స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:22 PM
జిల్లా కేంద్రం పాడేరులో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ముఖ్యఅతిథిగా కలెక్టర్ నిషాంతి జెండా ఆవిష్కరణ
జెండా పండుగకు తలారిసింగి మైదానమే వేదిక
పాడేరు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పాడేరులో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా స్థాయిలో జరిగే ఈ వేడుకలకు స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల క్రీడా మైదానం వేదిక కానున్నది. జిల్లా కలెక్టర్ టి.నిషాంతి ముఖ్యఅతిథిగా పాల్గొని పోలీసు వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అలాగే జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ ఆధ్వర్యంలో ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌కు గౌరవ వందనం ఇచ్చేందుకు ప్రత్యేక పోలీస్ పేరెడ్‌ను నిర్వహించేందుకు 50 మంది ఆర్ముడ్ రిజర్వుడ్ కానిస్టేబుళ్లు మూడు రోజుల నుంచి సాధన చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అభివృద్ధి, సంక్షేమ కారార్యక్రమాలపై శకటాలు, ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఆయా ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా విద్యార్థుల ప్రదర్శనలు
పాడేరులో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో విద్యార్థుల దేశభక్తి ప్రదర్శనలే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సుమారు 15 పాఠశాలలకు చెందిన గిరిజన విద్యార్థులు వివిధ రకాల దేశభక్తి, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఇచ్చేందుకు, అతిథులకు గౌరవ వందనం కవాతు చేసేందుకు వారం రోజులుగా తమ పాఠశాలల్లో సాధన చేస్తున్నారు. అలాగే స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల విద్యార్థుల మానవ పిరమిడ్, విలువిద్య, కొయ్యూరు ఆశ్రమ పాఠశాల విద్యార్థులు మల్లకంభ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
స్వాతంత్య్ర వేడుకల్లో కార్యక్రమాలివే
పాడేరులో శనివారం ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఉదయం 9 గంటలకు జాతీయ పతాకావిష్కరణ, 9.10కి పోలీస్ పేరెడ్, గౌరవ వందనం స్వీకరణ, 9.20కు కలెక్టర్ సందేశం, 10.00 విద్యార్థులతో దేశభక్తి, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన, 11.00కు ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాల పంపిణీ, అనంతరం ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్ల ప్రదర్శన, 11.30 గంటలకు వందన సమర్పణతో కార్యక్రమం ముగుస్తుంది.