Share News

తిలా పాపం తలా పిడికెడు

ABN , Publish Date - Oct 27 , 2026 | 01:50 AM

పెట్రోల్‌ బంకులకు నేరుగా వచ్చిన వాహనాలకు మాత్రమే పెట్రోలు/ డీజిల్‌ విక్రయించాలి.

తిలా పాపం తలా పిడికెడు

పీచుమామిడి విస్ఫోటనం వెనుక అంతులేని అలసత్వం

అనుమతి లేకుండానే పెట్రోల్‌ బంకుల్లో పెద్ద మొత్తంలో పెట్రోల్‌, డీజిల్‌ లూజు విక్రయాలు

పేలుడు పదార్థాల తరలింపుపైనా కొరవడిన నిఘా

అధికార యంత్రాంగం, కాంట్రాక్లర్‌ నిర్లక్ష్యానికి ఏడు నిండు ప్రాణాలు బలి

చోడవరం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి):

పెట్రోల్‌ బంకులకు నేరుగా వచ్చిన వాహనాలకు మాత్రమే పెట్రోలు/ డీజిల్‌ విక్రయించాలి. పెట్రోలియం చట్టం సెక్షన్‌ 2002 ప్రకారం పెట్రోలు/ డీజిల్‌ను ప్లాస్టిక్‌ బాటిళ్లు లేదా కేన్లలో లూజుగా విక్రయించడం నేరం. అగ్ని ప్రమాదాలు, అసాంఘిక కార్యకలాపాలకు దీనిని ఉపయోగించే ప్రమాదం ఉందన్న కారణంగా ప్రభుత్వం చాలా ఏళ్ల క్రితమే ఈ నిబంధన విధించింది. అలాంటిది బంకుల నుంచి వందల లీటర్ల పెట్రోల్‌, డీజిల్‌ను డ్రమ్ముల్లో కొట్టించి తీసుకెళుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తున్నది. అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పీచుమామిడి సమీపంలో ఈ నెల 24వ తేదీన జరిగిన భారీ విస్ఫోటం ఘటన వెనుక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఎంత ఉందో, అధికార యంత్రాంగం బాధ్యతారాహిత్యం కూడా అంతే వుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనంతగిరి మండలంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులలో బండరాళ్లను పేల్చేందుకు ఉపయోగించే జిలెటిన్‌ స్టిక్కులు, ఇతర ప్రమాదకరమైన పదార్థాలను కనీస జాగ్రత్తలు పాటించకుండా తరలించడమే భారీ విస్ఫోటనానికి కారణమని అంటున్నారు. వ్యాన్‌లో డ్రమ్ముల ద్వారా తెచ్చిన డీజిల్‌ను రోడ్డు పనుల్లో వినియోగిస్తున్న ఇతర వాహనాలలోకి ఎక్కిస్తుండగా మంటలు చెలరేగి, భారీ పేలుడు సంభవించడంతో ఏడుగురు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే, క్షేత్రస్థాయిలో నిబంధనల ఉల్లంఘనలు ఎంత దారుణంగా సాగుతున్నాయో అర్థం అవుతుందని అంటున్నారు.

అనంతగిరి మండలంలో జరుగుతున్న రహదారి నిర్మాణ పనుల్లో వినియోగిస్తున్న ఎక్స్‌కవేటర్లు, డంపర్లు, టిప్పర్లు, ట్రాక్టర్లు వంటి వాహనాలకు దేవరాపల్లితోపాటు విజయనగరం జిల్లా కొత్తవలస, ఎస్‌.కోటల్లోని బంకుల నుంచి పెద్ద మొత్తంలో పెట్రోలు, డీజిలు తీసుకెళుతుంటారు. వాస్తవానికి రోడ్డు పనులైనా, ఇతర పనులకైౖనా బంకుల నుంచి పెద్ద మొత్తంలో డీజిల్‌ లేదా పెట్రోల్‌ విక్రయించడానికి వీలులేదు. వ్యవసాయంలో వినియోగించే ట్రాక్టర్లు లేదా ఇతర అవసరాలకు విడిగా డీజిల్‌/ పెట్రోలు తీసుకెళ్లాలంటే స్థానిక రెవెన్యూ అధికారుల అనుమతి అవసరం. రహదారులు, వంతెనలు, ఇతర నిర్మాణ పనుల్లో వినియోగించే భారీ యంత్రాలు, వాహనాలకు పెద్ద మొత్తంలో డీజిల్‌ అవసరం అవుతుంది. ఇందుకోసం ఆయా కాంట్రాక్టర్లు సంబంధిత అధికారుల నుంచి అనుమతులు పొందవలసి ఉంటుంది. అలాగే పనులు జరిగే ప్రదేశంలో ఆయిల్‌ నిల్వ ఉంచడానికి పెట్రోలియం పేలుడు పదార్థాల భద్రతా సంస్థల నుంచి అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అలా కాని పక్షంలో జిల్లా స్థాయిలో కలెక్టర్‌ లేదా జాయింట్‌ కలెక్టర్‌, అగ్నిమాపక శాఖల నుంచి అనుమతి పొంది నిల్వ చేసుకోవాలి. పినకోట ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు పనులకు ఆయిల్‌ తరలింపులోగానీ, నిల్వ విషయంలోగానీ ఇటువంటి నిబంధనలను ఇటు పెట్రోల్‌ బంకు యజమానులు, అటు కాంట్రాక్టర్‌ పాటించిన దాఖలాలు కనిపించడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, బంకుల్లో ఇష్టారాజ్యంగా ఆయిల్‌ విక్రయించడం, ఆయిల్‌ తరలింపు/ నిల్వ విషయంలో కాంట్రాక్టర్‌ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఏడుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘోర ప్రమాదానికి బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. డీజిల్‌, పెట్రోల్‌ సంగతి కాసేపు పక్కనపెడితే, అత్యంత ప్రమాదకరమైన జిలెటిన్‌ స్టిక్కులు, వత్తులను కనీస జాగ్రత్తలు పాటించకుండా తరలిస్తుంటే.. పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతున్నది.

Updated Date - Oct 27 , 2026 | 01:50 AM