దేవాలయాల్లో అంతా ఆన్‌లైన్
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:55 AM
జిల్లాలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో భక్తులకు సులువుగా దైవదర్శనం లభిస్తోంది.
మన మిత్ర యాప్‌లోనే వెసులుబాటు
ముందుగానే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం
ప్రసాదం సహా అన్నింటికీ ఒకటే విధానం
నగదు రహిత లావాదేవీలు అమలు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో భక్తులకు సులువుగా దైవదర్శనం లభిస్తోంది. దేవదాయ శాఖ ఆన్‌లైన్ సేవలు ప్రవేశ పెట్టడంతో ముందుగానే టికెట్లు బుక్ చేసుకొని, క్యూలైన్లతో పనిలేకుండా నేరుగా ఆలయంలోకి వెళ్లే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రక్రియతో తక్కువ సమయంలో దర్శనాలు పూర్తవుతున్నాయి.
భక్తులకు మెరుగైన వసతులు, సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం దేవదాయ శాఖను ఆదేశించింది. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలని, భక్తుల నుంచి అభిప్రాయాలు తీసుకొని, మెరుగైన సేవలు అందించాలని సూచించింది. దీంతో ప్రభుత్వం వాట్సాప్ ద్వారా అన్ని రకాల సేవలు అందించే ‘మన మిత్ర’ యాప్‌ను దేవదాయ శాఖ వినియోగించుకుంటోంది. దేవాలయానికి వెళ్లాలనుకునేవారు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, ఏ రోజున.. ఏ సమయానికి ... ఎటువంటి దర్శనం, సేవ కావాలో ఎంపిక చేసుకుని, ఆ మేరకు మొత్తం చెల్లిస్తే స్లాట్ బుక్ అవుతుంది. ఆ రోజున ఆలయానికి వెళ్లి వివరాలు చూపిస్తే... ప్రత్యేక లైన్ ద్వారా దర్శనానికి పంపిస్తారు. అందరిలా క్యూలైన్‌లో నిల్చోవలసిన అవసరం లేదు. ప్రసాదానికి కూడా ఆన్‌లైన్‌లోనే ముందుగా డబ్బులు చెల్లించి, రశీదు కౌంటర్‌లో చూపిస్తే చాలు. ఆన్‌లైన్ బుకింగ్‌తో సమయం ఆదా అవుతున్నదని, రద్దీ భయం లేదని భక్తులు చెబుతున్నారు.
ముందుగా పెద్ద ఆలయాల్లో
దేవదాయశాఖలో ఆదాయాన్ని బట్టి ఆలయాలను విభజిస్తారు. ఏడాదికి రూ.75 లక్షల కుంటే ఎక్కువ ఆదాయం ఉంటే 6-ఏ విభాగంలో చేరుస్తారు. జిల్లాలో సింహాచలం, కనకమహాలక్ష్మి, ఇసుక కొండ సత్యనారాయణస్వామి, పెదవాల్తేరు, పోలమాంబ, జ్ఞానాపురం ఎర్నిమాంబ, వైభవ వేంకటేశ్వరస్వామి ఇలా 12 ఆలయాలు ఈ విభాగంలో ఉన్నాయి. తొలుత సింహాచలం, కనకమహాలక్ష్మి ఆలయంలో యాప్ ద్వారా దర్శనాలు ప్రారంభించారు.రూ.25 లక్షలు దాటి రూ.75 లక్షల లోపు ఆదాయం ఉన్న వాటిని 6-బి ఆలయాలుగా వ్యవహరిస్తారు. రూ.25 లక్షల లోపు ఆదాయం ఉన్న వాటిని 6-సిగా గుర్తిస్తారు. ఇప్పుడు 6-ఏ, 6-బి ఆలయాలన్నింటిలోను మన మిత్ర యాప్ ద్వారానే టికెట్లు జారీ చేస్తున్నారు.
ఎవరైనా ఆన్‌లైన్‌లోనే..
ఆన్‌లైన్ టికెట్ ఆప్షన్ తప్పనిసరి చేశారు. నేరుగా ఆలయానికి వెళ్లి దర్శనం క్యూలైన్‌లో నిల్చొన్నా అక్కడ భక్తుడి మొబైల్ ఫోన్‌లో మనమిత్ర యాప్ డౌన్‌లోడ్ చేసి, అందులో ఫోన్‌పే/గూగుల్ పే ద్వారా టికెట్లు తీయించాకే దర్శనాలకు పంపుతున్నారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నారు. టిక్కెట్ తీసుకునే సమయంలో హుండీలో దక్షిణ మొత్తం, ప్రసాదాలు ఎన్ని కావాలి, డొనేషన్ ఇస్తారా? తెలుసుకొని, ఆయా మొత్తాలు ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేయిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా అన్ని ఆలయాల్లో కియోస్క్‌లు ఏర్పాటుచేశారు. అక్కడ నిరక్షరాస్యులైన భక్తుల సహాయం కోసం సిబ్బందిని నియమించారు. మొబైల్, ఫోన్‌పే లేని వారికి పక్క భక్తుల మొబైల్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. హుండీలు, పూజారి పళ్లాల్లో దక్షిణకు తప్ప నగదు లావాదేవీలు లేకుండా చేశారు.