Share News

మహానాడుకు సర్వం సిద్ధం

ABN , Publish Date - May 27 , 2026 | 12:44 AM

తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది మహానాడును హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించనున్నది.

మహానాడుకు సర్వం సిద్ధం

నేడు, రేపు నిర్వహణ

కేంద్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమాల వీక్షణకు ప్రతి క్లస్టర్‌లో పది నుంచి 12 స్ర్కీన్లు

150 నుంచి 300 మంది నాయకులు, కార్యకర్తలు వీక్షించడానికి ఏర్పాట్లు

పర్యవేక్షించనున్న ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు

విశాఖపట్నం, మే 26 (ఆంధ్రజ్యోతి):

తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది మహానాడును హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించనున్నది. ఇందుకోసం జిల్లా, నియోజకవర్గ నేతలు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధ, గురువారాల్లో మహానాడు నిర్వహిస్తారు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన జరగనున్న కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేశ్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు, మంత్రులు, నేతలు ప్రసంగిస్తారు. మొత్తం 20 అంశాలపై చర్చించి తీర్మానాలు చేస్తారు. రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించడానికి ప్రతి క్లస్టర్‌లో స్ర్కీన్లు ఏర్పాటుచేస్తున్నారు. వేసవి కాలం దృష్ట్యా ఏసీ కల్యాణ మండపాలు, హాళ్లు బుక్‌ చేశారు. ఆయా అంశాలపై చర్చించి తీర్మానాల్లో పాల్గొనేందుకు పలు క్లస్టర్‌లలో నేతలకు అవకాశం ఇవ్వనున్నారు.

విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని 82 క్లస్టర్‌లలో స్ర్కీన్లు ఏర్పాటుచేశారు. భీమిలి, విశాఖ ఈస్ట్‌, వెస్ట్‌, నార్త్‌, సౌత్‌, గాజువాక నియోజకవర్గాల్లో 12 వంతున, ఎస్‌.కోటలో 10 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్‌ ఇన్‌చార్జి ఆధ్వర్యంలో ఎంపిక చేసిన కల్యాణ మండపాల్లో స్ర్కీన్లు, 150 నుంచి 300 మంది నాయకులు, కార్యకర్తలు కూర్చొని వీక్షించడానికి వీలుగా కుర్చీలు ఏర్పాటుచేశారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు ప్రతి క్లస్టర్‌లో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కార్యక్రమ ఉద్దేశాలను వివరిస్తారు. అనంతరం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి కార్యక్రమాలను లైవ్‌లో వీక్షించనున్నారు.

పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు చోడే వెంకటపట్టాభి, ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ, ఇతర నాయకులు మంగళవారం జిల్లా కార్యాలయంలో మహానాడు నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించారు. అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు, క్లస్టర్‌ ఇన్‌చార్జులతో ఫోన్‌లో మాట్లాడి బుధ, గురువారాల్లో మహానాడు నిర్వహణకు తీసుకోవల్సిన చర్యలకు వివరించారు. ఎంపీ ఎం.శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు ఈ రెండు రోజులు పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పలు క్లస్టర్‌లలో ఏర్పాటుచేసిన లైవ్‌ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని క్లస్టర్‌లో సభ్యులు, నాయకుల కోసం జిల్లా పార్టీ కార్యాలయంలో లైవ్‌ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ప్రతిచోట వేదిక, పరిసరాలకు పార్టీ జెండాలు, తోరణాలతో అలంకరించారు.

Updated Date - May 27 , 2026 | 12:44 AM