పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Mar 15 , 2026 | 12:58 AM
పదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది.
రేపటి నుంచి ప్రారంభం
అరగంట ముందునుంచి కేంద్రాల్లోకి అనుమతి
జిల్లాలో 28,983 మంది విద్యార్థులకు 133 కేంద్రాల ఏర్పాటు
విశాఖపట్నం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి):
పదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు ఏప్రిల్ ఒకటో తేదీ వరకూ జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్ పరీక్షలు (25, 28 తేదీల్లో) మాత్రం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పది గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.
జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 456 పాఠశాలల నుంచి 28,983 మంది హాజరవుతున్నారు. వీరిలో 15,292 మంది బాలురు, 13,691 మంది బాలికలు ఉన్నారు. పరీక్షల నిర్వహణకు 133 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రతి కేంద్రంలో ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ ఆఫీసర్‌ను పర్యవేక్షణ నిమిత్తం అధికారులు నియమించారు. పరీక్షల కోసం 1,634 మంది ఇన్విజిలేటర్లను నియమించగా, వారిలో 20 శాతం మంది ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు ఉన్నారు. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన ఎనిమిది కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసినట్టు డీఈవో ప్రేమ్‌కుమార్ వెల్లడించారు. జిల్లాలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు 260 మంది ఉండగా, వారికి స్కైబ్స్‌ను ఏర్పాటు చేయించారు.
ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించింది. విద్యార్థులు తమ హాల్ టికెట్లను చూపించడం ద్వారా ఈ సదుపాయాన్ని పొందవచ్చు.
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
- ప్రేమ్‌కుమార్, డీఈవో
జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశాం. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటుచేశాం. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు ఏర్పాటుచేయడంతోపాటు విద్యుత్ సదుపాయం ఉండేలా చర్యలు చేపట్టాం. హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. వాటిని స్కాన్ చేయడం ద్వారా పరీక్షా కేంద్రాల లొకేషన్ తెలుసుకోవచ్చు. ముందురోజు తల్లిదండ్రులు వెళ్లి పరీక్షా కేంద్రాలను చూసుకోవడం వల్ల పరీక్షకు వెళ్లే రోజు ఇబ్బందులు పడకుండా ఉండవు.