్రతి క్లస్టర్‌లో 300 మంది వరకు నేతలు, ముఖ్యకార్యకర్తలు హాజరు
అనకాపల్లి, మే 26 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలకు అన్ని నియోజకవర్గాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు జిల్లాలో 73 క్లస్టర్లలో ఈసారి వర్చువల్ విధానంలో మహానాడు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు సమావేశాలు ప్రారంభం అవుతాయి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రత్యేక ప్రసారంతోపాటు వర్చువల్ నిర్వహణ కోసం ఆయా క్లస్టర్లలో ఎంపిక చేసిన ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాల్లో భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేశారు. మండలానికి రెండు నుంచి మూడు వరకు క్లస్టర్లను ఏర్పాటు చేశారు. అనకాపల్లి నియోజకవర్గంలో 11, చోడవరంలో 10, మాడుగులలో 9, పెందుర్తిలో 12, ఎలమంచిలిలో 10 పాయకరావుపేటలో 10, నర్సీపట్నంలో 11 క్లస్టర్లు వున్నాయి. మహానాడు సమావేశాలకు హాజరయ్యే నేతలు, కార్యకర్తలకు గుర్తింపు కార్డులను ఇప్పటికే ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలు జారీ చేశారు. మహానాడు హాజరయ్యే వారికి అల్పాహారం, భోజనం ఏర్పాటు చేస్తున్నారు.
ఈ నెల 27, 28 తేదీల్లో వర్చువల్‌గా నిర్వహించే మహానాడుకు ప్రతి క్లస్టర్ నుంచి 300 మందికి తగ్గకుండా ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిలు, పరిశీలకులతోపాటు నాయకులు, ముఖ్య కార్యకర్తలు, పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్టు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి కొంతమంది నేతలకు రాష్ట్రస్థాయిలో వర్చువల్‌గా ప్రసంగించే అవకాశం లభిస్తుందని వారు వెల్లడించారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆయా క్లస్టర్ల వద్ద తెలుగుదేశం జెండాను ఎగురవేసి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాలని, ఆ తరువాత సమావేశాలు ప్రారంభించాలని చెప్పారు. కార్యకర్తలు కచ్చితంగా పసుపు రంగు చొక్కా ధరించి, గుర్తింపు కార్డుతో హాజరు కావాలని వారు సూచించారు.