పంచాయతీల్లో ప్రతి పనికి పైసలే!
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:36 AM
ఏజెన్సీలో కొన్ని గ్రామ పంచాయతీల్లో కార్యదర్శుల అవినీతి అక్రమాలకు అడ్డులేకుండా పోతుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా పెదబయలు మండలం బొండపల్లి పంచాయతీ కార్యదర్శి కె.లక్ష్మీనారాయణ శానిటేషన్ బిల్లుకు పాస్ ఆర్డర్ వేసేందుకు రూ.30 వేలు డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కడంతో పంచాయతీ కార్యదర్శుల అక్రమాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి.
గ్రామస్థాయిలో పలువురు కార్యదర్శుల అక్రమాలకు అడ్డులేని పరిస్థితి
ప్రజలకు కార్యదర్శులతో నిత్యం పనులుండడంతో ఫిర్యాదు చేయలేని దుస్థితి
శానిటేషన్ బిల్లుకు రూ.30 వేలు డిమాండ్ చే సి ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
మన్యంలో అనేక మంది పంచాయతీ కార్యదర్శులపై అవినీతి ఆరోపణలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ఏజెన్సీలో కొన్ని గ్రామ పంచాయతీల్లో కార్యదర్శుల అవినీతి అక్రమాలకు అడ్డులేకుండా పోతుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా పెదబయలు మండలం బొండపల్లి పంచాయతీ కార్యదర్శి కె.లక్ష్మీనారాయణ శానిటేషన్ బిల్లుకు పాస్ ఆర్డర్ వేసేందుకు రూ.30 వేలు డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కడంతో పంచాయతీ కార్యదర్శుల అక్రమాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి.
గ్రామస్థాయిలో ప్రతి పనికీ డబ్బులే..
ఏజెన్సీలో అనేక మండలాల్లోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రతి పనికీ డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నారు. ప్రజలకు సంబంధించిన ఇంటి నిర్మాణ అనుమతులు, బెయిల్ కోసం ఇచ్చే సాల్వెన్స్‌లు, ఇంటి పన్నులతో పాటు ప్రధానంగా 14, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనులకు సంబంధించి అధికంగా కమీషన్లు వసూలు చేయడం, పలు సందర్భాల్లో సర్పంచులకు కమీషన్లు ఇచ్చి సదరు పంచాయతీ కార్యదర్శులే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తుతున్న వైనాలున్నాయని పలువురు సర్పంచులు అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలకు 14, 15 ఆర్థిక సంఘ నిధులు ముమ్మరంగా మంజూరు కావడంతో వాటిని ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా వ్యయం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఇదే అదనుగా ఆయా పనులకు సంబంధించి ఎటువంటి నిబంధనలు పాటించకుండా సిమెంట్ కాంక్రీట్ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పథకాలు, పారిశుధ్య పనులు చేపట్టి అందినకాడికి పంచాయతీ కార్యదర్శులు బాగానే జేబులు నింపుకొన్నారనేది బహిరంగ రహస్యం. నిధులు వ్యయం చేయాలని, పనులు పూర్తి చేయాలనే ప్రభుత్వ ఆదేశాలను తమకు అనుకూలంగా మలచుకుని చక్కగానే సొమ్ము చేసుకున్నారు. అలాగే పారిశుధ్య పనులు, క్లాప్‌మిత్రల వేతనాలకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులు గట్టిగానే కమీషన్లు వసూలు చేస్తున్నారని తెలిసింది. అయితే కార్యదర్శులతో ప్రజలకు నిత్యం పనులుండడంతో ఎవరూ ఫిర్యాదు చేసేందుకు సాహసించకపోవడం, అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కావడంతో అనేక చోట్ల అక్రమాలు జరుగుతున్నా వెలుగులోకి రాని పరిస్థితి కొనసాగుతున్నది. అయితే అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడం, పదే పదే తమ చుట్టూ తిప్పుకోవడం వంటి చర్యలతోనే బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. పెదబయలు మండలం బొండపల్లి పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణపై ఏపీబీ దాడి వెనుక ఇటువంటి పరిస్థితే ఉంది. నీటి ట్యాంక్‌ను నిర్మించిన మల్లేశ్వరరావు అనే వ్యక్తికి సంబంధించి రూ.97 వేలు బిల్లు మంజూరు చేసేందుకు రూ.30 వేలు లంచం అడగడంతో ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఇది కేవలం వెలుగులోకి వచ్చిన ఒక ఘటన మాత్రమే ఏజెన్సీ వ్యాప్తంగా ఇటువంటి లంచగొండి పంచాయతీ కార్యదర్శులు చాలా మంది ఉన్నారనేది అక్షర సత్యం.