Share News

ప్రతి ఒక్కరి పనితీరు మారాల్సిందే!

ABN , Publish Date - Aug 31 , 2026 | 11:09 PM

జిల్లాలోని ప్రతి ఒక్కరి పనితీరు మారాల్సిందేనని అధికారులను కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మలతో కలిసి జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

ప్రతి ఒక్కరి పనితీరు మారాల్సిందే!
మాట్లాడుతున్న కలెక్టర్‌ నిషాంతి, పక్కన జేసీ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ

జిల్లా అధికారులకు కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశం

ప్రజలకు మెరుగైన సేవలందించి, సంతృప్తి స్థాయిని పెంచాలని సూచన

పాడేరు, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రతి ఒక్కరి పనితీరు మారాల్సిందేనని అధికారులను కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మలతో కలిసి జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని పలువురు అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరకులోయ మండలం గన్నెల ప్రజావేదికలో అసంతృప్తి వ్యక్తం చేశారని, ఈ క్రమంలో అధికారులు తమ పనితీరును మరింతగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న క్రమంలో ఎటువంటి సాకులు చెప్పకుండా పూర్తి సామర్థ్యంతో అందరూ పని చేయాలన్నారు. తమకు అందుబాటులో ఉన్న వనరులను పక్కాగా ఉపయోగించుకుని చక్కని ఫలితాలు సాధించాలన్నారు.

కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి

జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని కలెక్టర్‌ టి.నిషాంతి సూచించారు. తమ ప్రాంతంలో ఏం జరుగుతుందనే విషయాలు ప్రజలకు తెలియజేయడం ద్వారా వారిలో అవగాహన పెరుగుతుందన్నారు. ఫలితంగా ప్రజల్లో ప్రభుత్వ యంత్రాంగంపై ఉన్న ప్రతికూల అభిప్రాయాలు తొలగుతాయన్నారు. ప్రజలతో మమేకమవుతూ అధికారులు పని చేయాలని సూచించారు. అలాగే క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయంగా ఉంటూ వారి పనితీరును మెరుగుపరచాలన్నారు. ప్రతి రోజూ శాఖల వారీగా ఉదయం 11 గంటలకు సిబ్బంది హాజరుపై నివేదిక సమర్పించాలన్నారు. అదే రోజు సిబ్బంది చేపట్టిన పనులపైనా వివరాలు తెలిపాలన్నారు. సిబ్బందిలో జవాబుదారీతనం పెంచాలని, అధికారులు సైతం కార్యాలయాలకే పరిమిత కావద్దని కలెక్టర్‌ హెచ్చరించారు. క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. గ్రామసభలను ఏర్పాటు చేసి అక్కడ జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరించాలన్నారు. ఆస్పత్రుల అభివృద్ధి నిధులను పక్కాగా వినియోగించుకోవాలని, ప్రజలకు అవసరమైన సేవలు అందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోమారు జిల్లాకు వచ్చేనాటికి అందరి పనితీరును మెరుగుపరుచుకుని ఆయనతో శభాష్‌ అనిపించుకోవాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. ఏ.ఎస్‌.ఆర్‌ అంటే... అడాప్ట్‌, షోకేస్‌, రిప్లికేషన్‌ అనే నినాదంతో ప్రతి ఒక్క అధికారి స్ఫూర్తిదాయకంగా పని చేసి, చక్కని ఫలితాలు సాధించాలని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌.లోకేశ్వరరావు, ఆర్‌డీవో ఎం.భుజంగరావు, డ్వామా పీడీ విద్యాసాగరరావు, జిల్లా పంచాయతీ అధికారి కేపీ చంద్రశేఖర్‌, డీఎల్‌పీవో పీఎస్‌ కుమార్‌, డీఆర్‌డీఏ పీడీ జయకృష్ణ, జిల్లా విద్యాశాఖాధికారి భానుమూర్తిరాజు, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, డీఎంహెచ్‌వో రియాజ్‌బేగ్‌, మైక్రో ఇరిగేషన్‌ పీడీ రహీమ్‌, కాఫీ ఏడీ అయంతి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2026 | 11:09 PM