Share News

ఉత్సవ్‌కు సర్వం సిద్ధం

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:57 AM

జిల్లాలో తొలిసారి నిర్వహిస్తున్న ‘అనకాపల్లి ఉత్సవ్‌’కు జిల్లా కేంద్రంతోపాటు ముత్యాలమ్మపాలెం బీచ్‌, కొండకర్ల ఆవ ముస్తాబయ్యాయి. రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు కొండకర్ల ఆవ వద్ద ప్రారంభిస్తారు. తరువాత ఉదయం 11.30 గంటలకు అనకాపల్లి ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డుకు చేరుకొని పుష్పప్రదర్శనను ప్రారంభిస్తారు. ఈ ఫ్లవర్‌ షోను రెండు రోజుపాటు ఉచితంగా సందర్శించవచ్చు.

ఉత్సవ్‌కు సర్వం సిద్ధం
ఫ్లవర్‌ షోలో పువ్వులతో రూపొందించిన గణనాథుడు, ఏనుగులు

నేడే ప్రారంభం

ఎన్టీఆర్‌ స్టేడియంలో ప్రధాన వేదిక

బెల్లం మార్కెట్‌లో పుష్ప ప్రదర్శన

ముత్యాలమ్మపాలెంలో బీచ్‌ ఫెస్టివల్‌

ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి అనిత,

ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, ఎస్పీ

అధికారులకు పలు సూచనలు

అనకాపల్లి టౌన్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలిసారి నిర్వహిస్తున్న ‘అనకాపల్లి ఉత్సవ్‌’కు జిల్లా కేంద్రంతోపాటు ముత్యాలమ్మపాలెం బీచ్‌, కొండకర్ల ఆవ ముస్తాబయ్యాయి. రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు కొండకర్ల ఆవ వద్ద ప్రారంభిస్తారు. తరువాత ఉదయం 11.30 గంటలకు అనకాపల్లి ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డుకు చేరుకొని పుష్పప్రదర్శనను ప్రారంభిస్తారు. ఈ ఫ్లవర్‌ షోను రెండు రోజుపాటు ఉచితంగా సందర్శించవచ్చు.

ప్రధాన వేడుకలు జరిగే ఎన్టీఆర్‌ మునిసిపల్‌ స్టేడియంతోపాటు ఇతరచోట్ల ఏర్పాట్లు తుది దశకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను విజయవంతం అయ్యేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేస్తున్నారు. శుక్రవారం గాయని సంగీత, శనివారం గాయకుడు రామ్‌ మిరియాల ఆధ్వర్యంలో రాత్రి 7.30 గంటల నుంచి పది గంటల వరకు సంగీత విభావరి వుంటాయి. ఇంకా జిల్లాలో ప్రసిద్ధి చెందిన వివిధ రకాల వంటకాలతో ఫుడ్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. రాత్రికి చూపరులను ఆకట్టుకునేలా బాణసంచా కాలుస్తారు. స్టేడియంలో భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్‌, బయట పలుచోట్ల మధ్యతరహా ఎల్‌ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేశారు. సంగీత విభావరి, ఇతర కార్యక్రమాలను వీక్షించే ప్రేక్షకులు కూర్చునేందుకు పెద్ద సంఖ్యలో కుర్చీలు వేశారు. ఎన్టీఆర్‌ స్టేడియం గ్యాలరీలను వివిధ రంగులతో అందంగా తీర్చిదిద్దారు.

ఆకట్టుకునేలా ఫ్లవర్‌ షో

అనకాపల్లి ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో భారీ ఎత్తున పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. గురువారం రాత్రికి ఏర్పాట్లు, అలంకరణలు పూర్తయ్యాయి. ప్రవేశ మార్గం వద్ద వివిధ రకాల పూలతో స్వాగత ద్వారాన్ని ఆకర్షణీయంగా నిర్మించారు. లోపల పూలతో వినాయకుడిని, రెండు వైపులా ఏనుగులను అలంకరించారు. రకకాల పూలతో ప్రేమజంట, డాల్ఫిన్‌ చేపలు, పెంగ్విన్‌లు, పుట్టగొడుగుల ఆకృతను ఏర్పాటు చేశారు. పచ్చని ఆకులతో శివలింగం, ఏనుగు, ఒంటెలు, జింకలను తీర్చిదిద్దారు. నూకాంబిక అమ్మవారి సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు.

ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్‌, ఎస్పీ

ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో చేపట్టిన ఫ్లవర్‌ షో ఏర్పాట్లను గురువారం సాయంత్రం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌సిన్హా పరిశీలించారు. కొన్ని అలంకరణల వద్ద ఫొటోలు దిగారు. వీరి వెంట ఆర్డీవో షేక్‌ ఆయీషా, జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌ కె.చక్రవర్తి, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, కార్పొరేషన్ల చైర్మన్లు బత్తుల తాతయ్యబాబు, పీలా గోవింద సత్యనారాయణ, పీవీజీ కుమార్‌, మళ్ల సురేంద్ర, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు పలువురు అధికారులు వున్నారు.

Updated Date - Jan 30 , 2026 | 12:57 AM