పర్యావరణ పరిరక్షణకు అందరి భాగస్వామ్యం
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:24 AM
పర్యావరణ పరిరక్షణకు అందరి భాగస్వామ్యం అవసరమని కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. స్థానిక డివిజనల్ అటవీ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏఎస్‌ఆర్- హరిత, పంచవటి కార్యక్రమాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు.
కలెక్టర్ టి.నిషాంతి పిలుపు
పాడేరులో ‘ఏఎస్‌ఆర్- హరిత, పంచవటి’ కార్యక్రమం ప్రారంభం
పాడేరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు అందరి భాగస్వామ్యం అవసరమని కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. స్థానిక డివిజనల్ అటవీ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏఎస్‌ఆర్- హరిత, పంచవటి కార్యక్రమాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణను బలోపేతం చేయడం, జీవ వైవిధ్యాన్ని సంరక్షించడమే ఏఎన్‌ఆర్- హరిత, పంచవటి కార్యక్రమం లక్ష్యమన్నారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన ఆహ్లాద, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో చేపడుతున్న ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీల పరిధిలో హరిత విప్లవాన్ని సృష్టించేందుకు కార్యదర్శులు కృషి చేయాలన్నారు. భారతీయ సంస్కృతిలో పంచవటి భావనకు ఉన్న ఆధ్యాత్మిక, సంప్రదాయ ప్రాధాన్యతతో పాటు పర్యావరణ సమతుల్యత, జీవవైవిధ్య పరిరక్షణలో పంచవటి వృక్షాల పాత్రను కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రావి, ఉసిరి, మేడి, మారేడు, సీతాఅశోక వంటి ఐదు ముఖ్యమైన జాతుల మొక్కల పెంపకాన్ని అటవీ శాఖ ప్రోత్సహిస్తుందన్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో అనువైన ప్రాంతాల్లో ఆయా జాతుల మొక్కల పెంపకం, సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు. అలాగే మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా పలువురు పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్ నిషాంతి మొక్కలను అందించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ అటవీ అధికారి ఉమామహేశ్వరి, డివిజన్ స్థాయి పంచాయతీ అధికారి పీఎస్.కుమార్, అటవీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.