Share News

సర్వం సిద్ధం

ABN , Publish Date - May 10 , 2026 | 12:50 AM

అనకాపల్లి వాసులు, చుట్టు పక్కల గ్రామాల్లో కూరగాయలు పండించే రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుబజారు ఎట్టకేలకు సిద్ధమైంది. ఎన్టీఆర్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన ఈ రైతుబజారులో మొత్తం వంద షాపులు వున్నాయి. పనులన్నీ పూర్తికావడంతో వారం రోజుల్లో ప్రారంభించే అవకాశం వుందని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.

సర్వం సిద్ధం
ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో నిర్మాణం పూర్తయిన రైతుబజారు

రైతుబజారు నిర్మాణ పనులు పూర్తి

మొత్తం వంద దుకాణాలు

రైతులకు 72, డ్వాక్రా సంఘాలకు 25, దివ్యాంగులకు మూడు...

మొత్తం 220 మంది దరఖాస్తు

అర్హులకు లాటరీ ద్వారా షాపుల కేటాయింపు

వారం రోజుల్లో రైతుబజారు ప్రారంభం?

అనకాపల్లి టౌన్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి వాసులు, చుట్టు పక్కల గ్రామాల్లో కూరగాయలు పండించే రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుబజారు ఎట్టకేలకు సిద్ధమైంది. ఎన్టీఆర్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన ఈ రైతుబజారులో మొత్తం వంద షాపులు వున్నాయి. పనులన్నీ పూర్తికావడంతో వారం రోజుల్లో ప్రారంభించే అవకాశం వుందని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనకాపల్లికి రైతుబజారు మంజూరు చేసినప్పటికీ దానిని ఏర్పాటు చేయడంలో అప్పటి పాలకులు శ్రద్ధ చూలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఆర్డీవో షేక్‌ ఆయీషాలు రైతుబజారు ఏర్పాటు కోసం ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో ఖాళీగా ఉన్న బ్లాకులను పరిశీలించారు. నాగదుర్గమ్మ ఆలయానికి ఎదురుగా చాలా కాలం నుంచి నిరుపయోగంగా ఉన్న 17, 18 బ్లాకుల్లో రైతుబజారు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పటికే ప్రభుత్వం మంజూరు చేసిన రూ.14.5 లక్షలతో గత ఏడాది డిసెంబరులో అభివృద్ధి పనులు చేపట్టారు. నిధులు చాలకపోవడంతో విద్యుద్దీకరణ, ఇతర పనులు చేపట్టలేదు. ప్రభుత్వం మళ్లీ నిధులు మంజూరు చేయడంతో విద్యుత్‌ వైరింగ్‌, ఆర్వో ప్లాంట్‌కు రూ.9.5 లక్షలు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.12.5 లక్షలు ఖర్చు చేసి, వారం రోజుల క్రితం పనులు పూర్తిచేశారు. మొత్తం వంద షాపులను సిద్ధం చేశారు. వీటిలో 25 షాపులను డ్వాక్రా సంఘాలకు, మూడింటిని దివ్యాంగులకు, మిగిలిన 72 షాపులను రైతులకు కేటాయించనున్నారు. ఆయా వర్గాల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా.. 150 మంది రైతులు, 50 వరకు డ్వాక్రా సంఘాలు, 20 మంది దివ్యాంగులు దరఖాస్తు చేసుకున్నారని మార్కెటింగ్‌ శాఖ ఏడీ అశోక్‌కుమార్‌ తెలిపారు. వీటిని పరిశీలించి అర్హుల జాబితాను తయారు చేసి, అనంతరం లాటరీ పద్ధతిలో షాపులను కేటాయిస్తామని చెప్పారు. రైతుబజారు నిర్మాణ పనులు పూర్తయిన విషయాన్ని ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని, వారం రోజుల్లో ప్రారంభించే అవకాశం వుందని ఆయన వెల్లడించారు.

Updated Date - May 10 , 2026 | 12:50 AM